mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే జైనూర్ ఘటన: కేటీఆర్

జైనూర్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని విమర్శించారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. బాధిత మహిళకు కేవలం లక్ష రూపాయల ‘పరిహారం’ ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గం అని అన్నారు.

జైనూర్‌లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి. అల్లర్లలో ఇళ్లు, షాపులు కోల్పోయినవారికి సాయంగా నిలవాలి అని డిమాండ్ చేశారు.

పూర్తి స్థాయి హోం మంత్రి లేకుండానే తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి అని కేటీఆర్ ఆరోపించారు.