డి. నరసింహా రెడ్డి
తెలుగు దేశం మ్యానిఫెస్టో (హామీ పత్రం) రెండు రాష్ట్రాలకు, ఆంధ్ర మరియు తెలంగాణ, వేరుగా ప్రకటించారు. పదేళ్ళ క్రితం అధికారం కోల్పోయినా, మేము ఆనాడు చేసిందే ఘనం, మళ్ళి పునరావృతం చేస్తాం అనే ప్రధాన సందేశం ఈ పత్రాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆనాడు చేసింది ప్రజలు ఆమోదించలేదు కాబట్టే, అధికారం పోయింది. అయినా 2014లో ఇట్లాంటి సందేశం చూస్తే శ్రీ. చంద్రబాబు నాయుడు గారు గత అనుభవాల నుంచి నేర్చున్నట్టు కనపడదు. నేను మారాను అని పదే పదే చెప్పిన అయనలో, మౌలికమైన మార్పు కాదు అనేది ఈ హామీ పత్రంతో, ఇటివలి ఉపన్యాసాలతో సుస్పష్టం. ‘నేను’ అనే పదానికి ఈ హామీ పత్రంలో ప్రాధాన్యం ఇవ్వడం కనపడుతుంది. ఒక పార్టీ హామీ పత్రం వ్యక్తిగత ప్రబోధన తో మొదలుపెట్టడం ఆ పార్టీ యొక్క అంతర్గత ప్రజాస్వామిక విలువలకు అద్దం పడుతుంది.
ఒక ‘వినూత్నమైన అభివృద్ధి పథం’ ప్రవేశపెడుతున్న మ్యానిఫెస్టోలో, ‘ఆధునికరించడమే’ అంతః సూత్రంగా దాదాపు అన్ని రంగాలలో హామీలు గుప్పించడం గమనార్హం. పారిశ్రామీకరణ దిశగానే అభివృద్ధి మంత్రం జపించడం జరిగింది. ప్రపంచీకరణ, ప్రయివేటికరణ మరియు సరళీకరణ ఆలోచనలు ఇందులో మెండుగా ఉన్నాయి.
పర్యాటక పరిశ్రమను విపరీతంగా ప్రేమించే శ్రీ.చంద్రబాబు నాయుడు గారు, వినూత్నంగా, ఆంధ్ర ప్రదేశ్లో వ్యవసాయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. దీని వలన, రైతులకు, వ్యవసాయానికి ఏ విధమైన ప్రయోజనం వస్తుందో ఆలోచించాల్సిందే.
ప్రధానంగా, వ్యవసాయానికి సంబందించిన హామీలలో చాలా ఎక్కువగానే ‘ఆధునీకరణ’ గురించి అనేకసార్లు ప్రస్తావించారు. మరి, లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు, అందునా కౌలుదారులకు వ్యవసాయ ఆధునీకరణ వల్ల ఎటువంటి లాభం వస్తుందో, వారి కష్టాలు ఎలా తీరుతాయో చెప్పలేదు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం బట్టి, యంత్రికరణ ఫలితాల బట్టి చూస్తే, ఈ ఆధునీకరణ కేవలం పెద్ద కమతాలకు ఉపయోగపడవచ్చు గాని, 75 శాతం రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు. వచ్చే అయిదేళ్ళలో వారికి ఉపయోగపడే ‘ఆధునికత’ వస్తుందనే ఆశలు కూడా లేవు. ఆ విధంగా, తెలుగు దేశం హామీ పత్రం వ్యవసాయంలో కొన్ని వర్గాలకే కొమ్ము కాసేలా ఉంది. సహాయం అవసరమైన రైతులకు ఈ హామీ పత్రం దార్శనిక పత్రం కాకపోవడం దురదృష్టకరం.
“శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడించి వ్యవసాయంపై ఆధారపడ్డ ప్రజల ఆదాయం పెంచి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రణాళికను అమలు చేయటమే తెలుగు దేశం మొదటి ప్రాధాన్యత” అని చెప్పారు ఇటువంటి ఆలోచన మన దేశ మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రభుత్వం, వివిధ పార్టీలు, ప్రత్యేకంగా, తెలుగు దేశం బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ కూడా చెబుతూనే ఉన్నారు. వ్యవసాయంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జోడించినప్పుడల్లా, చిన్న సన్నకారు రైతుల మీద ఆర్థిక భారం పెరుగుతుంటే స్పందించని ఇటువంటి ఆలోచనాపరులు మళ్ళి అదే పరిష్కారం అని చెప్పటంలో ఔచిత్యం ఏమిటో అర్థం కానిది.
