తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎండాకాలంలో కూడా కోతల్లేని కరెంట్ సరఫరా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సీ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గ ఆత్మకూరు ఎంపీపీ శ్రీధర్ గౌడ్, మరో ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు వారి అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోతే తెలంగాణలో అంధకారం నెలకొంటుందని సమైక్య రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి, ఆఖరి కిరణం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, తెలంగాణ కాదు గానీ.. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం అంధకారంలోకి వెళ్లిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోని పది జిల్లాలు అన్యాయానికి గురైతే, అందులో ఎక్కువగా పాలమూరు జిల్లాకు నష్టం జరిగిందన్నారు. వలసలు, మట్టి మనుషుల జిల్లాగా పేరొందిన పాలమూరును రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉన్నారని, వెనుకబడిన పాలమూరు జిల్లాతో పాటు ఫ్లోరైడ్ తో అలమటిస్తున్న నల్గొండ జిల్లాకు తాగునీరు ఇచ్చాకే ఇతర జిల్లాలకు నీళ్ళు ఇవ్వాలని వాటర్ గ్రిడ్ పై జరిగిన సమావేశంలో చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.
కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో అభివృద్ధి చెందుతుందని, జిల్లాలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని, అందరం కలిసి ఆయనకు అండగా నిలవాలని చెప్పారు.