mt_logo

ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల అరాచకాలను ఎండగడదాం: కేటీఆర్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మంత్రుల అరాచకాలను ఎండగడతామని కేటీఆర్ అన్నారు. అధికార అహంకారంతో ఈ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారి అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ చేపట్టనున్న అంశాలు, కార్యక్రమాలను పార్టీ నేతలకు కేటీఆర్ వివరించారు. జిల్లాలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో మళ్లీ ఫ్లోరోసిస్ భూతం తెరపైకి వస్తోందని కేటీఆర్‌కు జిల్లా పార్టీ నేతలు వివరించారు. అదే విధంగా కాంగ్రెస్ నేతల అరాచకాలు అవినీతి కి అడ్డు అదుపు లేకుండా పోయిందని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

ముఖ్యంగా మంత్రుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది నియోజకవర్గాల వారీగా కేటీఆర్ కు వివరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని అంశాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని కేటీఆర్‌కు చెప్పారు.

రాష్ట్ర రాజకీయాలతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన స్థానిక అంశాల పైన కూడా మరింత చురుగ్గా ప్రజాక్షేత్రంలో వెళ్దామని స్థానిక జిల్లా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.  జిల్లాలో లేవనెత్తాల్సిన సమస్యలను వారికి వివరించారు. అదే విధంగా పార్టీని మరింత బలోపేతం చేయటంతో పాటు, కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించారు.

త్వరలోనే నల్గొండ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.