mt_logo

శరవేగంగా పూర్తవుతున్న ‘మన ఊరు… మన బడి’ పైలట్ ప్రాజెక్ట్ పనులు

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాలు కొత్త కాంతులు సంతరించుకోనున్నాయి. విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందించే దిశగా సకల మౌలిక వసతులతో సిద్ధమై… విజ్ఞాన సౌరభాలు వెదజల్లనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ఇందుకు వేదిక కానున్నది. సర్కారీ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చివేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని నాలుగు స్కూళ్లలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇందుకుగాను 3.57 కోట్ల నిధులను మంజూరు చేయగా ఇప్పటికే ఎంపిక చేసిన నాలుగు పాఠశాలల్లో 40 శాతం పనులు పూర్తయ్యాయి. మరో పదిహేను రోజుల్లో పనులను పూర్తిచేసి, ప్రారంభానికి సిద్ధం చేయనున్నారు. ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని సోమవారం నాటి క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ కార్యక్రమంపై కొంతకాలంగా ప్రభుత్వంలో సమీక్షలు నడుస్తూనే ఉన్నాయి. కార్యక్రమాన్ని ప్రారంభించే నాటికే నాలుగు పాఠశాలలను ఆదర్శంగా అభివృద్ధిచేసి సిద్ధంగా ఉంచాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు నాలుగు స్కూళ్లను ఎంపికచేసి, నిధులను సైతం మంజూరుచేశారు. శరవేగంగా మరమ్మత్తులు పూర్తి చేసి ‘మన ఊరు.. మన బడి’కి అంకురార్పకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

2,800 కోట్లు సిద్ధం :

మన ఊరు మన బడి పథకం అమలుకు ఇప్పటికే 2800 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయి. మొదటి విడుతలో భాగంగా 3,497.62 కోట్లతో 9,123 స్కూళ్లను అభివృద్ధి చేయనుండగా, ఇప్పటికే 2,800 కోట్లు సిద్ధంగా ఉంచారు. మరో 700 కోట్లను ప్రభుత్వం త్వరలోనే కేటాయించనున్నది. ప్రస్తుతానికి రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం లభించగా, త్వరలోనే జీవోను జారీచేస్తారు. జీవో జారీ అయి, కార్యక్రమం అధికారికంగా ప్రారంభంకాగానే మొదటి విడుత పనులు ప్రారంభిస్తారు.

అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా :

దేశంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న పాఠశాలలుగా తెలంగాణ స్కూళ్లను తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను కూడా తెలంగాణ అధికారుల బృందం పలుమార్లు సందర్శించి, అధ్యయనం చేసింది. వాటిని స్ఫూర్తిగా తీసుకొంటూనే వాటికన్నా మరింత మెరుగ్గా ‘మన ఊరు- మన బడి’ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం అమలు, పర్యవేక్షణకు టీసీఎస్‌ కంపెనీతో అధునాతన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు
చేయించారు.

ఎంపిక చేసిన పాఠశాలలివే :

• జడ్పీహెచ్‌ఎస్‌ జిల్లెలగూడ, బాలాపూర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా.
• ఎంపీపీఎస్‌, జడ్పీహెచ్‌ఎస్‌ శివరాంపల్లి, రాజేంద్రనగర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా.
• ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల మోడల్‌ ఆలియా, గన్‌ఫౌండ్రీ, హైదరాబాద్‌.
• ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, మహబూబియా (బాలికలు) గన్‌ఫౌండ్రీ, హైదరాబాద్‌.

భావితరాలకు బంగారు భవిష్యత్తు : సబిత

భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు, వారి ప్రయోజనాల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో ముందుకు సాగుతున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు అంకితభావంతో పనిచేస్తున్నామన్నారు. దీంట్లో భాగంగానే రూ.7,289 కోట్లతో ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు పైలట్‌ ప్రాజెక్ట్‌గా నాలుగు పాఠశాలల్లో చేపట్టామని, ప్రస్తుతానికి పనులు కొనసాగుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *