mt_logo

మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ ప్రచారభేరి

కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలతో కూడిన తెలంగాణ ఇచ్చిందని, సంపూర్ణ తెలంగాణ సాధించుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో బుధవారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. సచివాలయంలో 90% ఆంధ్రా ఉద్యోగులే ఉన్నారని తాను అంటే కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారని, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో, ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో ఉండాల్సిందే అని, ఆంధ్ర ఉద్యోగులకు మరో ఆప్షన్ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

నిజాం షుగర్స్ ను చంద్రబాబు అమ్ముకున్నాడని, శ్రీకృష్ణ జన్మస్థానానికి బాబు వెళ్ళక తప్పదన్నారు. తెలంగాణను చివరినిమిషం దాకా చంద్రబాబు, వెంకయ్యనాయుడు అడ్డుకున్నారని,అలాంటి వారు తెలంగాణలో దుకాణం పెడతామనడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. ఇంటిపార్టీ, ఇంటిజెండాకు ఓటువేసి తెలంగాణ ప్రజలు బతుకులు బాగుపర్చుకోవాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడూ రాజీనామాలు చేయలేదని, సకలజనుల సమ్మె జరుగుతున్నప్పుడు ఉద్యమకారులను లాఠీలతో కొట్టించారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పచ్చబడేలా చేస్తామని, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దగ్గరుండి కట్టిస్తా అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలలో గెలుపొంది తెలంగాణ ఆశలు ఎట్లా నెరవేర్చుకోవాలో ప్రజలే నిర్ణయించుకోవాలని రెండు ఓట్లు కారు గుర్తుకే వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

అదేరోజు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ బహిరంగసభను వనపర్తి పట్టణ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కలిసిన పాపానికి 60 ఏళ్ళు గోస పడ్డామని, 1969లో 400మంది విద్యార్థులు మరణించారని, రెండవదశ ఉద్యమంలో 1200 మంది యువకులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఏనాడూ తెలంగాణ కోసం పోరాటం చేయలేదని, కనీసం రాజీనామాలు కూడా చేయలేదని విమర్శించారు. నిపుణుల పర్యవేక్షణలో మేనిఫెస్టో రూపొందించామని, చంద్రబాబు నాయుడు హయాంలో కాంట్రాక్టు పద్ధతి తీసుకొచ్చి ఉద్యోగులకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *