mt_logo

తెలంగాణలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా కోఠి మహిళా కళాశాల

హైదరాబాద్ నగరంలోని కోఠి మహిళా కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వ విద్యాలయంగా మార్చే అంశంపై మంగళవారం తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి యూజీసీ స్వయం ప్రతిపత్తితో, న్యాక్ గుర్తింపు కలిగిన కోఠి మహిళా కళాశాలను, మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలు కలిగి ఉందని సీఎం కేసీఆర్ భావించారని, మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు మహిళా విశ్వవిద్యాలయ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వ విద్యాలయంగా మారిస్తే అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థుల వసతులు, మౌళిక సదుపాయాలు తదితర అంశాలపై నివేదిక రూపొందించాలని అధికారులను కోరారు. మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటుకు విధి విధానాలు, అనుమతుల గురించి వివరాలు అందించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖలోని అధికారులతో అంతర్గతంగా కమిటీ వేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలలో 4,159 మంది విద్యార్థినులు చదువుతున్నారని, దీన్ని మహిళా విశ్వ విద్యాలయంగా మారిస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని సూచించారు. కోఠి మహిళా కళాశాలకు చారిత్రాత్మక వైభవం ఉండటంతో దాన్ని మహిళా విశ్వ విద్యాలయంగా మారిస్తే తెలంగాణ మహిళల ఉన్నత విద్యలో మహర్ధశ వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో దూసుకువెళ్తాందని, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు, ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. ఈ మహిళా విశ్వ విద్యాలయంలో ఆధునిక కోర్సులు బోధించేలా చర్యలు చేపట్టేలా కోర్సులను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కళాశాల, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ విజులత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *