mt_logo

చిట్టి నాయుడు, ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో హన్మకొండ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పుడు మనం సంధికాలంలో ఉన్నాం. బీఆర్ఎస్ మొదట 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా ఉంది. ఎన్ని అటుపోట్లు ఎదురైనా సరే పెద్ద పెద్ద నేతలతో కొట్లాడి, పోట్లాడి తెలంగాణ సాధించుకున్నాం అని తెలిపారు.

ఢిల్లీని ఒప్పించి మెప్పించాం.. తెలంగాణ కలను సాకారం చేసుకున్నాం. 24 ఏళ్ల ప్రస్థానంలో 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా ఉన్నాం. ఇప్పుడు మనం పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర మనకు కొత్త. రాష్ట్రంలో చాలా మంది మన దిక్కే చూస్తున్నారు. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి అని పేర్కొన్నారు.

ఒక్క జిల్లా కమిటీలో మనం అనుకుంటే 800 మందికి పదవులు ఇచ్చుకోవచ్చు. డీఎంకే పార్టీ 76 ఏళ్లుగా తమిళనాడులో రాజకీయాలను శాసిస్తోంది. 24 ఏళ్ల పార్టీ మనది.. ఇంకా వందేళ్లు ఉండాలంటే మనం మరింత దృఢంగా తయారు కావాలి. ఈ సమయంలోనే మనం పార్టీ నిర్మాణం చేసుకోవాలి.. ఆ దిశగా దృష్టి సారించాలె అని అన్నారు.

వినయ్ భాస్కర్ గారు నిబద్ధత గల నాయకులు. తెల్లారి లేస్తే ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్ భాస్కర్ గారు ఓడిపోవటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన ఓటమికి కారణం మనం చేసింది చెప్పుకోలేకపోవటమేనని తెలుసుకున్నా తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, వరంగల్‌కు ఐటీ కంపెనీలను మనమే తెచ్చాం. అయినా సరే దాన్ని చెప్పుకోలేకపోయాం. వరంగల్‌లో మనం పూర్తి చేసిన కాల్వ విషయంలో సిగ్గు లేకుండా ఇప్పుడున్న ఎమ్మెల్యే పూలాభిషేకాలు చేయించుకుంటున్నాడు అని దుయ్యబట్టారు.

మనం చేసింది చెప్పుకోలేదు.. కానీ వాళ్లు చేయనిదానికి క్రెడిట్ తీసుకుంటున్నారు. కార్యకర్తలు నాకు ఏమీ ఒరిగిందని కొంత నిరాశ చెందారు. నాకు ప్రత్యేకంగా ఏమీ రాలేదంటూ కార్యకర్తలు బాధపడ్డ విషయం నిజమే. దేశంలో అత్యధికంగా జీతాలు ఇచ్చినప్పటికీ ఉద్యోగులు మనకు దూరమయ్యారు. దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పినప్పటికీ అవతల వారి మాటలు నమ్మి యువత మనకు దూరమైంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పుడు ప్రచారాల కారణంగా మనకు దగ్గరగా ఉన్న వర్గాలు దూరమయ్యాయి మన మీద ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ చెప్పిన అబద్దాన్ని పదే పదే చెబుతూ యూట్యూబ్‌లో మన మీద మనకే అనుమానం వచ్చేలా చేశారు. అయినా సరే ఈ ఓటమి కూడా మనకు మంచిదే. గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది. చిట్టి నాయుడు ఉంటేనే కదా కేసీఆర్ విలువ తెలుస్తుంది అని ఎద్దేవా చేశారు.

ఆడబిడ్డలకు తులం బంగారం అన్నాడు.. తులం ఇనుము కూడా లేదు.. ఆడబిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లగ్గం పక్కా చేస్తారు. అత్తకు నాలుగు వేలు, కోడలుకు రూ. 2,500 అన్నాడు. బంగారం అన్నాడు, తులం బంగారం అన్నాడు.. ఏదీ లేదు. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 25 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ సిలిండర్ల పథకం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి ఈ ప్రభుత్వం పనికొచ్చే పని చేసిందా? అని కేటీఆర్ అడిగారు.

అసలు ముఖ్యమంత్రిని అయితా అని రేవంత్ రెడ్డి కూడా అనుకోలే.. ఆయన దోస్తులే నాకు చెప్పారు. 2028లో సీఎం అవుదామనుకున్నాడు.. అందుకే ఈసారి నోటికి వచ్చినట్లు అడ్డగోలు అబద్ధాలు చెప్పాడు. నిజంగా బరువు, బాధ్యతలు ఉన్నోడు ఇట్ల చెప్పాలంటే భయపడతాడు. మొత్తానికి ఊహించని విధంగా తంతే గారెల బుట్టలో పడినట్లు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. కానీ ఆయనకు పరిపాలన అనుభవం లేదు అని విమర్శించారు.

ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన దిక్కుమాలిన మాటాలే మాట్లాడుతున్నాడు. ప్రభుత్వాన్ని నడుపుడంటే మాటలు చెప్పినంత ఈజీగా ఉండదని ఇప్పుడు అర్థమవుతున్నట్లు ఉంది. లంకె బిందెలు ఉంటాయనుకున్నా అంటాడు. లంకె బిందెల కోసం దొంగలు కదా వెతికెదీ? ఇలాంటి వ్యక్తిని మన సీఎంగా భరించాల్సిన పరిస్థితి. ఏం చేయలేం అని అన్నారు.

మళ్లీ నాలుగేళ్లలో కేసీఆర్ గారి గెలిపించుకోవాల్సి ఉంది. కొంతమంది పార్టీ నుంచి పోతే పోనివ్వండి. కుండ పగిలిన సరే కుక్క బుద్ధి తెలుస్తది. పెద్ద పెద్ద నాయకులు మంచి మంచి పదవులు తీసుకొని పార్టీని వదిలి వెళ్లారు. వాళ్లను పచ్చి బూతులు తిట్టిన రేవంత్ రెడ్డి చుట్టు సిగ్గులేకుండా తిరుగుతున్నారు అని మండిపడ్డారు.

మన వాళ్ల ఇళ్ల చుట్టు తిరిగిన సిగ్గు లేకుండా కండువాలు కప్పి చేర్చుకున్నది ఈ ముఖ్యమంత్రి కాదా? కానీ హైకోర్టు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నెల లోగా నిర్ణయం తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చింది. అందుకే వారిలో భయం మొదలైంది. మన ఎమ్మెల్యేలే కొట్టుకున్నారని శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు. ఇజ్జత్, మానం ఉన్నోడు అట్ల మాట్లాడుతాడా? అని ప్రశ్నించారు.

నువ్వు అన్నట్లు గాంధీ మా ఎమ్మెల్యే అయితే ఆయనకు కండువా కప్పిన దౌర్భాగ్యుడు ఎవరు? మీ ముఖ్యమంత్రి కాదా? స్టేషన్ ఘన్‌పూర్‌లో బరాబర్ ఉప ఎన్నిక వస్తది. తప్పకుండా మనమే గెలుస్తాం. స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్య గారే మన క్యాండిడేట్ అని ఇప్పటికే కేసీఆర్ గారు ప్రకటించారు అని తెలిపారు.

అంబేడ్కర్ అభయ హస్తం పేరుతో రూ. 12 లక్షలు ఇస్తా అన్నాడు.. కానీ మనం ఇచ్చిన దళిత బంధు రెండో విడత పైసలే ఈ ముఖ్యమంత్రి ఇస్తలేడు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రెండో ఇన్‌స్టాల్‌మెంట్లు ఇస్తలేరు. ఆ విద్యార్థులు మా గురించి మాట్లాడమని అడుగుతున్నారు. కొత్తవి కాదు.. ఉన్నవి ఇస్తేనే గొప్ప ఈ ముఖ్యమంత్రి. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన దురదృష్టం అని వ్యాఖ్యానించారు.

నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. వాళ్లు వస్తే ఫ్రీగా చేస్తాం అన్నారు. ఇప్పుడు మాత్రం పేదలను జలగల్లాగ పీడిస్తూ స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేస్తున్నారు. పదేళ్లు అధికారంలో లేకపోవటంతో ఇక ఇప్పుడు అందిన కాడికి దోచుకోవాలని అనుకుంటున్నారు. చిట్టి నాయుడు వాళ్ల అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మంత్రులు ఎక్కడికక్కడ దోపీడీలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి అమెరికా పోతే ఆయన తమ్ముడే ముఖ్యమంత్రితో వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు అని ఆరోపించారు.

మేము విదేశాలకు పోతే అక్రమ సంపాదన మలుపుకోవటానికి ఇలా చేస్తున్నారని అన్నారు. మరీ మీ అన్నగానికి ఎలా వెయ్యి కోట్లు వచ్చాయో చెప్పు. నీ బావమరది కంపెనీకి రూ. 2 కోట్లు లాభం ఉంటే రూ. 1,137 కోట్ల పనులు ఎలా ఇచ్చావ్? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రాష్ట్రం మీద స్వైర విహారం చేస్తూ దోచుకుంటున్నారు. ఈ ప్రభుత్వం తీరు చూసి కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

రైతులను కూడా రుణమాఫీ పేరుతో పచ్చి మోసం చేసిండు.. ముఖ్యమంత్రి గ్రామంలో రుణమాఫీ జరిగిందో లేదో తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్ట్‌లపై దాడి చేశారు. రుణమాఫీ చేస్తే ఎందుకు అంత భయం? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన మా పార్టీ బృందాన్ని అరెస్ట్ చేశారు. ఏం దాచి పెడుతున్నావ్ ముఖ్యమంత్రి? ఎందుకంతా భయం? ఈ ప్రభుత్వాన్ని మనం ఎక్కడిక్కడ నిలదీస్తూనే ఉందాం అని స్పష్టం చేశారు.

