mt_logo

రేవంత్ రెడ్డి కండ్లున్న కబోది : మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ధాన్యం విషయంలో తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం సవితితల్లి ప్రేమను చూపిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వానాకాలంలో అదనంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవడానికి కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వడంపై మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. పంజాబ్ లో కోటి 85 లక్షల మెట్రిక్ టన్నులు, హర్యాణలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకున్న కేంద్రం తెలంగాణకు వచ్చేవరకు 2 లక్షలు, 6 లక్షలు అంటూ బేరాలు ఆడుతోందని దుయ్యబట్టారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని గాని.. తెలంగాణ ప్రభుత్వం అడిగినట్లుగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుంటామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. పంజాబ్ నుంచి కర్ణాటకకు ఎఫ్.సీ.ఐ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. పక్కన్నే ఉన్న తెలంగాణ నుంచి ఎందుకు సరఫరా చేయడం లేదు అని మారెడ్డి ప్రశ్నించారు.

ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ డ్రామాలు అడుతోంది…మరోవైపు రాష్ట్రంలో దిక్కుముక్కు లేని కాంగ్రెస్ పార్టీ, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని అన్నారు. రైతులు యాసంగిలో వడ్లు పండించాలని.. ప్రభుత్వం మెడలు వంచైనా కొనుగోలు చేయిస్తామని రైతులను రెచ్చగొట్టే విధంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి తన ఉనికిని చాటుకోవడానికి.. కాంగ్రెస్ పార్టీ పెద్దల మెప్పు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదు కాబట్టి వరిపంట వేసి రైతాంగం ఆర్థికంగా నష్టపోకూడదని, వారి సంక్షేమాన్ని కాంక్షించి వరి వేయొద్దని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. సీఎం గారి మాటలను వక్రీకరించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం గారి గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆయకే తెలియదు. ఉమ్మడి రాష్ట్రంలో.. ఆయన కొనసాగిన టీడీపీ పాలనలో గానీ.. ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పాలనలో గానీ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది కాదని.. రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడలని హితవు పలికారు. రేపు యాసంగి సీజన్ వచ్చేవరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటాడో.. ఊడుతాడో. ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఆయన పీసీసీ అధ్యక్షునిగా ఉండకూడదని ఆ పార్టీ నాయకులే అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. రేవంత్ రెడ్డి భాషను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులే కాకుండా, యావత్తు తెలంగాణ ప్రజానికం అసహ్యించుకుంటోంది. ఇటువంటి నాయకుడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావడం ఆ పార్టీ దౌర్భాగ్య పరిస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేశారు.. గన్నీ సంచుల కోసం ధర్నాలు చేశారు.. విత్తనాల కోసం లాఠీ దెబ్బలు తిన్నారు.. పోలీసు కాల్పుల్లో రైతులు మరణించారు. సాగునీరు, త్రాగునీరు ఇవ్వలేని దుస్థితిలో ఆనాడు ఆ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని నామమాత్రంగా కొనుగోలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.

ఎంత ఆర్థిక భారమైనా కూడా లెక్కచేయకుండా రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ 2014-15 నుండి ఈ రోజు వరకు దాదాపు 96 వేల కోట్ల రూపాయలతో 6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు నీటికి.. బుక్కెడు బువ్వకేడ్చిన తెలంగాణ రైతులు.. నేడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో దేశానికి అన్నం పెట్టేస్థాయికి ఎదిగారు. స్వాతంత్ర భారతదేశంలో కేవలం 7 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ దేశంలో పంజాబ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా రైతుబంధు, దళిత బంధు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ ప్రజానికానికి ఏం అవసరమో వాటిని గుర్తించి అమలు చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ చర్యలతో ప్రతి వర్గం, ప్రతి పౌరుడు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణాలో అభివృద్ధి ఏవిధంగా సాగుతుందో గమనించాలి. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా, కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రైతు వేధికలు, పంట కొనుగోళ్లు.. రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. గడిచిన ఏడేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యమ్రాలు రేవంత్ కు కనబడడం లేదా? కండ్లున్న కబోదిలాగ వ్యవహరిస్తున్నారు అని మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *