ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి సీఎం రేవంత్ రెడ్డి చేయించారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగింది.. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా అని అడిగారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగింది. మా కార్యకర్తలను గృహ నిర్భంధం, అరెస్టులు చేశారు. కానీ పైలెట్, ఎస్కార్ట్ ఇచ్చి మా ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ వాళ్ళను దాడికి పంపారు అని దుయ్యబట్టారు.
సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఖమ్మంలో వరద భాధితుల పరామర్శకు వెళ్తే మాపై దాడి చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పింది గాంధీ కాదా. మా ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేసి పోలీసులు ఏం చేస్తున్నారు అని అడిగారు.
కౌశిక్ రెడ్డిపై దాడి రేవంత్ రెడ్డి చేయించారు.. ఏసీపీ, సీఐను వెంటనే సస్పెండ్ చేయాలి. కేసీఆర్ హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడారు. పెట్టుబడులు స్వర్గధామంగా హైదరాబాద్‌ను కేసీఆర్ చేశారు అని అన్నారు
రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుపుతప్పాయి.. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుంది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలు అయింది. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం అని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నారు.. రాష్ట్రంలో తొమ్మిది కమ్యూనల్ ఘటనలు చోటుచేసుకున్నాయి. తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రతిష్టపాలు అయింది అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మా సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు.. మాకు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ముఖ్యం. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో స్పీకర్ స్పందించాలి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మందలిస్తారా లేదా చెప్పాలి. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు అని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ దోపిడీ,మోసాలు, ఆరు గ్యారెంటీల గారడీని దేశం మొత్తం వివరిస్తాము అని అన్నారు.. సైబరాబాద్ సీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేస్తారు అని హరీష్ రావు తెలిపారు.