mt_logo

కాంగ్రెస్ వాళ్ళు పదవులిస్తామని ఆశపెట్టినా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌కి అండగా వచ్చారు: కేటీఆర్

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట్, గద్వాల్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండ్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌కు ఒకటే జిల్లా ఉండాలని రేవంత్ రెడ్డి అంటుండు.. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే గద్వాల్ జిల్లా మాయమైపోతది. జిల్లా ఉండాలని కోరుకునేవాళ్లంతా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయకుండా వారికి బుద్ధి చెప్పాలె అని పిలుపునిచ్చారు.

గద్వాల్ సభ నాకు ఎన్నికల ప్రచారం సభ మాదిరిగా కాకుండా ప్రవీణ్ కుమార్ గారి విజయోత్సవ సభలా ఉంది. గద్వాల్‌లో మీరు బీఆర్ఎస్‌ను గెలిపించారు.. కానీ జిల్లాలో స్వల్ప తేడాతో 12 సీట్లు కోల్పోయాం అని తెలిపారు.

కాంగ్రెస్ వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపి.. మోచేతికి బెల్లం పూశారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. డిసెంబర్ 9న రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి.. మరి అయ్యిందా రుణమాఫీ? రూ. 500 బోనస్, కౌలు రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు రూ. 12 వేలు వంద రోజుల్లోనే ఇస్తా అన్నాడు..దేవుళ్ల మీద ఒట్టేసి.. గ్యారంటీ కార్డులు చూపటంతో జనం నమ్మారు అని అన్నారు.

ఊసరవెల్లి రంగులు మార్చుతది.. రేవంత్ రెడ్డి తేదీలు మార్చుతున్నాడు. ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు అయితది.. రెండోసారి మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు అయితది..కాంగ్రెస్ వచ్చినకా కరెంట్ కష్టాలు, మోటార్లు కాలిపోవటం, నీళ్ల కష్టాలు వచ్చినయా? మంచి నీళ్ల కోసం మీ ఎమ్మెల్యే దీక్ష చేస్తే తప్ప నీళ్లు విడుదల చేయలేని సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని దుయ్యబట్టారు.

ఆడబిడ్డలు పెళ్లిలు చేసుకుంటే తులం బంగారం అన్నాడు.. లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నావ్ రేవంత్ రెడ్డి. మహిళలకు రూ. 2,500 అన్నాడు.. ఎవరికైనా వచ్చాయా? పెద్ద మనుషులకు రూ. 4 వేలు అన్నాడు.. కానీ జనవరి నెల 2 వేలు ఎగ్గొట్టిండు.. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మా బతుకు, తెలంగాణ బాగుండే అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా.. మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసించాలా? ఐతే 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటు వేయండి. 10-12 సీట్లు మాకు అప్పగించండి.. 6 నెలల్లో కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు అని పేర్కొన్నారు.

మీరే కాదు.. మీ ఫ్రెండ్స్, బంధువులందరికీ కారు గుర్తుకు ఓటు వేయమని చెప్పండి.. కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లా పోతది.. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పోతది..కేసీఆర్ గారు ప్రభుత్వ దవాఖానాలను బ్రహ్మండంగా తీర్చిదిద్దారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సర్కార్ దవాఖానాకు పోయే పరిస్థితి లేకుండా చేశారు. ఈ సన్నాసులకు కృష్ణా వాటర్ ఎలా వాడాలో తెలియక కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించారు అని విమర్శించారు.

చోటా భాయ్ ఇట్ల మోసం చేస్తే.. బడే భాయ్ మోడీ ఇంకా మోసం చేసిండు. రూ. 15 లక్షలు అన్నాడు.. 15 లక్షలు వచ్చిన వాళ్లు బీజేపీ ఓటు వేయండి.. రాని వాళ్లు మాకు ఓటు వేయండి. బుల్లెట్ ట్రైన్, ఇంటింటికి నల్లా, రైతుల ఆదాయం రెట్టింపు అంటూ ప్రతి ఎన్నికల్లో సిగ్గు లేకుండా చెబుతున్నారు. కృష్ణా జలాల వాటా ఎంతో అడిగితే కూడా చేయటం చేతకాలేదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

బడి, గుడి, కాలేజ్, హాస్పిటల్ ఇలా ఒక్కటి కూడా కట్టలేదు.. ఒక్క పని చేయలేదు. ఏమన్నా అంటే మేము గుడి కట్టినం అంటారు. జోగులాంబ ఆలయం కేంద్రం చేతిలోనే ఉంది.. కానీ ఈ ఆలయానికి రూపాయ్ ఇవ్వలేదు.. కేసీఆర్ గారు కట్టలేదా? యాదాద్రి గుడిని. మరి మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారా? అంతేకాదు కాళేశ్వరం, ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్లు, మిషన్ కాకతీయ, చెరువులు ఇలా ప్రజలకు మేలు చేసే పనులు చేసిండు అని గుర్తు చేశారు.

ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీలో దారిలో నడుస్తున్నాడు.. ఊరికే ఈ మాటలు చెప్పటం లేదు.. రాహుల్ గాంధీ ఏమో మోడీని చౌకిదార్ చోర్ అంటే మోడీ బడే భాయ్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హై అని రాహుల్ గాంధీ అంటే.. అదానీ హమారా ఫ్రెండ్ అంటున్నాడు.. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అంటే.. రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటాడు. లిక్కర్ స్కాం లేదు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయటం సరికాదు అని రాహుల్ గాంధీ అంటే.. కేసీఆర్ కూతురును అరెస్ట్ చేయటం కరెక్టే.. లిక్కర్ స్కాం జరిగిందని రేవంత్ రెడ్డి అంటాడు అని అన్నారు.

రోహిత్ వేముల అనే విద్యార్థి పేరుతో దళిత చట్టం తెస్తామని గతంలో కాంగ్రెస్ చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రోహిత్ వేముల దళితుడే కాదని నివేదిక ఇచ్చింది.. అందుకే చెబుతున్నా రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీతో ఉండడు అని అభిప్రాయపడ్డారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ సన్నాసులు ప్రచారం చేస్తున్నారు.. 50 రోజులుగా కేసీఆర్ గారి కూతురు, మా చెల్లెలిని జైల్లో పెట్టారు.. అలాంటి దౌర్భగ్యమైన పార్టీతో మాకు దోస్తీ ఉంటదా.. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ.. బీజేపీతో గతంలో దోస్తీ లేదు.. భవిష్యత్‌లోనూ ఉండదు అని కేటిఆర్ తేల్చి చెప్పారు.

కేసీఆర్ గారు మైనార్టీల కోసం 204 స్కూళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విద్య అందజేసే ప్రయత్నం చేశారు. పైసల కోసం కాదు.. ప్రజల కోసం బతుకుతా అనే విధానంతో ముందుకు వచ్చారు ప్రవీణ్ కుమార్ గారు. అంబేడ్కర్, పూలే, గాంధీ గారి ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన కష్టడుతున్నారు.. కాంగ్రెస్ వాళ్లు ఎన్ని పదవులిస్తామని ఆశ పెట్టిన సరే మన పార్టీకి అండగా వచ్చారు ప్రవీణ్ కుమార్ గారు అని కొనియాడారు.

నడిగడ్డలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ గంజాయి మొక్కలను పీకి అవతల పారేయాలి.. ఇక్కడి ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారికి ప్రవీణ్ కుమార్ గారిని తోడుగా ఇవ్వండి. రూ. 4,125 కోట్లతో గద్వాల్ నియోజవర్గాన్ని అభివృద్ధి చేసింది కృష్ణమోహన్ గారు అని అన్నారు.

అద్భుతంగా పనిచేసే విద్యావంతుడు, అధికారిగానే పది లక్షల మంది పిల్లలకు సేవ చేసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారిని వదులుకోవద్దు అని కేటీఆర్ సూచించారు.