ఇందులో ఉన్న వినూత్నమైన ఆలోచన ఏమిటి అని పరికిస్తే హామీ పత్రంలో అనేక చోట్ల వారి అలోచన ఆణిముత్యాలు కనిపిస్తాయి. “షేడ్ నెట్, గ్రీన్ హౌస్ టెక్నాలజీ గ్రామీణ రైతులకు చేరువుగా తీసుకువస్తాం. వ్యవసాయ పనిముట్లను రాయితి ధరలపైన అందిస్తాం. శాస్త్రవేత్తల సలహాలను రైతులకు సకాలంలో అందచేస్తం. ఆధునిక యంత్రాలను, అధిక ఉత్పత్తి దోహదపడే విత్తనాలను ఉపయోగించి పండ్ల తోటలు, వాణిజ్య పంటలకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తాం.” వీటిలో వినూత్నం ఏది లేదు. గత ఇరవై ఏళ్లుగా, అన్ని ప్రభుత్వాలు, పార్టీలూ ఈ దిశగానే, పెద్ద కమతాలకు అనుగుణమైన వ్యవసాయ పద్దతులు, పరిష్కారాలు చూపుతూనే ఉన్నాయి. వ్యవసాయాన్ని కార్పోరేటికరణ చేసే దిశగా, చిన్న, సన్నకారు రైతులను వ్యవసాయం నుంచి దాటించే దిశగానే ఈ ఆలోచనలు ఉన్నాయి.
అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానిస్తాం అని చెప్పిన తెలుగు దేశం హామీ పత్రానికి, వ్యవసాయంలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సహమిస్తము అన్న కాంగ్రెస్ హామీ పత్రానికి తేడా ఏమి లేదు. పత్రంలో ఎక్కడ చెప్పారు, ఎప్పుడు చెప్పారు అనే మీమాంస తప్పితే, ఆలోచన విధానం ఒకటే అనేది ఇక్కడ రుజువు అవుతున్నది. ఏళ్ల క్రింద శ్రీ. చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించిన విజన్ 2020 కి, 2014లో ప్రకిటించిన ఎన్నికల హామీ పత్రానికి సారూప్యం అనేక విధాలుగా కనపడుతుంది. సంక్షేమ హామీలను, రుణ మాఫి పథకాలను గుప్పించి దానిని దాచిపెట్టే ప్రయత్నము చేసినా, అనేక సందర్భాలలో అప్పటి ఆలోచనలు సజీవంగా ఉన్నాయి అనడానికి ఇందులో అనేక తార్కాణాలు.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు వేరుగా ‘హామీ పత్రాలు’ ప్రకటించినా, ఆయా రాష్ట్రాల ప్రత్యేకతలను గుర్తించిన దాఖలాలు కనపడలేదు. బహుశ రెండింటిని ఒకే వ్యక్తి సమూహం తయారు చేసినట్టుంది. పోలిస్తే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పత్రంలో దీర్ఘ ఆలోచన కనపడుతుంది. ఆశ్చర్యంగా, మార్కెట్ స్థిరీకరణ నిధి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రూ.5000 కోట్లు, తెలంగాణకి కేవలం రూ.1000 కోట్ల ప్రకటన అంచనాల ఆధారంగా జరిగిందా, అవసరార్థం చేసారా అనే అనుమానం రాక తప్పదు. ఈ తేడా ఎందుకు అనే ప్రశ్న రాక మానదు. రైతులకు కాంప్లెక్స్ ఎరువులు/మైక్రో న్యూత్రిఎంత్స్ (మిచ్రొ నుత్రిఎంత్స్) సరఫరా నిమిత్తం రూ.500 కోట్లతో ఆంధ్రాలో 50 లక్షలు, తెలంగాణాలో రూ.400 కోట్లతో ౩౦ లక్షల సన్నకారు, చిన్నకారు రైతులకు లాభం చేకూరుస్తామన్నారు. ఇది లెక్కల తేడానా లేక శాస్త్రీయత లోపమా? తెలంగాణాలో సౌర వ్యవసాయ పంపు సెట్లకు ఒక దగ్గర 70 శాతం ఇంకొక దగ్గర 75 శాతం రాయితి ఇస్తామన్నారు. ఇందులో ఏది నిజమో? తెలంగాణాలో వ్యవసాయ యంత్రాలు, ఉపకరణాలకు 50 శాతం సబ్సిడి ఇస్తామన్నారు. ఆంద్ర ప్రదేశ్ లో అదే సబ్సిడి ఇస్తామన్నా, ఎంత శాతం అనేది చెప్పలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ పర్యాటకాన్ని ప్రోత్సహమిస్తమన్నారు. తెలంగాణాలో దాని ఊసు లేదు.
