mt_logo

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావొద్దంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో గులాబీ జెండా ఎందుకు ఉండాలంటే.. రేపు హైదరాబాద్ ను కేంద్ర పాలితం చేయాలని ప్లాన్ చేసినా? మన అవసరాలను కాదని నదులు అనుసంధానం చేస్తామంటే? మన దక్షిణ భారత దేశానికి ఎంపీ సీట్లలో అన్యాయం చేస్తామంటే? రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ కుట్ర చేస్తావుంటే? దాని అడ్డుకునేది గులాబీ జెండా మాత్రమే.. అందుకే గులాజీ జెండాను గెలిపించుకోవాలె అని పిలుపునిచ్చారు.

ఎక్కడ పోయిన ప్రజలు తినే పళ్లెంలా మన్ను పోసుకున్నాం అంటున్నారు.పాలిచ్చే బర్రెను కాదని పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లు ఉందని అంటున్నారు అని తెలిపారు.

వందరోజుల్లో అన్ని చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేసుకున్నాడు ఛోటే భాయ్. ఆనాడు బడే భాయ్ రూ. 15 లక్షలు అకౌంట్లు వేస్తా అన్నాడు.. రైతుల ఆదాయం డబుల్ అన్నాడు.. బుల్లెట్ రైలు, 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇలా అన్ని చెప్పిండు. అసలు బుల్లెట్ రైలు కదు కదా.. మన కరీంనగర్ రైలుకు కూడా దిక్కు లేదు. భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ చేస్తానన్నాడు.. ఇలా ఎన్నో హామీలిచ్చి మనల్ని మోసం చేసింది బడేభాయ్ మోడీ అని విమర్శించారు.

తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు మోడీ.. ఒకసారి కాదు పదిసార్లు అన్నాడు.. భద్రాచలం మన ఐదు మండలాలను మనల్ని అడగకుండానే ఆంధ్రాలో కలిపేసిండు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, సిరిసిల్లలో టైక్స్‌టైల్ కస్టర్లు, బయ్యారంలో ఉక్కు ఫ్యాకర్టీ ఇలా ఏదీ మనకు చేయలే.. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి ముడి చమురు ధర తగ్గింది. కానీ పెట్రోల్, డిజీల్ ధరలను మాత్రం మోడీ పెంచిండు.. పెట్రోల్, డిజీల్ ధరలు పెంచటంతో అన్ని ధరలు పెరిగినయ్.. ప్రధాని మోడీ ప్రియమైన మోడీ కాదు.. పిరమైన మోడీ అని కేటీఆర్ దుయ్యబట్టారు

పెట్రోల్, డిజీల్ మీద వచ్చే సొమ్ము రాష్ట్రాలకు రాకుండా సెస్ వేసిండు. ఈ పదేళ్లలో ప్రజల ముక్కు పిండి రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. మళ్లీ జాతీయ రహదారుల పేరుతో వాటికి ఖర్చు పెట్టిన అన్నాడు. మరి టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావో చెప్పుమంటే చెప్పడు.. రూ. 30 లక్షల కోట్ల నుంచి రూ. 14 లక్షల కోట్లు మాఫీ చేసిండు.. పనిచేయకుండా మత విద్వేషాలను పిల్లల మనసులో నింపుతుండు అని పేర్కొన్నారు.

ఏమన్న అంటే జై శ్రీరామ్ అంటాడు.. పనిచేతకాక చేసే పనులు ఇవి.. బీజేపీకి ఉండేదే కొంతమంది అయిన వాళ్లు ఆగమాగం చేసుకుంటరు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఓడించలె.. మనల్ని మనమే ఓడించుకున్నాం. ఒకరిని పిలిస్తే ఒకరు అలిగి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఆ పరిస్థితి లేకుండా మనం అందరం కలిసి పనిచేసుకోవాలె అని కోరారు.

రాముడుతో మనకు పంచాయితీ లేదు. రాముడు మన అందరికీ దేవుడు.. రామున్ని, దేవున్ని మనకు పరిచయం చేసినట్లు బండి సంజయ్ ఫీలవుతున్నాడు. బీజేపీ పుట్టకముందే దేవుడు ఉన్నాడు.. బీజేపీ ఓడిపోయిన దేవుడు ఉంటాడు. రాముడు మంచి దేవుడు.. లంగలు, దొంగలకు ఓట్లు వేయవద్దని దేవుడు కూడా చెప్తడు అని అన్నారు.

