mt_logo

ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్ని ప్రభుత్వ హత్యలే: కేటీఆర్

రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ.. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ళారు. ఆటో కార్మికులకు సంఘీభావంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆటో నడిపారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నెన్నో హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏవీ అమలు కాలేదు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్ని ప్రభుత్వ హత్యలే అని దుయ్యబట్టారు.

గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాము. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డేట్టే ఉంది. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయింది అని విమర్శించారు.

ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లకి ఇస్తామని చెప్పిన రూ. 12 వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఎర్పాటు చేస్తామన్న హమీని వెంటనే అమలు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఆటోడ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. బీఆర్ఎస్ పక్షాన వారి కోసం పోరాడతాం. ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా మేము ఆటోల్లో అసెంబ్లీకి వెళుతున్నాం.. వారి యూనిఫామ్‌లు ధరించి వచ్చాము అని తెలిపారు.

అటో డ్రైవర్లకు వారి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది. కార్మిక విభాగం నేతలు బీఆర్ఎస్ నేతలకు అటో డ్రైవర్ సమస్యలపైన వివరాలు అందించారు అని అన్నారు.