mt_logo

లగచర్ల నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలైతుంది: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కనీసం 15 రోజులపాటు అసెంబ్లీని నిర్వహించాలి. రాష్ట్రంలో ఉన్న రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సమస్యలపైన వారికి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపైన చర్చ పెట్టాలి అని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలపైన చర్చించిన తర్వాత.. రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న స్కాంలపైనా.. ఫార్ములా-ఈ వంటి అంశాలపైన చర్చించినా మేము సిద్ధమే. క్యాబినెట్ మీటింగ్ అంటూ గంటల తరబడి ఎవరిని అరెస్ట్ చేయాలో చర్చించడం కాదు. పాలన అంటే ప్రజలకు మంచి చేసేందుకు చర్చించడమే పాలన అనే విషయం గుర్తుంచుకోవాలి అని తెలిపారు.

కొడంగల్ ప్రజల కోసం నిలబడిన మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉక్కుమనిషిగా మారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భవిష్యత్తులో తుక్కుతుక్కు చేస్తాడు. భవిష్యత్తులో లగచర్ల నుంచే మన జైత్రయాత్ర ప్రారంభమవుతుంది.. రేవంత్ రెడ్డి పతనం మెదలైతుంది అని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నక్క వినయాలు ప్రదర్శించి, అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ నుంచి మొదలుకొని అన్ని హామీలను తుంగలో తొక్కింది. రైతు రుణమాఫీ ఎక్కడ 100% పూర్తి కాలేదు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లె కానీ లేదా తెలంగాణలోని ఏ గ్రామంలోనైనా ఈ సవాలుకి సిద్ధమని చెబితే ముఖ్యమంత్రి పారిపోయిండు అని దుయ్యబట్టారు.

తెలంగాణలో 30% కూడా రైతు రుణమాఫీ కాలేదు కానీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ కార్యకర్త దాకా సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే రైతులు ఖచ్చితంగా కాంగ్రెస్‌కి బుద్ధి చెబుతారు. ఒక్క ఏడాది కాలంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై, హామీలను అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది అని కేటీఆర్ విమర్శించారు.

మా పార్టీ అధినేత కేసీఆర్ రావాలి అని డిమాండ్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన మా కార్యకర్తలనే తట్టుకోలేకపోతున్నాడు. ఈయన స్థాయికి కేసీఆర్ అవసరం లేదు. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డితో పాటు లగచర్ల రైతుల బెయిల్ కోసం అన్ని రకాలుగా మా పార్టీ ముందు నుంచి కొట్లాడుతుంది. ఇప్పటికే వారి బెయిల్‌కి సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి..రేపు కోర్టులో మాకు న్యాయం లభిస్తుందన్న నమ్మకం ఉన్నది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

పట్నం నరేందర్ రెడ్డి గారి వెంట నిలబడిన న్యాయవాదులు అందరికీ పార్టీ కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
తన బెయిల్ గురించి కాకుండా రైతుల బెయిల్ గురించి ఆందోళన చెందుతున్న గొప్ప నాయకుడు మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు. లగచర్ల భూములు గుంజుకోవాలన్న దుర్మార్గంతోనే రేవంత్ రెడ్డి కుటుంబం వ్యవహరిస్తుంది. అందుకే ఫార్మా విలేజ్ క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పి.. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కొత్త నాటకంతో ముందుకు పోతుంది అని ఆరోపించారు.

తిరుపతి రెడ్డి అనేటోడు కనీసం వార్డ్ మెంబర్ కాదు జడ్పీటీసీ కాదు కానీ పోలీసులు అండతో అరాచకం చేస్తున్నాడు. కొడంగల్‌లో సేకరిస్తున్న రైతన్న భూములు పరిశ్రమల కోసం కానే కాదు.. కేవలం అల్లుడి కోసం ఆదానీ కోసం. పరిశ్రమలు పెట్టడం, ఉపాధి కల్పించడమే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత అయితే వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూమిలో పరిశ్రమలు పెట్టి ఉపాధి ఇవ్వాలి. లగచర్ల అంశాన్ని వదిలిపెట్టం. అసెంబ్లీ నడిచినని రోజులు లేవనెత్తుతూనే ఉంటాము అని స్పష్టం చేశారు.

ఈరోజు అరెస్టు చేసిన లగచర్ల రైతులను, పార్టీ నేతలను వెంటనే పోలీసులు విడుదల చేయాలి. కొడంగల్ పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత మాది. రేవంత్ రెడ్డి అరాచకాలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చారు.