ఐదేళ్లు వినోద్ గారు ఎంపీగా పనిచేశారు.. ఐదేళ్లు బండి సంజయ్ కూడా ఎంపీగా పనిచేసిండు. ఐదేళ్లు ఏం పనిచేసినవో చెప్పేందుకు చర్చకు వచ్చే దమ్ముందా బండి సంజయ్‌కి.. ఐదేళ్లు ఒక్క పనిచేయకుండా గాలి తిరుగుళ్లు తిరిగిన వ్యక్తి బండి సంజయ్. ఎక్కడ ఉన్నావ్ అంటే మసీదులు తవ్వటం, ఏ వారం అనటమే .. రాజ్యాంగం తెల్వదు, నదుల పంచాయితీ తెల్వదు.. ఏం తెల్వదు. బండి సంజయ్ తెలంగాణలో ఒక్క గుడికైనా ఒక్క రూపాయి తెచ్చినవా..బండి సంజయ్ దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టుడు కాదు అని ధ్వజమెత్తారు.

కరీంనగర్‌లో మనకు బీజేపీతోనే పోటీ.. అందుకే బీజేపీ గురించి మాట్లాడుతున్నా. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరు.. ఇంత అన్యాయంగా బీజేపీతో కుమ్మక్కై బండి సంజయ్‌కి రేవంత్ రెడ్డి మద్దతిస్తున్నాడు.. దయచేసి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు జరగవద్దు అని కేటీఆర్ అన్నారు.

మనం వెళ్లి ప్రతి రైతును అడగలే మార్పు మంచిగుందా అని.. ఈ ముఖ్యమంత్రివి చిల్లర, ఉద్దెర మాటలే. లంకె బిందెలు అని అంటాడు.. ఎవరన్నా ముఖ్యమంత్రి అనే మాటలా.. జేబులా కత్తరె పెట్టుకొని తిరుగుతున్న అన్నాడు.. దొంగలు కదా జేబుల కత్తెర పెట్టుకుంటాడు. తులం బంగారం ఇచ్చిండా.. బంగారం దొరుకతలేదా.. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం ఉండదు అని తెలిపారు.

లోక్‌సభలో ఇద్దరే ఎంపీలు ఉన్న సరే తెలంగాణ తెచ్చిన ఘనత మనది..ఓడిపోతే విలువ ఉండదు.. మనకు మనమే చేసుకున్నాం.. 70 ఏళ్ల వయసులో మనకు స్ఫూర్తిదాయకంగా మన నాయకుడు కొట్లాడుతున్నాడు.. ఎక్కడ పోయిన సరే ప్రజలు అన్న మేము మోసపోయినం అంటున్నారు అని అన్నారు.

రైతులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు అన్ని వర్గాలు ఇదే మాట అంటున్నారు.. ప్రతి ఇంటికి పోయి మనము చర్చ పెట్టాలే.. రుణమాఫీ అయ్యిందా.. ఫించన్ వస్తుందా అడగాలే. మన కార్యకర్తలను బెదిరిస్తున్నారు.. కేసులు పెడుతున్నారు.. అధికార పార్టీ నాయకులకు తొత్తులు పోలీసులు వ్యవహరిస్తున్నారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు మన పార్టీని గెలిపించుకుంటే వాళ్లే భయపడతారు అని పేర్కొన్నారు.

తల్లి లాంటి పార్టీకి కష్టమొచ్చినప్పుడు అంత కలిసి పనిచేయాలే. పట్టింపులు వద్దు.. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావొద్దంటే బీఆర్ఎస్ గెలిచేలా పనిచేయలే. 10-12 సీట్లు మీరు ఇయ్యండి.. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ చిన్న కార్యకర్త కూడా రోడ్డుపై ఫోజులు కొడుతుంటే మీకు బాధవుతుందని తెలుసు.. కాంగ్రెస్‌కు మనకు మొన్నటి ఎన్నికల్లో స్వల్పంగా తేడా మాత్రమే ఉన్నది. మనకు ఎంపీ ఉంటే మనకు శక్తి ఎక్కువగా ఉంటది అని అన్నారు.