mt_logo

కులం, మతం గురించి కాదు పిల్లల చదువులు, ఉద్యోగాల గురించి ఆలోచించాలి : మంత్రి కేటీఆర్

ఖమ్మం లోని ల‌కారం చెరువుపై 11.75 కోట్ల రూపాయలతో నిర్మించిన కేబుల్ వంతెన‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ అజ‌య్‌తో క‌లిసి ప్రారంభించారు. అలాగే చెరువు కట్టపై మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించిన అనంతరం ర‌ఘునాథపాలెంలో రూ.2 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. ఒక్క రోజులోనే రూ.100 కోట్ల‌తో నిర్మించిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఖ‌మ్మంలో ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. గ‌తంలో మురికి కూపంగా ఉన్న ల‌కారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశారు. ల‌కారం చెరువు వ‌ద్ద‌ తీగ‌ల వంతెనను ఏర్పాటు చేశాం. రోజుకు 2 వేల మంది అక్క‌డికి వ‌చ్చి ఆహ్లాదంగా గ‌డుపుతున్నారు. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి మ‌రో కార్పొరేష‌న్‌లో జ‌ర‌గ‌డం లేదు. ఖ‌మ్మం న‌గరాన్ని నెంబ‌ర్‌వ‌న్‌గా మార్చాల‌న్న‌ది మంత్రి అజ‌య్ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూడ‌లేక‌ అసూయ‌తో కొంద‌రు లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఇవాళ మ‌న దేశంలో ఏం జ‌రుగుతుందో యువ‌త ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు. నిన్న ప్రార్థ‌న‌ల అనంత‌రం 25 కోట్ల మంది ముస్లిం సోద‌రులు దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టడంపై… ఎందుకీ విప‌రీత ధోర‌ణులు అని విచారం వ్యక్తం చేశారు. క‌రెంట్, నీళ్లు లేని గ్రామాల గురించి, పిల్ల‌ల ఉద్యోగాల గురించి ఆలోచించాలి కానీ కులం, మ‌తం పేరిటి చిల్ల‌ర మ‌ల్ల‌ర రాజ‌కీయాలు చేస్తూ, ప‌చ్చ‌గా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చ‌లి మంట‌ల‌ను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. స‌వ్య‌మైన ప‌ద్ధతుల్లో ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *