mt_logo

బీఆర్ఎస్‌పై ఎదురుదాడి పక్కన పెట్టి.. పాల‌నా లోపాలను స‌రిదిద్దుకోండి: కాంగ్రెస్‌కు కేటీఆర్ హితవు

వైద్యం అంద‌టం లేదు.. పసి పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు అంటే బురదజ‌ల్లుతున్నారు అని మాట్లాడ‌తారా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

కాంగ్రెస్ ఆరోపించిన‌ట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాల‌నుకుంటే.. హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్దాసుప‌త్రులు, వ‌రంగ‌ల్‌లో న‌డుస్తున్న అతిపెద్ద ఆసుప‌త్రి, బ‌స్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసే వాళ్ల‌మా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ కిట్లు, త‌ల్లి-బిడ్డ‌ను ఇంటి ద‌గ్గ‌ర దిగ‌బెట్టేలా వాహ‌నాలు, సాదార‌ణ ప్ర‌స‌వాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవ‌టం, రెండు ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ కాలేజీలు ఉన్న చోట 33 మెడిక‌ల్ కాలేజీల ఏర్పాట్లు జ‌రిగేవా? అని అడిగారు.

బీఆర్ఎస్‌పై ఎదురుదాడి పక్కన పెట్టి.. ముందుగా కాంగ్రెస్ పాల‌న‌లో ఉన్న లోపాలు స‌రిదిద్దుకోండి. పోయిన ప్రాణాలు తిరిగి రావు.. ఆ త‌ల్లుల క‌డుపుకోత తీర్చ‌లేము. ప్ర‌జ‌లు కూడా మ‌న బిడ్డ‌లే అని మాన‌వ‌త్వంతో ఆలోచిస్తే మీ ఆలోచించే ధోర‌ణితో పాటు కాంగ్రెస్ పాల‌న తీరు కూడా మారుతుంది అని పేర్కొన్నారు.

ఇప్ప‌టికైనా మ‌ర‌ణాల‌పై రివ్యూ చేశారా? నాణ్య‌మైన వైద్యం అందించేందుకు ఫోక‌స్ చేశారా.. లేదా? మొన్న‌టి బ‌దిలీల్లో సీనియ‌ర్ డాక్ట‌ర్ల‌ను బదిలీపై పంపార‌న్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఉందా.. లేదా? ఇది చెప్పండి అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.