mt_logo

మన అవసరాలు కాదని బీజేపీ చేస్తున్న నదులు అనుసంధానం ఆపాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూరులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖచ్చితంగా కరీంనగర్ లోక్‌సభ స్థానంలో గెలిచేది వినోద్ కుమార్ గారే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దానికి కసి తీరా జవాబు ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లు కనబడుతోంది అని పేర్కొన్నారు.

ఎందుకు గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉండాలని కొందరు ప్రశ్నిస్తున్నారు..వాళ్లందరికీ నేను ఎందుకు పార్లమెంట్లో గులాబీ జెండా ఉండాలో చెప్తా. లోక్‌సభలో మన గులాబీ సభ్యులు ఉండకపోతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారు.. మన అవసరాలను కాదని నదులు అనుసంధానం చేద్దామని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు..రాజ్యాంగాన్ని మార్చి.. రిజర్వేషన్లు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపోళ్లు. వీటన్నింటిని వ్యతిరేకిస్తూ కేంద్రాన్ని గల్లా పట్టి అడగాలంటే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండాలె అని తెలిపారు.

బండి సంజయ్‌కి భాష రాదు.. మాట్లాడే సత్తా లేదు. ఐదేళ్లు పని చేసిన తర్వాత ఓట్లు అడిగేందుకు వెళ్లేటప్పుడు ప్రజలకు చేసిందేంటో చెప్పాలె.. చర్చకు వచ్చి ప్రజలకు చేసిందేంటో చెప్పే దమ్ముందా? అప్పుడే ప్రజలే ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయిస్తారు. బీజేపీలో బండి సంజయ్ లాంటి ఐటెమ్ గాళ్లు చాలా మంది ఉన్నారు అని దుయ్యబట్టారు.

కరోనాలో మోడీ మనల్ని కాపాడాడంట.. అందుకే ఓటు వేయాలని దేవేంద్ర ఫడ్నవీస్ అంటడు. కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టిందే మోడీ అని కిషన్ రెడ్డి అంటడు.. బండి సంజయ్ మాట్లాడితే మోడీ దేవుడు అంటడు.. అసలు ఎవనికి దేవుడు. ఆనాడు బడే భాయ్ రూ. 15 లక్షలు, రైతుల ఆదాయం డబుల్,  బుల్లెట్ రైలు, 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇలా అన్ని చెప్పిండు.. మస్త్ ఫేకిండు.. మనకు చెప్పిదానిలో ఏమన్నా చేసిండా? అని కేటీఆర్ అడిగారు.

ఎక్కడ పోయిన ప్రజలు తినే పళ్లెంలా మన్ను పోసుకున్నాం అంటున్నారు.. పాలిచ్చే బర్రెను కాదని పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లు ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అల్గనూరు చౌరస్తాలో నిలబెడితే ఒక్కడు కూడా గుర్తుపట్టరు. జీవన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్‌ను కాదని డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టిన్రు.. రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్‌కు సహకరించేందుకే డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టిండు అని విమర్శించారు.

మహిళలకు రూ. 2500, వృద్ధులకు 4 వేలు, రైతు భరోసా, స్కూటీలు ఇస్తా అన్నాడు.. వచ్చినయా.. ఈ ముఖ్యమంత్రివి చిల్లర, ఉద్దెర మాటలే. సెక్రటేరియట్‌కు పోయి లంకె బిందెలు ఉన్నాయని అనుకున్నా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అంటాడా? లంకె బిందెల కోసం దొంగలు కదా వెతికేది.. మెడల పేగులు వేసుకుంట అంటాడు.. బోటి కొట్టే వ్యక్తివా నువ్వు.. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుత అంటాడు.. ఆయన మన ముఖ్యమంత్రి కావటం మన ఖర్మ అని ధ్వజమెత్తారు.

తెలంగాణ సాధించిన, మంచి పాలన చేసిన మన కేసీఆర్‌ను పట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు..ఇప్పుడు అనిపిస్తలేదా అయ్యే ఎంత పని అయిపాయె అని.. మనకు వాళ్లకు మొన్నటి ఎన్నికల్లో ఉన్న తేడా 1.8 శాతం ఓట్లే. మనల్ని ప్రజలు ఓడించలె.. మనకు మనమే ఓడిపోయినం.. బీజేపీకి ఏ ఊర్లో పోయిన పదిమంది కన్నా ఎక్కువగా ఉండరు.. కానీ వాళ్లకు ఎక్కువ ఓట్లు వస్తున్నయ్ అని అన్నారు.

