mt_logo

సీఎం వరాలపై తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీలకు సంబంధించిన 43అంశాలపై సుదీర్ఘంగా ఐదున్నర గంటలపాటు చర్చించి తగు నిర్ణయాలు, కార్యాచరణకు ప్రణాళికలు రూపొందించారు. సీఎం ఇచ్చిన మాటప్రకారం తెలంగాణ ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రకటించగానే ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగులందరూ సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటారని తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించగానే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ కృతజ్ఞత తెలిపారు. అర్హులైన తెలంగాణ విద్యార్థులందరికీ ఫాస్ట్ పథకం ద్వారా ఆర్ధిక సాయం అందించడం పట్ల ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఓయూ జేఏసీ స్వాగతిస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు జేఏసీ ప్రతినిధి పిడమర్తి రవి, బాల్ రాజ్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్ లోనూ సంబరాలు మిన్నంటాయి.

ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతున్నప్పటికీ అన్ని వర్గాలకూ లాభం చేకూరేలా సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడంతో తెలంగాణ పది జిల్లాల ప్రజలు కేసీఆర్ చిత్రపటానికి అనేక చోట్ల పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్, జాగృతి కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *