-తూచా తప్పకుండా అమలు చేస్తాం
-భూ కబ్జాదారులను వదిలేదిలేదు.. ప్రజా జీవితంలో పాఠాలు నేర్చుకున్నా
-తెలంగాణ ఇతరుల పాలు కారాదనే ఎన్నికల్లో పోటీ చేశాం
-పథకాల వెనుక మేధావుల పాత్ర.. కళ్యాణలక్ష్మి నా అనుభవంలోంచి వచ్చింది
ప్రభుత్వం వచ్చాక ఏమీ జరుగడం లేదు అని చాలామంది అనుకున్నరు. కానీ సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నా. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో సీఎం చాంబర్‌లో నా టేబుల్ డ్రాలో భద్రంగా పెట్టుకున్నాను . ఏ విషయం వచ్చినా చూసుకుంటున్న. అదే మా భగవద్గీత.
– సీఎం కేసీఆర్
టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోనే తమ భగవద్గీత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలుచేసి చూపిస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం అవినీతి, భూ కబ్జాలు, కుంభకోణాలు వారసత్వంగా ఒక గంజాయి వనాన్ని అందించిందని, ఆ గంజాయి వనాన్ని నరికి వేస్తామని అన్నారు.
గురుకుల్ భూముల కబ్జాలే కాదు. భూదాన్ భూములతో సహా దేనినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, కబ్జాదారులు స్వయంగా భూములు సరెండర్ చేస్తే బతికి పోతారని అన్నారు. లేకుంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు ఉద్యమంలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవం పాలనలో పాఠాలు నేర్పిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ముందు ముందు మరిన్ని పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు.
పోరాడి సాధించిన తెలంగాణను ఇతరుల పాలు కానివ్వరాదనే ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పారు. గురువారం ఆయన టీ న్యూస్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేధావులతోపాటు సామాన్య ప్రజలు అడిగిన అనేక ప్రశ్నలకు జవాబిచ్చారు. ఆ వివరాలు..
టీ న్యూస్: ప్రభుత్వంలో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి.. ఒకేరోజు మీరు వేగంగా తీసుకున్న కీలక నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి.. ఇది ఎలా సాధ్యమైంది?
కేసీఆర్: తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో సుమారు 14 సంవత్పరాలు, అంతకుముందు కూడా ప్రజా జీవితంలో ఉన్నాను. కేంద్రమంత్రిగా, రాష్ట్రమంత్రిగా పనిచేశాను. ఉద్యమంలో అన్ని రంగాల ప్రజలను కలుసుకున్న. లంబాడీ తండాల్లో పొద్దున్నే వేపపుల్ల వేసుకుని వారితో కలిసి తిరిగిన. ఎన్నికల ప్రణాళికపై మేధావులతో చర్చించిన. ఘంటా చక్రపాణి నివాసంలో ఎడిటర్లతో సమావేశమై ఎన్నికల ప్రణాళిక రూపొందించినం.
మాజీ డీజీపీ పేర్వారం, రమణాచారి, రామలక్ష్మణ్, చెల్లప్ప, ఏకే గోయల్ విశేషంగా సహకరించారు. దళితుల అభ్యున్నతి, రైతుల రుణమాఫీపై కసరత్తు చేశాం. ఇతరుల చేతుల్లో తెలంగాణ పెడితే ఏమౌతుందోనన్న ఆందోళనతోనే టీఆర్‌ఎస్ పోటీ చేసింది. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రజలకు వివరించాం. అట్టడుగు, దళిత, మైనార్టీ వర్గాల ప్రజల ఆర్తి, ఆకాంక్షలను మ్యానిఫెస్టోలో చేర్చాం. బీడీ కార్మికుల అంశం మ్యానిఫెస్టోలో లేకపోయినా నిజామాబాద్ పర్యటన తర్వాత చేర్చాం. రాష్ట్ర ఖజానాకు పరిమితులుంటాయి. అసలు అమలుకు యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా ఇలా అనేక అంశాలు చూశాం.
దళితులకు టాప్ ప్రయారిటీ..
దళితుల అభివృద్ధికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఎస్‌సీ కార్పొరేషన్ మీద చాలా ఫోకస్ ఇవ్వబోతున్నాం. ఉన్న సిబ్బంది సరిపోరు. 516 మంది అధికారులు కావాలని అన్నారు. ప్రభుత్వం వచ్చాక ఏమీ జరుగడం లేదు అని చాలామంది అనుకున్నరు. కానీ సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నా. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో సీఎం ఛాంబర్‌లో నా టేబుల్ డ్రాలో భద్రంగా పెట్టుకున్నాను. ఏ విషయం వచ్చినా చూసుకుంటున్న. అదే మా భగవద్గీత.
నీటి పారుదల..
ఇపుడు ప్రకటించినవి కొన్ని పథకాలే. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా చాలా జరగాలి. ఇరిగేషన్ చాలా ముఖ్యం. హైదరాబాద్‌లో కూర్చుని చేయాలనుకోవడం లేదు. క్షేత్ర స్థాయికి వెళితే చూస్తే కలిగే స్వానుభవం వేరు. కృష్ణా ,గోదావరి నదుల ప్రవాహం ఎలా ఉంది.. ప్రాణహిత ఎట్లా ఉంది చూడాలి. నాతో మంత్రులు, పత్రికా విలేకరులను కూడా తీసుకువెళ్తా. కొత్త పంథాలో వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు నీళ్లు ఎలా వస్తాయో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక పవర్ సెక్టార్.. చాలా సమస్యలున్నాయి. ఎన్నికల్లోనే ప్రజలకు ముందే చెప్పుకున్నం. మూడేళ్లవరకు ఇబ్బంది ఉంటది.
కాంట్రాక్టు ఉద్యోగులు..యువతకు ఉద్యోగాలు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వస్తున్నది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌తో ఇబ్బంది లేదు. 75 వేలనుంచి లక్ష ఉద్యోగాలు వస్తున్నయి. వివరాలు సేకరించడం ఇతర పనులు జరుగుతున్నయ్. టైంపడుతున్నది. అధికారులు తక్కువ ఉన్నరు. మాట చెప్పినంత తేలిక కాదు. అధికారులు తక్కువ మంది ఉన్నా బాగా పని చేస్తున్నారు. కలిసి పని చేద్దామని పిలుపునిచ్చాను. మంత్రులు సిన్సియర్‌గ పనిచేస్తున్నరు. సంతృప్తికరంగా ఉంది. ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది. తెలంగాణ కోల్పోయింది చాలా ఉంది. తెలంగాణ పూర్వవైభవం పున:స్థాపితం అయ్యే వరకూ చాలా దూరం ప్రస్థానం సాగాల్సి ఉంది.
టీ న్యూస్.. కళ్యాణ లక్ష్మి పథకం ఆలోచన ఎందుకు కలిగింది….?
కేసీఆర్: ఆడపిల్ల పెళ్లి అనగానే మిడిల్ క్లాస్ అయినా లోక్లాస్ అయినా వణికిపోతారు. వాళ్లు అనుభవించే బాధ వర్ణణాతీతం. ప్రత్యేకంగా గిరిజనులు, దళితులు. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్నకోడూరు గ్రామానికి పోయినపుడు దళితుల ఇంట్ల పెండ్లి ఆగిపోయి ఉంది. సార్ దండం పెడతా బిడ్డపెళ్లి ఎత్తిపోయెటట్లు ఉంది అని తల్లి నా ముందు ఏడ్చింది. అల్లునికి సైకిల్ ఇస్తమన్నం.. కానీ కాలేదు అన్నది.
అల్లుడిని పిలిచి సైకిల్ పెళ్లి చేసుకుంటున్నావా? పిల్లను పెళ్లి చేసుకుంట్నునవా? అని అడిగిన. తండ్రితో సమస్య ఉందని చెప్పిండు. నా గన్‌మెన్‌ను ఎంతైద్దని అడిగి 1900రూపాయలిచ్చి అట్లాస్ సైకిల్ తెమ్మని పర్యటనకు పోయిన. తిరిగి వచ్చే సరికి సైకిల్ వచ్చింది. పసుపుకుంకుమతో సిద్ధం చేసిండ్రు. నాతో కొబ్బరి కాయ కొట్టించింది. అల్లుడు సైకిల్ మీద భార్యను ఎక్కించుకుని పోయిండు. అట్లనే వరంగల్ ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం చూసేందుకు పోయిన. ఒక గిరిజనుడు నా కాళ్ల మీదపడి పెండ్లికి తెచ్చిన 70వేలు కాలిపోయినయ్.
శ్రీరామనవమి వెళ్లినాక పెళ్లి చేద్దామనుకున్నా అని ఏడ్చిండు. ఆదుకున్నం. ఇలాంటి ఎన్నో అనుభవాలున్నాయి. ఆడపిల్ల పెళ్లి అంటే ఉన్న వారింట్లోనే భయపడుతారు. దళితులకు ఇంకా ఇబ్బంది. వారి కోసమే ఈ కళ్యాణ లక్ష్మి పథకం. కళ్యాణ లక్ష్మికి ఏమి పేరుపెట్టాలనే దానిపై క్యాబినెట్ లో చర్చ జరిగింది. పసుపు కుంకుమ , పుస్తెలు మెట్టెలు అని కొందరు చెప్పారు. రాము..ఐటీ, పంచాయితీరాజ్ మంత్రి.. అతను కళ్యాణ లక్ష్మి అని చెప్పాడు. అధికారులందరూ బాగా ఉందని అన్నారు.
టీ న్యూస్.. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ప్రభావం ఎలా ఉండబోతోంది?
కేసీఆర్: ఇంతకాలం దళితులకోసం కేటాయించిన నిధులు దారి మళ్లించారు. పథకాలు శాస్త్రీయంగా లేవు. నా స్వగ్రామం చింతకమడక లో 90 ఎకరాల భూమిని 110 మందికి ఇచ్చారు. తొవ్వగాని ఏదీ కాని లేకుండా అశాస్త్రీయంగా ఉంది. ఉపయోగంలోకి వచ్చిందా? లేదా? అని చూడలేదు. ఈ సారి అలా కాదు. ప్రభుత్వమే పెట్టుబడి, నీటిపారుదల సౌకర్యం కల్పిస్తుంది. అగ్రికల్చర్ అధికారి మూడు నెలల కోసారి ఎవల్యుయేషన్ చేసి రిపోర్టు పంపాలి. దళిత వాడలనుంచి దరిద్రాన్ని తరిమికొడతాం.
టీ న్యూస్ : రెండువందల పెన్షన్‌ను వేయి రూపాయలకు పెంచారు ఇది భారం కాదా?
కేసీఆర్: భారం అంటే నేను ఒప్పుకోను. ఆర్థిక నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలకు మూడు వేల కోట్ల రాయితీలిద్దామంటే అధికారులు ఓకే అంటారు అదే పేదలకు అంటే భారమంటారు. అది కరెక్ట్ కాదు. మానవతా దృక్ఫథంతో చూడాలి. వితంతువులు, వృద్ధులను ఆదుకోవాలి. తినడానికి 770 రూపాయలు సరిపోవు. వికలాంగులకు, వృద్ధులకు సామాజిక భద్రత ఉండాలి. దసరా నుంచి దీపావళి మధ్య లోపు వారికి కొత్త బుక్‌లను అందిస్తాం.
ప్రముఖుల అభిప్రాయాలు..
ఘంటాచక్రపాణి : కేసీఆర్ గారు తెలంగాణకు కొత్త దిశను నిర్థేశించారు. ఇంత కసరత్తు చూడటం మొదటి సారి. ఏమి చేయాలనే దానిపై స్పష్టత ఉంది. దళితులకు సంబంధించిన విధానం. పారిశ్రామిక విధానం ఎంతో బాగుంది. దళితులకు భూమి ఏ విధంగా గౌరవం వస్తుందో ఆ విధంగా విధానాలకు రూపకల్పన చేశారు. దయాదాక్షిణ్యాలు అవసరం లేకుండా పాలేరులు కాకుండా ఇంతకు మించి విప్లవం ఉండదు. ఉద్యోగాలకు సంబంధించి ఆందోళనలు లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా వేతనాలిచ్చారు.
దేశపతి శ్రీనివాస్: అవినీతిని ఎలా అరికడతారు?
కేసీఆర్: పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. చాలా దారుణంగా 24 లక్షల కుటుంబాలు 57లక్షల ఇళ్లు కట్టినట్లు రికార్డుల్లో ఉంది. భయంకరమైన అవినీతి జరిగింది. ఆరోగ్యశ్రీ లో అంతులేని అవినీతి , ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో, జలయజ్ఞంలో వేలాది కోట్ల కుంభకోణాలు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలకు అంతే లేదు. చెరువులు, కుంటలు చివరికి దేవుడి భూములు కూడా దైవభీతి లేకుండా కబ్జా చేశారు. ఈఎన్‌టిని కబ్జా చేశారు. ఇది సమైక్య రాష్ట్రం మనకు ఇచ్చిన వారసత్వ సంపద. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆరునూరైనా ఎవరినీ వదిలేది లేదు. అక్రమార్కులు తిన్నది కక్కాల్సిందే. భూదాన్ భూములు. గురుకుల్ భూములు కబ్జాదారులు తప్పు ఒప్పుకుంటే బతికిపోతరు. లేకుంటే జైలుకు పోక తప్పదు. గంజాయి వనాన్ని నరికేస్తాం.తులసి వనంగా మారుస్తాం.
వేణుగోపాల్(పాత్రికేయులు): గురుకుల్ ట్రస్ట్, ఎన్‌కన్వెన్షన్ భూములను స్వాధీనం చేసుకోవాలి. కొత్త పారిశ్రామిక విధానాన్ని తేవాల్సి ఉంది. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను పునర్‌సమీక్షించాలి.
కేసీఆర్: భూబకాసురుల భరతం పడతాం. హైదరాబాద్ మురికివాడలలో చాలా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. స్లమ్‌ఫ్రీ గా చేస్తాను. కొత్తగా పథకానికి రూపకల్పన చేస్తాను. నేనే స్వయంగా ఒక మురికివాడను దత్తత తీసుకుంటాను. అక్కడే భూములపై హక్కులిస్తాం. ఫ్లాట్‌లను వారిపై రిజిస్ట్రేషన్ చేయిస్తాను. పార్క్‌లు, రోడ్లు వేయిస్తాను. స్లమ్‌ఫ్రీ గా చేస్తాను. మురికివాడలు లేని హైదరాబాద్‌ను చూపిస్తాను.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]