వరంగల్‌కు వేల కోట్ల రూపాయలను కేటాయించాం. కానీ ఈ ప్రభుత్వం అభివృద్ధి పనులను రద్దు చేస్తోంది. మనం ఉన్నప్పుడు శరవేగంగా నిర్మాణంలో ఉన్న ఎంజీఎం హాస్పిటల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరంగల్‌ను ఐటీ హబ్ చేస్తారంట. మీరు హబ్ కాదు గబ్బు చేయకుంటే చాలు. మీకు అంతా తెలివి లేదు. మీ చిట్టి నాయుడును చూసి ఎవరైనా వస్తరా? అని విమర్శించారు.

ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ మీద గానీ, ప్రజల మీద గానీ ప్రేమ లేదు. పైసలు సంపాదించుకోవటం మీదనే ధ్యాసంతా. పేదవాళ్లు, వృద్ధుల అంశాలపై మనం కొట్లాడుదాం. బీసీల కుల గణన, సబ్ ప్లాన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.. ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటే రూ. 8 వేల కోట్లే కేటాయించారు అని అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి అన్నింటికి ఒక్కొక్క కమిటీ వేసుకుందాం. ఆ బృందం షాడో గవర్నమెంట్ మాదిరిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పని చేస్తుంది. మైనార్టీలకు ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. వారి తరపున కూడా పోరాడుదాం అని తెలిపారు.

బీజేపీ పేరుకే ఉంది.. 9 నెలలుగా రేవంత్ రెడ్డికి రక్షణకవచం లాగా బీజేపీ ఉంది. మనల్ని కూడా ఒక్క మాట అననిస్తలేరు. గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ గాంధీ అంటే గుజరాత్ మోడల్ బెస్ట్ అని రేవంత్ రెడ్డి అంటాడు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ అంటే అదానీ మేరా ఫ్రెండ్ అని రేవంత్ రెడ్డి అంటాడు. చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటే చౌకీదార్ హమారా బడే భాయ్ అని రేవంత్ రెడ్డి అంటాడు అని దుయ్యబట్టారు.

మున్సిపల్ శాఖలో టెండర్ల అవినీతి జరిగింది. ముఖ్యమంత్రి బావమరిదికి అక్రమంగా టెండర్లు ఇచ్చారని నేను అంటే బీజేపీ స్పందించదు. కిషన్ రెడ్డి మాట్లాడుతలేడు. బండి సంజయ్ మాత్రం గబ్బు గబ్బు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ మీద మనం పోరాటం చేస్తే బీజేపీ ఎంపీలు వాళ్లకు రక్షణ కవచంగా వస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ఇప్పుడు గులాబీ కండువా దిక్కే చూస్తున్నారు అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ వాళ్లు ప్రకటించిన అన్ని డిక్లరేషన్ల మీద మనం పోరాడుదాం. తల్లి లాంటి పార్టీని ఎవరు విమర్శించిన సరే అందరూ గట్టిగా పోరాడాలి. రోజు కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎండగట్టాలె. వరంగల్‌లో భూ కుంభకోణాలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడున్న లీడర్లు భూ కుంభకోణాలు చేసే వాళ్లు.. వాళ్ల బుద్ధి మారదు. ఎక్కడైనా సరే మనం పేదవాళ్లకు అండగా ఉందాం అని అన్నారు.

హైడ్రా అనే హైడ్రామా వరంగల్ లో కూడా మొదలైతది. పేదలైన, పెద్దలైన అందరికీ ఒకే విధంగా న్యాయం జరగాలే. లేదంటే మనం పేదలకు అండగా ఉంటూ వారికి లీగల్ గానూ సాయం చేద్దాం. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను కూడా అమలు అయ్యే వరకు వాళ్లను ఎండగడుదాం. పోయిన చెత్త అంతా పోనివ్వండి. పార్టీని మంచిగా నిర్మాణం చేసుకుందాం అని కేటీఆర్ తెలిపారు.

పార్టీలో శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలె.. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే పైసలకు మధ్య కార్యకర్తలు ఉండాలని సూచనలు వచ్చాయి. వాటిని కూడా అమలు చేసుకుందాం. గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుందాం అని హామీ ఇచ్చారు.