mt_logo

ఆప్షన్లు ఇస్తే మళ్ళీ ఉద్యమమే!!

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ కేంద్రప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న పక్షపాత ధోరణిపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ళు, నిధులు, నియామకాలను సాధించుకునే దిశగా నడిచింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉండేలా ఆప్షన్లు ఇస్తూ కేంద్రం నిబంధనలు చేస్తుండటం తెలంగాణ ఉద్యమస్ఫూర్తికే భంగం వాటిల్లేలా ఉందని పలువురు తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇదే జరిగితే మళ్ళీ ఉద్యమం చేయడానికికూడా సిద్ధమని, ఆప్షన్ల పేరుతో తెలంగాణ ప్రాంత ఉద్యోగాలను కొట్టేయాలని చూస్తున్న సీమాంధ్ర కుట్రలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉండేలా ఆప్షన్లు ఇస్తే తెలంగాణ ఇవ్వడంలో అర్థం లేదని, 1969, 2001 ఉద్యమాలు ఉద్యోగాల దోపిడీకి వ్యతిరేకంగానే ప్రారంభమయ్యాయని, లక్షల సంఖ్యలో తెలంగాణ ఉద్యోగాలను సీమాంధ్రులు దోచుకున్నారనటానికి సాక్ష్యాలు అనేకం ఉన్నాయని తెలంగాణ వాదులు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా సీమాంధ్రులే ఉన్నారని, అటెండర్ నుండి అన్ని శాఖల కార్యదర్శులవరకు అక్రమంగా నియామకాలు జరిగాయని, పంచాయితీరాజ్, మున్సిపాలిటీలలో భారీ ఎత్తున సీమాంధ్ర ఉద్యోగుల నియామకాలు జరిగాయని, డిప్యుటేషన్ల పేరుతో చాలామంది హైదరాబాద్ లో కొనసాగుతున్నారని తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఆప్షన్ల సాకుతో హైదరాబాద్ లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా పనులు పూర్తిచేసుకోవడానికి, హైదరాబాద్ చుట్టుపక్కల వేలకోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులకు తెలంగాణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలనే దీర్ఘకాలిక కుట్రకు పాల్పడినట్లు తెలుస్తుంది. విభజనకు స్థానికతే ఆధారం కావాలని గతంలో తెలంగాణ ఉద్యోగసంఘాలు కమల్ నాథన్ కమిటీకి అనేక నివేదికలు సమర్పించిన విషయం తెలిసిందే.

స్థానికతను ఆధారంగానే ఉద్యోగుల పంపిణీని చేపట్టాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పంపిణీ విషయంలో రాజ్యాంగ సూత్రాలను అమలు చేయాలన్నారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల పంపిణీ విషయంలో స్థానికతను పాటించాలన్నది ప్రాంతీయ మౌఢ్యం నుంచి పుట్టింది కాదని, ఆర్టికల్ 371-డీ ఆధారంగానే ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో ఆప్షన్ అన్నది ఒక అవకాశం మాత్రమేనని, విధిగా పాటించాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు. ఆప్షన్ పేరిట బలవంతంగా సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో కొనసాగించేందుకు కుట్రలు చేస్తే రాజ్యాంగబద్ధంగా చేయాల్సిందంతా చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు.

సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్ ఇస్తామంటే ఒప్పుకునేది లేదని టీఎన్జీవోల కేంద్ర సంఘం అధ్యక్షుడు జీ దేవీప్రసాద్‌రావు స్పష్టం చేశారు. ఆప్షన్ అంటే మరో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో మూడు కొత్త రాష్ట్రాలు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్‌లు ఏర్పడినపుడు అమలుచేయని ఆప్షన్ పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎక్కడి ఉద్యోగిని అక్కడికి పంపించేయాల్సిందేనన్నారు. ముందు తాత్కాలిక ఉద్యోగుల పంపిణీలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులను ఎక్కడికక్కడే విభజించి, మిగిలిన వారి సంగతిని ప్రత్యేక కమిటీకి వదిలి వేయాలన్నారు.

ఉద్యోగులకు పంపిణీలో ఆప్షన్లను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. 1200 మంది అమరులైన తరువాత వచ్చిన తెలంగాణలో కూడా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు ఉండటాన్ని ఒప్పుకోబోమన్నారు. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వకూడదన్నది తమ పార్టీ విధానమని, దాని ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు. ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కే మెజార్టీ వస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఆప్షన్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *