mt_logo

గ్రీకు వీరులు కాదు లీకు వీరులు

By: కోదాటి రామకృష్ణ

కిరణ్‌కుమార్‌రెడ్డి కోర్‌కమిటీ ముందు ఇచ్చిన ప్రజెంటేషన్, చేసిన వాదనల గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే అబ్బో అనిపిస్తోంది. కిరణ్ చెప్పిన విషయాలు విని కోర్‌కమిటీ సభ్యులంతా అబ్బో అనుకున్నారట. ఈయన చేయించిన సర్వే ఫలితాలు చూసి అవాక్కయ్యారట. ఈయన చెప్పిన కారణాలు విని నిజమేనా అని ముక్కున వేలేసుకున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే కిరణ్ బౌలింగ్‌కు కోర్‌కమిటీ సభ్యులు అందరూ డక్‌అవుట్ అయ్యారన్నది సీమాంధ్ర మీడియా గత వారంరోజులుగా లీకుతున్న, గీకుతున్న వార్తల సారాంశం. అందుకే వచ్చే తెలంగాణ ఆగిపోయిందట. ఆయన చేసిందేమో బౌలింగ్. కానీ ఆయనను సీమాంధ్ర మీడియా స్టార్ బ్యాట్స్‌మ్యాన్‌ను చేసింది. ఆయన స్టార్ కాదూ పాడు కాదు, నైట్‌వాచ్‌మ్యాన్ అని ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు అన్నారు. ఆయనో గల్లీ క్రికెటర్ అని మరో మిత్రుడు కామెంట్ చేశాడు. ఆ సంగతేమో కానీ ఆయన చేశాడని మీడియా రాస్తున్న వాదనలు గల్లీ నాయకుడిని తలపింపజేస్తున్నాయి.

విచిత్రం ఏమంటే, కోర్‌కమిటీ సభ్యులంతా చాలా అజ్ఞానంతో ఉన్నారని, వారిని చైతన్యవంతులను చేయడానికే వీరిని పిలిపించుకున్నారని సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర మీడియా భావించడం. ‘నా సర్వే ప్రకారం ఏడు, ఆరు, నాలుగు, ఒకటి వస్తాయి’ అనగానే వారంతా అవునా నిజమా అని కిందపడి గిలగిల కొట్టుకునేంత అమాయకత్వంలో ఉన్నారని వీరంతా తలపోయడం ఇంకా విడ్డూరం. ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ రాష్ట్ర డిమాండు గురించి వారు అరిగించుకోగలిగిన దానికంటే ఎక్కువ సమాచారమే కోర్‌కమిటీ నాయకుల వద్ద ఉంది. రాహుల్‌గాంధీ గత ఆరేడు మాసాల వ్యవధిలో కనీసం రెండుసార్లు స్వయంగా దూతలను పంపి అధ్యయన నివేదికలను తెప్పించుకున్నారు. జాతీయ ఏజెన్సీలతో సర్వేలు చేయించుకున్నారు. ‘నాలుగు సీట్లు కూడా వచ్చే పరిస్థితిలేదు. ఏదో ఒకటి చేయకపోతే ఎలా’ అని అనుకున్నాకనే తెలంగాణ ఎజెండాను చేతుల్లోకి తీసుకున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. అంతేనా జాతీయ చానెళ్లు చేసిన సర్వే రిపోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి తెప్పించుకున్నారు. వారికి ఇంటలిజెన్స్ బ్యూరో ఉంది. అతిపెద్ద గూఢచారి యంత్రాంగం ఉంది. నక్సలైట్ల సమస్యపై జాతీయస్థాయిలో అనేక నివేదికలు ఉన్నాయి.

తెలంగాణ ఇవ్వకుండా ఉంటే తాను 160 అసెంబ్లీ స్థానాలు 25 దాకా లోక్‌సభ స్థానాలు గెలిపించుకువస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్టు, అధిష్ఠానం అలా అయితే పరవాలేదన్నట్టు సీమాంధ్ర మీడియా వంతులవారీగా వండివార్చుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సామర్థ్యం అధిష్ఠానం పెద్దలకు తెలియదా? కొత్తగా ఈయన ఇచ్చే భరోసాతో వారు తలకిందులవుతారా? రాష్ట్రంలో గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించారో కోర్‌కమిటీ పెద్దలకు తెలియదా? ఇవన్నీ ఎందుకంటే జారిపోతున్న సమైక్యాంధ్ర భరోసాను నిలబెట్టే ప్రయత్నం. కూలిపోతున్న ఆధిపత్యాన్ని చివరిదాకా పట్టుకుని వేలాడే ఆరాటం. వీరి భరోసా, వీరి ఆధిపత్యం తెలంగాణ ఇచ్చినా కూలిపోతుంది. ఇవ్వకపోయినా కూలిపోతుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, దామోదర రాజనర్సింహలు ఇచ్చిన ప్రజెంటేషన్‌లు కోర్‌కమిటీని ప్రభావితం చేసిందీ లేదు. అక్కడ వాళ్లు తలకిందులయిందీ లేదు. ఇదంతా చినుకు సాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *