mt_logo

జూన్ కల్లా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు– తుమ్మల

త్వరలో జరగబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకోసం చేపట్టిన రోడ్ల మరమ్మతు, నిర్మాణ కార్యక్రమాలను జూన్ నాటికల్లా పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సచివాలయంలో ఈరోజు మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుష్కరాలలో రద్దీని తట్టుకునే విధంగా మరిన్ని స్నాన ఘట్టాలు నిర్మిస్తామని, అందుబాటులో ఉన్న విశ్రాంతి గృహాలతో పాటు జిల్లా కేంద్రాల్లోని విశ్రాంతి గృహాలను కూడా మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఐదు జిల్లాల్లో రూ. 250 కోట్లతో 37 రోడ్లకు అనుమతులిచ్చామని, 36 చోట్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. అంతేకాకుండా జూన్ నాటికల్లా రహదారుల టెండర్లను పూర్తి చేస్తామని, మరో వెయ్యి టెండర్లకు అనుమతులిచ్చామని, వాటిని జూన్ కల్లా 50 శాతం పూర్తి చేస్తామని తుమ్మల పేర్కొన్నారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని త్వరలోనే కలిసి వరంగల్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులను ఏర్పాటుచేయాల్సిందిగా కోరుతామని, ఇప్పటికే వరంగల్ ఎయిర్ పోర్టును అడిగినట్లు తుమ్మల చెప్పారు. రహదార్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని, కేజీ వీల్స్ తో రోడ్లమీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, హైదరాబాద్ లోని ఆర్అండ్ బీ రోడ్లను జీహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చామన్నారు. నిజామాబాద్, ఖమ్మం కేంద్రాలకు నాలుగు లైన్ల రోడ్లు లేవని, వీటికి సంబంధించి త్వరలోనే టెండర్లను చేపడతామని చెప్పారు. సెప్టెంబర్ తర్వాత పవర్ కట్ లేని రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతోందని, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *