-గోల్కొండ కోట మీద జెండావందనం
-వెయ్యికండ్లతో ఎదురుచూస్తున్న తెలంగాణ
-రక్షణ దుర్గం నుంచి రాజధాని దాకా..!.. గోల్కొండగా మారిన గొల్లకొండ
-కుతుబ్ షాల కాలంలో వెల్లివిరిసిన సామరస్యం
-పల్లవించిన పదకవితలు.. రత్నాల రాసులైన అంగళ్లు
-తెలంగాణ స్వర్ణయుగానికి ప్రతీక గోల్కొండ!
స్వరాష్ట్రంలోని మొదటి స్వాతంత్య్ర దినోత్సవాలు ఇవాళ గోల్కొండ కోటలో జరుపుకొంటున్నాం. మన ఘనచారిత్రక వారసత్వ సంపదకు ప్రతీక అయిన గోల్కొండమీద జరిగే పతాకావిష్కరణ కోసం ప్రజలంతా వెయ్యికండ్లతో ఎదురు చూస్తున్నారు. రాజధానులు, రాజప్రాసాదాలు, కోటలు జాతి వారసత్వ సంపదగా నిలుస్తాయి. తెలంగాణను ఒక గొడుగుకిందికి తెచ్చి ఒక రాజ్యంగా రూపొందించింది గోల్కొండ కోట. ఇక్కడినుంచే ప్రజారంజకులైన పాలకులు, పాలన సాగించారు. ఒకనాడు ప్రపంచ పర్యాటకులు, వ్యాపారులు జీవితంలో ఒక్కసారైనా చూడాలని ఉవ్విళ్లూరిన స్థాయిలో మహా వైభవాన్నిఅనుభవించిన చరిత్ర గోల్కొండ కోటది. మహా చరిత్రకు సజీవ సాక్ష్యమైన గోల్కొండలో జెండా వందనం మన ఘన వారసత్వాన్ని ఆవహించుకోవడమే. బంగారు తెలంగాణ దిశగా జరిగే ప్రస్థానానికి స్ఫూర్తి నింపుకోవడమే.
గోల్కొండ చరిత్ర కేవలం మొగలాయీలు కుతుబ్‌షాలకు పరిమితమైంది కాదు. ఈ దుర్గాన్ని నిర్మించింది కాకతీయులు. రాజ్యం పశ్చిమ భాగంలో రక్షణదుర్గంగా దీన్ని నిర్మించుకున్నారు. అంతకు ముందు ఇది గొల్లకొండగా పిలిచేవారు. ఇది కోటగా మారడం వెనుక రకరకాల కథలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమదిశనుంచి వచ్చే శత్రుసైన్యాలను నిలువరించే క్రమంలో కాకతీయులు ఈ దుర్గాన్ని నిర్మించుకున్నారు. శత్రు దుర్బేధ్యమైన ఈ నిర్మాణం కాకతీయులకు రక్షాకవచంగా నిలిచింది. ప్రతాపరుద్రుని కాలంలో ఈ కోటను మరింత పటిష్టం చేసుకున్నారు.
కాకతీయ సామ్రాజ్య పతనం అనంతరం చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడిన కాలంలో ముసునూరి నాయకులు ఇక్కడున్న తుగ్లక్ సేనలను తరిమివేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 1364లో అప్పటికే దక్షిణ దేశాన్ని శాసిస్తున్న బహమనీ మహాసామ్రాజ్యంతో ముసునూరి రాజ్యం సంధి కుదుర్చుకుని గోల్కొండను వారి పరం చేసింది. బహమనీల కాలంలో గోల్కొండ ప్రాభవాన్ని సాధించింది. కేవలం రక్షణ దుర్గంగా మాత్రమే కాకుండా ఒక ప్రాంతానికి దీన్ని రాజధానిగా వారు తీర్చిదిద్దారు. బహమనీ సామ్రాజ్య విచ్ఛిత్తి అనంతర కాలంలో 1518లో కుతుబ్‌షాల పాలనలో పూర్తిస్థాయి రాజధానిగా మారింది. ఈ కాలంలో ఈ కోటను బాగా విస్తరించారు.
గోల్కొండ సుల్తానులు..
