-ప్రజలతో మమేకమవ్వడమే పెద్ద ఫాలోయింగ్
-మంత్రి కేటీఆర్‌కు ప్రముఖ మ్యాగజైన్లు రిట్జ్, యూ అండ్ ఐ ప్రశంస!
సినీ ప్రముఖులు, పేజ్ త్రీ సెలబ్రిటీలకు పరిమితమయ్యే మ్యాగజైన్లు కొత్త ట్రెండ్‌ను ప్రారంభించాయి. సమాజానికి దిశానిర్దేశం చేసే రాజకీయవేత్తల లక్ష్యాలను, ఆలోచనలను తెలుసుకునేందుకు ఇంటర్వ్యూలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో ప్రముఖ మ్యాగజైన్ రిట్జ్, హైదరాబాద్‌లోని పాపులర్ మ్యాగజైన్ యూ అండ్ ఐ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావును వేర్వేరుగా ఇంటర్యూ చేశాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని మ్యాగజైన్లు పేర్కొన్నాయి.
గూగుల్ లాంటి ప్రపంచస్థాయి సంస్థలను హైదరాబాద్‌కు రప్పించడం, పబ్లిక్ వైఫై, స్టార్టప్ కంపెనీలకు ఊతం ఇచ్చేలా ఏర్పాటుచేసిన టీ హబ్, యువతకు శిక్షణ ఇచ్చేందుకు, ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలు అందించేందుకు టాస్క్ వంటి నూతన వేదికలను ఏర్పాటుచేసిన మంత్రి కేటీఆర్ కృషిని అభినందించాయి. 27 ఏండ్లలోనే ఎమ్మెల్యేగా, 35 ఏండ్ల వయస్సులో క్యాబినెట్ మంత్రి అయిన ఆయనలో చురుకుదనం, అనుభవం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని పేర్కొన్నాయి. స్పష్టమైన వైఖరిని వెల్లడించడం, ఆకర్షణీయమైన పద ప్రయోగంతో ఆకట్టుకుంటూ ప్రజల్లో మమేకమవ్వడం కేటీఆర్‌కు పెద్ద ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయని ప్రశంసల వర్షం కురిపించాయి. రిట్జ్ మ్యాగజైన్ ది కంప్లీట్ మ్యాన్ పేరుతో, మ్యాన్ ఆన్ ఏ మిషన్ అని యూ అండ్ ఐ కవర్‌పేజీ కథనాన్ని ప్రచురించాయి.
పారదర్శకత.. నిజాయితీ అధికారులే బలం
ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడం, శాంతిభద్రతలు అదుపులో ఉంచటం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో సీఎం కేసీఆర్ సఫలీకృతమయ్యారని మంత్రి కేటీఆర్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించిన ప్రభుత్వం.. ప్రస్తుతం పక్కాగా అమలు చేసేందుకు కృషిచేస్తున్నదని ప్రస్తావించారు. ఇరిగేషన్, తాగు, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, కేజీ టు పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్‌రూం లాంటి పథకాలతో సీఎం కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగమయ్యారని అన్నారు. పాలనలో పారదర్శకత, నిజాయితీ అధికారులు, వెంటనే అనుమతులు వచ్చే పర్యావరణ విధానం తెలంగాణ ప్రభుత్వ బలమని తెలిపారు. పుష్కలంగా ఉన్న సహజవనరులు, అద్భుతమైన మానవవనరులు తెలంగాణలో ఉండటం తమకు అదనపు బలం అని అన్నారు.
2006 కరీంనగర్ ఉప ఎన్నికే కీలకం..
రాజకీయాల్లోకి రావాలా? వద్దా అనే అంశంపై తన తండ్రి, సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే 2006లో కరీంనగర్ ఉప ఎన్నికల సందర్భంగా రాజకీయం వైపు అడుగులేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బోర్డింగ్ స్కూళ్లలో తను చదివిన అనుభవం కారణంగా.. తొలుత రాజకీయాలు ఒకింత భారంగా అనిపించినా.. కాలం తనకు ఎంతో అనుభవాన్ని నేర్పించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
అమ్మ మార్గదర్శకురాలు.. సోదరి కవిత డైనమిక్
ముఖ్యమంత్రికి సతీమణి అయినా.. ఇప్పటికీ తన మాతృమూర్తి స్వయంగా వంట చేయడం తనకు ముచ్చటేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పలు సందర్భాల్లో తన తల్లి చెప్పే మాటలు ఎంతో మార్గదర్శకంగా ఉంటాయని, స్ఫూర్తిని కలిగిస్తాయని తెలిపారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడంలో తన సతీమణి శైలిమ సహకారం ఎంతో ఉందన్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో కుటుంబం కోసం సమయం కేటాయించకపోయినా.. తన బాధ్యతలను సతీమణి పంచుకోవడం తనకు పెద్ద అండ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తన సోదరి, ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంతో డైనమిక్‌గా ఉంటుందని కితాబిచ్చారు. పలు సందర్భాల్లో ఆమెను చూసి స్పూర్తిని పొందుతుంటానని మంత్రి కేటీఆర్ వివరించారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..