కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు.
ఆనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న ఆయన కోలుకుంటారని భావించానని కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు.
కమ్యూనిస్ట్ నాయకుడిగా సీతారాం ఏచూరి జీవితాంతం ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశారని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో ఏచూరి ఎంతో హుందాగా ఉండేవారని అలాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారన్నారు.
జీవితకాలం నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసిన ఏచూరి గారు ఎంతో మందికి స్ఫూర్తి అన్నారు. సీపీఎం పార్టీలోనే కాకుండా దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.
ఆయన చేసిన కృషి కారణంగా ఎన్నో లక్షల మంది కార్మికుల జీవితాలు బాగుపడ్డాయన్నారు. ఏచూరి గారు లేని లేటు తీర్చలేనిదని చెప్పారు.
ఈ కష్టసమయంలో ఏచూరి గారి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.