గోల్కొండను రాజధానిగా చేసుకుని పాలించిన రాజులను గోల్కొండ సుల్తానులుగా పేరుగాంచారు. వీరినే కుతుబ్‌షాలు అంటారు. 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్‌తో ప్రారంభమై మొత్తం 8 మంది రాజులు గోల్కొండ కోట కేంద్రంగా ఈ రాజ్యాన్ని పాలించారు. 1689లో అబ్దుల్ హసన్ కుతుబ్ షాను ఔరంగజేబు బంధించి ఢిల్లో సామ్రాజ్యంతో గోల్కొండను కలిపివేయడంతో గోల్కొండ సుల్తానుల వంశ ముగిసింది. అయితే ఆ తర్వాత నిజాం వంశం హైదరాబాద్ పట్టణం రాజధానిగా పాలించినా ఒక రకంగా అది గోల్కొండ రాజ్యానికి కొనసాగింపుగానే చెప్పుకోవచ్చు.
గోల్కొండనేలిన రాజులు..
1.సుల్తాన్ కులీ కుతుబ్ షా, 2. జంషీద్,3. సుభాన్, 4. ఇబ్రహీం, 5. మహ్మద్ కులీ 6. సుల్తాన్ మహ్మద్ 7. అబ్దుల్లా 8 అబ్దుల్ హసన్
పల్లవించిన పదకవితలు..
గోల్కొండ రాజ్యం మతసామరస్యానికి ప్రతీకగా వెలుగొందింది. తెలుగు సాహిత్యానికి కూడా ప్రోత్సాహం లభించింది. కులీ ఆస్థానంలో సింగనాచార్యుడు, అద్దంకి గంగాధరుడు, కుందుకూరు రుద్రకవి వంటి తెలుగు కవులు ఉండేవారు. కులీ కుతుబ్ షా పర్సియా, తెలుగు భాషలో కవితలు రాశారు. ఆయనను మల్కిభరాముడు అని తెలుగు కవులు ప్రస్తుతించారు. అదే సమయంలో అనేక మంది షియా ముస్లిం మతగురువులు గోల్కొండకు చేరి ఇక్కడే స్థిరపడ్డారు. కులీ తర్వాత అతని కుమారుడు మహ్మద్ కులీ కాలంలోకూడా తెలుగు కవులకు మంచి ప్రాధాన్యత లభించింది. అబ్దుల్లా హయాంలో కోస్తా తీరంనుంచి వచ్చిన క్షేత్రయ్యకు ఆశ్రయం ఆదరణ లభించింది.
మతసామరస్యానికి ప్రతీక..
కులీకుతుబ్ షా పాలనా కాలంలో హిందువులు దీపావళి, హోలీ పండుగలు కోటలో అత్యంత వైభవంగా జరుపుకునే వారని పలువురు విదేశీ యాత్రికులు తమ రచనల్లో పేర్కొన్నారు. నాడు పాలనలో అత్యంత ప్రముఖమైన మంత్రులుగా అక్కన్న మాదన్నలు ఉండేవారు. గోల్కొండ సుల్తానుల కాలంలోనే చార్మినార్ వంటి మహా కట్టడం నిర్మాణమైంది. హైదరాబాద్ పట్టణానికి పునాదిరాయి పడింది వీరి కాలంలోనే. తెలుగు వాసనలు ప్రతిబింబించే దక్కనీ ఉర్దూ వీరి కాలంలో రూపొందింది. రాజ్యంలోని కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, న్యా య విభాగాల్లో తెలుగు వాడకం ప్రారంభమైంది. గోల్కొండ రాజులు తెలుగు సుల్తానులు అనే పేరుతో కూడా పిలువబడ్డారు. చార్ కమాన్, మక్కా మసీద్, టోలి మసీదు, కుతుబ్‌షాహి సమాధులు వీరి కాలంలోని ప్రముఖ నిర్మాణాలు.
విద్రోహంతో పతనం..
1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపై దాడి చేశాడు. వెయ్యికి పై శతఘ్నులతో వేలాది మంది సైన్యంతో చుట్టు ముట్టాడు. గోల్కొండ సేనలు తీవ్రంగా ప్రతిఘటించాయి. మొఘలుల కన్నా శక్తివంతమైన శతఘ్నులత దాడితో ఎదుర్కున్నాయి. ఔరంగజేబుకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఖిలిచ్‌ఖాన్ గోల్కొండ సైనికుల దాడిలో మరణించాడు. ఈ ముట్టడి దాదాపు 8 నెలలు కొనసాగింది. చివరికి కోటలోపలినుంచి జరిగిన విద్రోహంతో మొఘల్‌సేనలు కోటలోకి దూసుకురావడంతో గోల్కొండ తలవంచింది. రాజు అబ్దుల్ హసన్‌ను బందీ చేసి దౌలతాబాద్‌కు తరలించారు.
స్వర్ణయుగం..