ప్రత్యెక విత్తన చట్టం ఆలోచన సరి అయినదే. అయితే, విత్తన కంపెనీలకు అనుకూలమైన శరద్ పవర్ రూపొందించిన విత్తన చట్టం కాకుండా, వాటిని నియంత్రించి రైతుల ప్రయోజనాలు కాపాడే చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హామీ ఆ విధంగా ఇస్తే బాగుంటుంది. కాకపోతే, బిటి ప్రత్తి విత్తనాలకు రాయితీలు ఇస్తామని తెలుగు దేశం హామీ ఇవ్వడం విడ్డూరం. ఎవరు అడిగారని హామీ ఇచ్చారో? రైతులకు దీని వలన ఉపయోగం లేకపోగా, ప్రైవేటు విత్తన కంపెనీలకు ఇది ఖచ్చితంగా లాభం చేకుర్చేదే. బిటి ప్రత్తి విత్తన ధరల నిర్ణయాలలో అవకతవకలు ఉండంగా, సబ్సిడీల వల్ల కంపెనీలకే లాభం. ఇప్పటికే, ప్రైవేటు విత్తన కంపెనీలు ఇష్టానుసారంగా నాణ్యత లేని విత్తనాలు, అధిక ధరలకు అమ్ముతున్నా, రైతులను ఆదుకునే వ్యవస్థ లేదు. రైతులకు నేరుగా ఉపయోగపడే హామీ ఇస్తే బాగుండేది. వేరుసెనగ విత్తన సబ్సిడీలలో అవినీతి జరిగింది, జరుగుతుంది అన్న పార్టీ, బీటీ ప్రత్తి విత్తనాలలో సబ్సిడి ఇస్తామని హామీ ఇవ్వడం విడ్డూరం. ప్రైవేటు విత్తన కంపెనీలను నియంత్రించాల్సిన ప్రభుత్వం, విత్తన ధరలను తగ్గించాల్సిన ప్రభుత్వం విలువైన ప్రజా ధనం రైతులను దోచుకుంటున్న, మోసం చేస్తున్న విత్తన కంపెనీలకు ధారాదత్తం చేస్తామనడం విజ్ఞంతో చేసిన సూచన కాదు. ఇది ఖచ్చితంగా రైతు వ్యతిరేక చర్య.
వ్యవసాయ రుణాలు మాఫి చేస్తామని ప్రకటన హామీ పత్రంలో కూడా ఉంది. సూత్రప్రాయంగా, ఈ హామీ ఆశించేది అయినా, ఇదివరకటి రుణ మాఫి పథకం అమలు తీరు గమనిస్తే, ఈ హామీలో ఇంకా స్పష్టత ఇచ్చి ఉంటె బాగుండేది. అనుభవం రీత్యా, రుణ మాఫి పథకాలు నిజయీతిగా కిస్తిలు కట్టే వారికి కాకుండా, ఎగ్గోట్టేవరికే ఉపయోగపడుతుంది. కట్టే ఆలోచన ఉన్నవారిని కూడా కట్టకుండా, ఎగ్గొట్టే దిశగా ఈ పథకం ప్రోత్సహిస్తున్నది. కట్టినా, కట్టకున్నా, అప్పులలో కూరుకుపోయిన రైతులకు ఈ పథకం చేరే ప్రణాళిక ఏ పార్టీ చెప్పలేదు. పాలన దక్షుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు స్పష్టత లేని ఇట్లాంటి హామీ ఇవ్వడం సబబుగా లేదు. చిన్న, సన్నకారు రైతుల అప్పులు బ్యాంకుల ద్వార కాకుండా, ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఎక్కువ. సరి అయిన దిశ లేని బ్యాంకు రుణ మాఫి పథకం వల్ల, రైతులకు బ్యాంకులలో అప్పులు పుట్టని పరిస్థితులు వచ్చి, వారిని ఇంకా భద్రత లేని ప్రైవేటి వ్యక్తుల అప్పుల ఉచ్చులో పడేలా చేయడం సరి అయిన ధోరణి కాదు. దీని వలన, రైతులకు, వ్యవసాయానికి వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేవలం రైతులకే కాకుండా చేనేత కార్మికులకు, పవర్ లూం రంగానికి కూడా రుణ మాఫి హామీ ఇచ్చారు.
