mt_logo

కౌశిక్ రెడ్డిపై దాడికి ఉసిగొలిపిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలి: హరీష్ రావు

ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి చేసిన గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, ఉసిగొలిపిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే సీపీ, డీజీపీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి. పోరాడి, దెబ్బలు తిని రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఇలాంటి దాడులకు భయపడం అని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీద జరిగిన దాడిపై సైబరాబాద్ జాయింట్ సీపీకి మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల వైఫల్యం వల్లే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఇందుకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అని అన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నార్సింగి పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి న్యాయం జరగాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాలని కోరుతున్నాం. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినొద్దు అని మేం కోరుకుంటున్నాం. గతంలో తెలంగాణ పోలీసులు దేశానికి రోల్ మోడల్‌గా ఉన్నారు అని గుర్తు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను తమ పని తమను చేసుకోనివ్వడం లేదు. పోలీసులను వాళ్ల అక్రమాలకు, అరాచకాలకు, అక్రమ కేసులకు వాడుకుంటున్నారు. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులకు 1వ తేదీన జీతాలు ఇస్తామన్నారు.సైబరాబాద్ పరిధిలో 1200 మంది హోంగార్డులు ఉన్నారు. 12వ తేదీ వచ్చినా హోంగార్డులకు జీతాలు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పోలీసులకు టీఏలు, డీఏలు రిలీజ్ అవట్లేదు. కానిస్టేబుళ్లకు సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వట్లేదు.. కాంట్రాక్టర్లకు వందల కోట్ల డబ్బులిస్తున్నారు అని దుయ్యబట్టారు.

కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి.. లేదంటే సీబీఐ విచారణ కోరుతాం, అవసరమైతే కోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖ వద్దకు వెళ్తాం. నిజనిజాలు బయటకు రావాలి. రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది అని విమర్శించారు.

ఈ దాడి వెనుక పాత్రదారులెవరు? సూత్రదారులెవరు? సహకరించింది ఎవరో అన్నీ బయటకు రావాలి. లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే సీపీ, డీజీపీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయండి. ఈ దాడిని దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సస్పెండ్ చేయాలి అని కోరారు.

రాళ్లు, కత్తులు, కర్రలతో కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. రాష్ట్ర ప్రజలంతా గమనించారు, టీవీల్లో ప్రజలు చూస్తున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. సైబరాబాద్ పోలీసులంటే ఒక మంచి ఇమెజ్ ఉండే.. దాన్ని రేవంత్‌రెడ్డి మంటగలిపిండు అని హరీష్ రావు అన్నారు.

రేవంత్ నిన్ను హెచ్చరిస్తున్నా.. దాడి చేసిన గుండాలను అరెస్ట్ చెయ్.. వారికి సహకరించిన పోలీసులపై యాక్షన్ తీసుకో. లేకపోతే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు, ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతులో పట్టుకొని తిరగడం కాదు..
కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నరో దేశం మొత్తం తెలిసేలా చేస్తాం అని హెచ్చరించారు.

రాహుల్ గాంధీకి నిజాయితీ లేదు.. ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని చెప్పాలని తెలీదా. చేర్చుకున్నా వారిని రాజీనామా చేయాలని చెప్పొద్దా. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్తే అక్కడ దాడి చేశారు. నల్గొండ జిల్లాలో మాపై దాడి చేశారు. కానీ, ఇప్పటి వరకు ఆ గూండాలపై చర్యలు తీసుకోలేదు అని అన్నారు.

లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు మేము ప్రతి దాడులు చేయడం లేదు. పోరాడి, దెబ్బలు తిని రాష్ట్రాన్ని సాధించుకున్నం ఇలాంటి దాడులకు భయపడం. గుండాలు, సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టం అని తెలిపారు.

2014లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డిని ఆరోజు పీఏసీ చైర్మన్ పేరు ఇవ్వాలని నేను కోరాను. నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పేరు ఇస్తే మేము పీఏసీ చైర్మన్‌గా అపాయింట్ చేసాం. వారు చనిపోతే పాలేరు ఎమ్మెల్యే రామ్‌రెడ్డి వెంకట్ రెడ్డి పేరు ఇస్తే వారిని కూడా పీఏసీగా నామినేట్ చేసాం. తర్వాత గీతా రెడ్డి గారి పేరు ఇస్తే వారిని పీఏసీ చైర్మన్‌గా అపాయింట్ చేసాం అని గుర్తు చేశారు.

2018లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి పీఏసీ చైర్మన్ ఇచ్చాము. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని పీఏసీ చైర్మన్ ఎంపిక గురించి అడగకుండా ఎన్నికలేకుండా అపాయింట్ చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.

పార్లమెంట్లో కేసీ వేణుగోపాల్‌ని పీఏసీ చైర్మన్‌గా ఎన్నుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు మన రాహుల్ గాంధీని అడిగి చేయలేదా. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుని అడగాలి కదా.. రూల్ 250 ప్రకారంగా ఒక్క సభ్యుని కంటే ఎక్కువ నామినేషన్ వస్తే ఎన్నిక నిర్వహించాలి. నేను కూడా పీఏసీ చైర్మన్‌కు నామినేషన్ దాఖలు చేశాను.. ఎన్నిక లేకుండా తిరస్కరించే అధికారం లేదు అని అన్నారు.

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మా నామినేషన్ రాత్రికి రాతి మార్చి పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు.. నిలదీసిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు. అధికారం శాశ్వతం కాదు. పోలీస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని హరీష్ రావు హెచ్చరించారు.