కుతుబ్‌షాల కాలంలో గోల్కొండ స్వర్ణయుగాన్ని చవిచూసింది. రాజ్యం కోస్తా తీరందాకా విస్తరించింది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రముఖ వర్తక కేంద్రంగా వినుతికెక్కింది. ఇక్కడి సంపద గురించి వజ్రాల గురించి ప్రపంచం కథలు కథలుగా చెప్పుకొన్నాయి. నాడు భారతదేశాన్ని సందర్శించిన ప్రతి యాత్రికుడూ గోల్కొండ తప్పక దర్శించేవాడు. కుతుబ్‌షాల కాలంలో షియా ముస్లిం పండితులు వివిధ దేశాలనుంచి ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వర్తకులు కూడా తమ వ్యాపారానికి గోల్కొండను ఎంచుకున్నారు.
కోటకు ఎన్నో ప్రత్యేకతలు…
గోల్కొండలో మొత్తం నాలుగు కోటలు ఉన్నాయి. ఎనిమిది మహాద్వారాలు, అనేక వంతెనలు కూడా ఉన్నాయి. కోటలోపలే అనేక మసీదులు, ఆలయాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కలుపూతూ 11 కిలోమీటర్ల విస్తీర్ణంతో గోడను నిర్మించారు. ఈ కోట నిర్మాణంలో అనేక ఇంజనీరింగ్ అద్భుతాలు కూడా ఉన్నాయి. సైఫన్ విధానలో నీటి పంపిణీ ఆ రోజుల్లోనే ఉండడం అబ్బుర పరుస్తుంది. చప్పట్ల శబ్దం కిలోమీటర్ దూరంలో ఉన్న బాలాహిస్సార్ పెవిలియన్ వరకూ వినిపించడం మరో అద్భుతం. కోటలోపల అనేక ఉద్యాన వనాలు, కళా మందిరాలు ఉన్నాయి.
ఏడు నెలలు గోల్కొండనేలిన సర్వాయి పాపన్నఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచిచూపిన వీరుడు
తెలంగాణ నేలలోనే తిరుగుబాటు తత్వం ఉంది. అనేక తరాలనుంచి ఈ తిరుగుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. కాకతీయ రాజుల మీద తిరుగుబాటు చేసిన సమ్మక్క, సారలమ్మ, ముసునూరి నాయకులు, నిజాం మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన కొమురం భీం, సిపాయిల తిరుగుబాటు కాలంలో దాడికి దిగిన తుర్రేబాజ్‌ఖాన్ ఇలా చరిత్ర మొత్తం తిరుగుబాట్ల మయమే. రాజ్యం అనే వ్యవస్థ నిరంకుశంగా మారిన ప్రతి సందర్భం ఇక్కడ తిరుగుబాట్లను చవిచూసింది. ఈ పరంపరలో భాగమే గోల్కొండ కోటను ఆక్రమించిన సర్వాయి పాపన్న కథ. పాపన్న ఆగష్టు 18, 1650 నాడు నేటి వరంగల్ జిల్లా, జనగాం మండలం ఖిలాషాపూర్‌లో జన్మించాడు. తండ్రి చిన్న తనంలో చనిపోగా తల్లి సర్వమ్మ అతడిని పెంచింది. సహజంగా తిరుగుబాటు లక్షణాలున్న పాపన్న ఏకంగా గోల్కొండ కోటపై గురి పెట్టాడు.
గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ని రాజధానిగా చేసుకొని 1675 లో సర్వాయిపేటలో ఓ చిన్న రాజ్యాన్ని స్థాపించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలతో సహా దాదాపు 20 కోటలను అధీనంలోకి తెచ్చుకున్నాడు. 1700లో దాదాపు 12 వేల మంది సైనికులను సమకూర్చుకొని గోల్కొండకోటను పట్టుకుని 7 నెలలపాటు అధికారంలో కొనసాగాడు. పాపన్న చర్యలు విని ఔరంగజేబు ఆదేశంలో రుస్తుం దిల్ ఖాన్, ఖాసింఖాన్‌లను పంపించాడు. 3 నెలల యుద్ధం తర్వాత పాపన్న అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఔరంగజేబు మరణం తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీనపడిన సమయంలో పాపన్న 1708 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. కంబక్ష్ ఖాన్ పాపన్నను దారుణంగా చంపించి తలను గోల్కొండ ద్వారానికి వేలాడదీశాడు. తెలంగాణ ఒక మహావీరుడిని కోల్పోయింది.
గోల్కొండ వెనుక ఆసక్తి గొలిపే కథ..