రెండు రాష్ట్రాల ప్రణాళిక నిధుల కంటే ఎక్కువగా ఉండే రుణ మాఫి పథకం ఆర్థిక బరువు ఏ విధంగా తీరుస్తారు? కేంద్రం మెడలు వంచి తెస్తాం అంటున్నారు, తెలంగాణ రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, రాబోయే పెట్టుబడులు ద్వార వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి ద్వార అవసరమైన నిధులు సమకూరుతాయని తెలుగు దేశం విశ్వాసం. దీనిని బట్టి, వచ్చే అయిదేళ్ళలో, ఇది ఆచరణ సాధ్యం కాని హామీ అనేది స్పష్టం. కేవలం, ఎన్నికల కోసం ఇచ్చిన హామీ ఇది.
కౌలు రైతుల ప్రస్తావన కేవలం వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణ సౌకర్యం కలిపించే ప్రస్తావనతో ఆగిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల చట్టం తీసుకు వచ్చినప్పుడు, దాని అమలు మీద, అనేక విమర్శలు చేసిన తెలుగు దేశం, కౌలు రైతులకు ఏమి చేస్తాం అని స్పష్టంగా పేర్కొనలేదు. కొత్త ఆలోచన ఏది ప్రతిపాదించలేదు.
భూమి చుట్టూ రెండు రాష్ట్రాలలో అనేక సమస్యలు ఉన్నాయి. తెలుగు దేశం ఇచ్చిన హామీలతో ఇంకా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని, ఎక్కడా, ఈ హామీ పత్రాలలో, అనేక వర్గాల మధ్య నలుగుతున్న ఈ సమస్యకు సంబంధించి ఒక్క ప్రస్తావన కూడా లేదు. బహుశా, వారి దృష్టి కోణంలో ఇది సమస్య కాదు. లక్షలాది ఎకరాలు సెజ్ ల పేరిట, పారిశ్రామిక కారిడార్ల పేరిట కాంగ్రెస్స్ ప్రభుత్వం కొందరు వ్యక్తులకు ధారాదత్తం చేస్తే విమర్శించిన తెలుగు దేశం, భూ సమస్యలకు పరిష్కారం చూపకపోవటం ఆశ్చర్యకరం. వ్యవసాయ భూమి వ్యవసాయ యేతర పనులకు మల్లించకుండా ఆపే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వలేదు. గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరుల సమస్య ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పి ఉంటె, గిరిజన హక్కులు కాపాడుతామనే హామీ నమ్మే పరిస్థితి ఉండేది.
రెండు రాష్ట్రాల మధ్య సహకారం గురించి కాని, వచ్చే సమస్యల గురించి కాని ఎక్కడా ప్రస్తావన లేదు. ప్రతిపాదనలు లేవు. రెండింటి మధ్య ఎటువంటి సంబంధం లేనట్లు ఒకే పార్టి ఇచ్చిన రెండు రాష్ట్రాల హామీ పత్రాలు ఉండడం దురదృష్టకరం. నీటి గురించి కాని, పారిశ్రామిక అభివృద్ధి గురించి కాని, దేని మీద ప్రస్తావన లేదు. విభజన ప్రక్రియకు సంబంధించి అసలు ఊసే లేదు. విభజన ప్రక్రియ ఏ విధంగా అందరికి ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేస్తారో చెప్పాల్సిన భాద్యత, కాంగ్రెస్ ను విమర్శించిన తెలుగు దేశం మీద ఉంది. తెలుగు జాతి ప్రజలకొరకు, తెలుగు జాతి ఔన్నత్యానికి, తెలుగు ఆత్మ గౌరవం కాపాడుతాం అని మొదట్లనే చెప్పి, అది సాధ్యపరిచే ప్రక్రియలు చెప్పకపోవడం, ఈ హామీ పత్రం యొక్క డొల్లతనాన్ని బయటపెడుతున్నది.
