mt_logo

దిలీప్ కొణతం అరెస్టును ఖండించిన కేటీఆర్

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు అని అన్నారు.

కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేకపోతోంది. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా హైకోర్టు చీవాట్లు పెట్టినా, బుద్ధి రాలేదు అని విమర్శించారు.

ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పకుండా అరెస్ట్ చేశారు అని దుయ్యబట్టారు.

ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే? అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చని అనుకుంటే అది మీ భ్రమే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారు అని పేర్కొన్నారు.

అక్రమంగా దిలీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను విడుదల చేయాలి. 9 నెలలుగా తెలంగాణలో వాక్స్వాతంత్ర్యం లేదు.. నిరంకుశ పాలన సాగుతోంది అని కేటీఆర్ మండిపడ్డారు.