రాష్ట్రాన్ని 60 ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీలు భ్రష్టు పట్టించాయని, ఆ దరిద్రం పదినెలల్లో పోదని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాలను అభివృద్ధిపథంలో శాశ్వత ప్రాతిపదికన నిర్వహిస్తూ ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని ఎగతాళి చేసినవారున్నారని, వారికి ధీటైన జవాబిస్తూ తెలంగాణ రాష్ట్రం నిలిచి గెలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన నాయకుడని, ఉద్యమనాయకుడిగా 14 ఏళ్ళు ఉద్యమాన్ని ఎంత పట్టుదలతో నడిపించారో అంతే పట్టుదలతో, దీక్షతో ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్నారన్నారు. రేషన్ బియ్యాన్ని మనిషికి నాలుగు కిలోల నుండి ఆరుకిలోలకు పెంచడమే కాకుండా సీలింగ్ ను ఎత్తేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరుకిలోల చొప్పున ఇస్తున్న సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్నదని, దేశంలో మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు.
గత 30 సంవత్సరాల్లో ఏనాడూ లేనివిధంగా మండువేసవిలో కోతలులేని కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, రాబోయే రోజుల్లో కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతున్నదని స్పష్టం చేశారు. కరెంట్ సమస్యలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని, రాష్ట్రంలో ఈ సీజన్ లో కూడా కరెంట్ కష్టాలు ఉంటాయని, తమకు చేతినిండా పని దొరుకుతుందని ప్రతిపక్షాలు కలలు కన్నాయని, ప్రభుత్వ విధానాలను అభాసుపాలు చేయాలని తలచిన విపక్షాలకు ఇప్పుడు పనే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల సహకారం ఉంటే ఎలాంటి ఇబ్బందులనైనా సులభంగా అధిగమించి బంగారు తెలంగాణ సాధిస్తామని కేటీఆర్ అన్నారు.