గోల్కొండను తొలుత గొల్లకొండగా పిలిచేవారు. గొల్లకొండ నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందడం వెనుక ఒక ఆసక్తికర కథనం ఉంది. 1143 లో మంగళవరం అనే రాళ్ళ గుట్ట మీద ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించినది. ఈ వార్త అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించే కాకతీయ రాజులకు తెలిసి వారు ఇక్కడ ఆలయం మట్టితో ఒక దుర్గం నిర్మించారు. అదే క్రమంగా గోల్కొండగా మారింది. 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ ఈ కోటను ఆక్రమించాడు. కాకతీయుల పతనం అనంతరం ముసునూరి నాయకులు తిరుగుబాటు చేసి ఓరుగల్లును గోల్కొండను కూడా ఆక్రమించారు. 1347లో గుల్బర్గ్గా రాజధానిగా బహమనీ రాజ్యం వెలిసింది. వారికి ముసునూరి నాయకులకు అనేక యుద్ధాలు జరిగాయి. చివరికి సంధిలో భాగంగా గోల్కొండ బహమనీ సామ్రాజ్యంలో భాగమైంది. వారు తమ ప్రతినిధులను నియమించి పాలన సాగించారు. బహమనీ సామ్రాజ్యం విచ్చిత్తి అనంతరం కుతుబ్ ఉల్ ముల్క్ స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. నాటినుంచి గోల్కొండ సుల్తానుల పాలన ప్రారంభమైంది. 1507 నుంచి 1687 లో ఔరంగజేబు దండయాత్రతో కుతుబ్‌షా పాలన ముగిసింది.
గోల్కొండ కోట ప్రత్యేకతలు..
గోల్కొండ కోట దక్కన్‌లోనే అతి పెద్ద దుర్గం. ఇంతటి విస్తీర్ణం, వైవిధ్యం, వాస్తు వైభవం వున్న మరో కోట దక్షిణ భారతదేశంలో లేదు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో నిర్మించిన మహాదుర్గం గోల్కొండ. గోల్కొండలో నాలుగు వేర్వేరు కోటలున్నాయి. 87 బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడ కట్టారు. అన్ని బురుజులలో ఫిరంగులు ఉంచారు. కోటకు మొత్తం 8 సింహద్వారములు, 4 వంతెనలు , అనేక రాచమందిరాలు, మసీదులు, ఆలయాలు, అశ్వశాలలు ఉండేవి.
బాలా హిస్సారు దర్వాజా
బాలా హిస్సారు దర్వాజా నుంచి కొండపైకి వెళ్ళటానికి 380 మెట్లు ఉంటాయి. బాలా హిస్సారు బారాదరీ దర్బారు హాలుగా ఉపయోగించేవారు.ఈ కట్టడంలో 12 ఆర్చీలు, 3 అంతస్తులు ఉన్నాయి. బారాదరీలో గోడల మధ్య ఉన్న ఖాళీలో గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమయిన కూలరులా పనిచేసే వ్యవస్థ ఉంది.
ఫతే దర్వాజా
సింహద్వారములలో ఫతే దర్వాజా (విజయ ద్వారము) ప్రముఖమైంది. అన్ని ముఖద్వారములలోకి బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరమయినది. ఆర్చీలపై ఉన్న సన్నటి రాతి పలకల మీద అనేక మృగాల బొమ్మలు మలిచారు.
రామదాసు బందిఖానా
గోల్కొండకోటలో రామదాసు బందిఖానా, మాదన్న దేవాలయం పర్యాటకులను విశేషంగా ఆర్షిస్తాయి. మాదన్న దేవాలయంలో కాళీదేవి విగ్రహం ఉంది. కోటలో తారామతి నిర్మించిన మసీదు ఇక్కడ ఉంది. కోటలో అక్కడక్కడా బంకమట్టితో తయారుచేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి నీటి సరఫరా కోసం వీటిని నిర్మించారు. గోల్కొండకు ఉత్తర దిక్కులో బయట గోడకు 1 కి.మీ. దూరంలో కుతుబ్‌షా దులున్నాయి.
కోట ప్రవేశద్వారం వద్ద చప్పట్లు కొడితే కోట పైభాగానికి వినిపిస్తుంది. కోటలోకి ప్రవేశించే ప్రతి సందర్శకుడు ఇలా ఒకసారి చప్పట్లు కొట్టి ఆనందిస్తారు. కోటలో అనేక రాజభవనాలు, శయన మందిరాలు, స్నానవాటికలు తోటలలకు, ఫౌంటెన్లకు రాళ్ళతో నిర్మించిన ఆక్వడెట్లు, మసీదులు, మందుగుండును నిల్వచేసే స్టోర్ రూములు, సైనికుల నివాసాలు, ఉద్యానవనాలు, హబ్సికమాన్లు ఉన్నాయి.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..