మనకు మనకు ఎన్ని అయిన ఉండొచ్చు. కానీ తల్లి లాంటి పార్టీకి కష్టమొస్తే అంత కలిసి కట్టుగా పనిచేయాలె..రేవంత్ రెడ్డి ఒక్క సీటు రాదంటున్నాడు.. రెండు సీట్లు వస్తే రాజీమా అంటున్నాడు కోమటి రెడ్డి, బండి సంజయ్ పిచ్చి పిచ్చి వాగుతున్నాడు.. మనం కష్టపడి పనిచేస్తే వాళ్ల నోరు మూపించేయొచ్చు అని పిలుపునిచ్చారు.

బండి సంజయ్‌కి ఏమీ తెల్వదు.. ఆయనకు ఏమీ తెల్వదన్న విషయం కూడా ఆయనకు తెల్వదు. దేవున్ని మనకు బండి సంజయే పరిచయం చేసినట్లు ఫీలవుతున్నాడు.. రాముడు రాజధర్మం పాటించని వ్యక్తి పనికి రాని వ్యక్తి అన్నాడు. మరి బండి సంజయ్ తను రాజధర్మం పాటించి పనిచేయకుండా మత విద్వేషాలు సృష్టిస్తున్నాడు.. దేవుళ్ల పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్న చిల్లర గాళ్లకు బుద్ది చెప్పాలె అని కోరారు.

నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి.. నాలుగు పైసల పని చేయలే. మోడీని ఏమీ అనవద్దని కొంతమంది అంటారు.. అసలు మనల్ని మోసం చేసిందే మోడీ.. ఈ దేశాన్ని ప్రజలను అత్యంత మోసం చేసిన వ్యక్తే మోడీ. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి ముడి చమురు ధర తగ్గింది. కానీ పెట్రోల్, డిజీల్ ధరలను మాత్రం మోడీ పెంచిండు.. పెట్రోల్, డిజీల్ మీద వచ్చే సొమ్ము రాష్ట్రాలకు రాకుండా సెస్ వేసిండు.. ఈ పదేళ్లలో ప్రజల ముక్కు పిండి రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు అని తెలిపారు.

మళ్లీ జాతీయ రహదారుల పేరుతో వాటికి ఖర్చు పెట్టిన అన్నాడు.. మరి టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావో చెప్పుమంటే చెప్పడు. రూ. 30 లక్షల కోట్ల నుంచి రూ. 14 లక్షల కోట్లు మాఫీ చేసిండు.. గ్యాస్ సిలిండర్, అన్ని ధరలు పెంచిన వ్యక్తి దేవుడా? కరోనా టైమ్‌లో కార్మికులకు ఫ్రీ ట్రైన్లు వేయమంటే కూడా వేయలేదు. పదేళ్లు మోడీ చేసింది.. పీకింది ఏమీ లేదు.. పిల్లల మనసులో విషం నింపటం తప్ప ఏమీలేదు అని కేటీఆర్ విమర్శించారు.

మోడీ మీద కొట్లాడిన కేసీఆర్, కేజ్రీవాల్, మమత బెనర్జీ, స్టాలిన్ లాంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టటం.. అరెస్ట్ చేసే పని మాత్రమే పెట్టుకున్నాడు.. బీజేపీ గెలిస్తే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుడు పక్కా. రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నాయి.. ఆయనకు మోడీని అడ్డుకునే సత్తా లేదు. రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ అంటే రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటాడు.. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ అంటే రేవంత్ రెడ్డి మాత్రం అదానీ ఫ్రెండ్ అంటాడు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ అంటే రేవంత్ రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్ అచ్చా హై అంటాడు.. రాహుల్ గాంధీ లిక్కర్ స్కాం లేదు.. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు.. అసలు రేవంత్ రెడ్డి పనిచేస్తుంది మోడీ కోసమా? రాహుల్ గాంధీ కోసమా? అని ప్రశ్నించారు.

ఈ కాంగ్రెస్ నుంచి ముందు జంప్ అయ్యేదే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ వాళ్ల ముందు ఇప్పుడు అవమానం అవుతుందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు..మనం గెలిస్తే ప్రజా బలం ఉంటే.. పార్టీకి గౌరవం పెరుగుతుంది.. మీరు 10-12 సీట్లిస్తే చాలు . మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాజకీయాలను శాసించే పరిస్థితి ఉంటది అని అన్నారు.

కొంతమంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు.. కార్యకర్తలకు ఏమీ అయిన సరే నేను వెంటనే వచ్చేస్తా. పార్టీ శ్రేణులంతా కచ్చితంగా పార్టీని గెలిపించుకుంటామని గట్టిగా పనిచేయాలే. నేల విడిచి సాము చేయకుండా… మే 13 వరకు కష్టపడాలె అని సూచించారు.

మహిళలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లి హామీలు అమలు అవుతున్నాయా అని అడగండి.. ప్రతి ఓటరుకు కాంగ్రెస్ చేసిన మోసం అర్థమయ్యేలా చేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.