నీటి మీద, నీటి ప్రాజెక్టుల మీద హామీలు స్పష్టంగానే ఉన్నా, నీటి కొరత తీర్చే మార్గాలు చెప్పలేదు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మెట్ట ప్రాంతాలలో ఉన్నా నీటి సమస్యలు భూగర్భ జలాల గురించి కేవలం చిన్న చెరువులు, ఇంకుడు గుంతల అభివృద్ధికే పరిమితం చేశారు. సామాన్యులకు నీటి వనరుల పైన హక్కు ఏ విధంగా కల్పిస్తారో చెప్పలేదు. పెద్ద బోర్లు ఇంకా లోతుకు వేసుకుని, సమీప చిన్న బోర్లలో నీటి ఊట ఆగిపోయి, ఉన్నవాడికే నీళ్ళు, పేదవాడికి నీళ్ళు లేని పరిస్థితిని ప్రస్తావించలేదు. ఇంకా, నీళ్ళకు సంబందించిన అసమానతలు ఏ విధంగా తొలగిస్తారో తెలియదు. సమస్యనే గుర్తించనప్పుడు, పరిష్కారం ఉంటుంది అని ఆశించడం పొరపాటు అవుతుంది.
చేనేత రంగానికి అనేక హామీలు ఇచ్చారు. కాకపోతే, రెండు రాష్ట్రాలలో ఒకే విధమైన హామీలు ఉండడం గమనార్హం. తెలంగాణ చేనేత ప్రాంతాల ప్రస్తావన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హామీ పత్రంలో ఉండడం, ఆంధ్ర ప్రాంత చేనేత ప్రాంతాల ప్రస్తావన లేకపోవడం హామీ పాత్ర రూపకల్పనలో ఉన్నా లోపాలను చూపెడుతుంది. ప్రత్యేకంగా బడ్జెట్ రూ.వెయ్యి కోట్లకు పెంచుతామన్నారు. అవసరమైన అనేక హామీలు ఉన్నా, ‘చేనేత పరిశ్రమల ఆధునీకరణకు ప్రత్యెక విభాగం’ ఏర్పాటు హామీ ఎందుకో అర్థం కాదు. ఇదివరకు తెలుగు దేశం ప్రభుత్వం నిర్లక్ష్యపరిచిన చేనేత రంగం, ఇప్పుడు వారి హామీ పత్రంలో తగిన దృష్టి పెట్టడం మంచిదే. చేనేత రుణ మాఫి హామీ ఇచ్చిన, ఇదివరకటి రుణ మాఫి పధక అమలు లేమి నేపధ్యంలో, ఈ హామీ మీద నమ్మకం ఏర్పడే అవకాశం తక్కువ. తెలుగు దేశం ఈ హామీ మీద ఇంకా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్లూం మరియు చేనేత మధ్య ఉన్నా వైరుధ్యం కాని సంఘర్షణ కాని గుర్తించకుండా రెండింటిని ఒకే గాటన కట్టటం విజ్ఞత అనిపించుకోదు. చేనేత రంగం విస్తృతంగా ఉన్న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఆధునిక జౌళి రంగానికి పెద్ద పీట వేస్తామని వాగ్దానం చేయడం అవగాహన లోపం అనుకోవాలా, లేదా నిర్లక్ష్యం అనుకోవాలా?
మొత్తం మీద, తెలుగు దేశం కూడా అన్ని రాజకీయ పార్టీల మాదిరే హామీ పత్రం వాగ్దానాలతో, ఆయా వోట్ బ్యాంకులను ఆకర్షించే విధంగా తయారు చేశారు. సామాజిక న్యాయం, పాలన దక్షత వంటి లక్షణాలు మా సొంతం అని చెప్పే పార్టీ, ఎక్కడా పరిపూర్ణ ఆలోచనలతో ముందుకు రాలేదు. ఎన్నికల ముందు, ఏదో తొందరలో ఈ పని పూర్తి అయింది అనిపించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలే ఈ పార్టీ విధానాలను స్పష్టపరిచే అవకాశం ఉంది.