mt_logo

అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబీకుల భారీ అవినీతి: కేటీఆర్

అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబీకుల భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు లేఖ రాశారు.

అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ దక్కించుకున్న రూ. 1,137 కోట్ల పనుల తాలూకు పత్రాలను బయటపెట్టిన కేటీఆర్.. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి టెండర్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను రేవంత్ రెడ్డి కుటుంబం దక్కించుకున్నదని కేటీఆర్ అన్నారు.

ఆ తర్వాత ఇదే కంపెనీతో తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్ కంపెనీతో ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్నదని ఆరోపణ చేశారు. ఇదే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పజెప్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. వాటి తాలూకు సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి వ్యవహారాన్ని నడుపుతుందని రేవంత్ రెడ్డిపై ఆరోపణ చేశారు.

అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్ల పైన పూర్తిస్థాయి విచారణ జరిపి, టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

9 నెలలుగా రాష్ట్రంలోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రతి టెండర్‌పైన విచారణ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి టెండర్ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.