![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2024/04/inshot_20240429_0023272471641944901148261695.jpg?resize=1024%2C576&ssl=1)
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని చొప్పదండిలో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాబోయే పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమారే అని తేల్చి చెప్పారు.
చొప్పదండిలో నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి ఏడ్చుకుంట తిరిగిండు.. బస్సు ఫ్రీ, తులం బంగారం, 4 వేలు, రూ. 2500, రైతు భరోసా, రైతు కూలీ, రూ. 500 బోనస్, స్కూటీలు అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెసోళ్లు అధికారంలోకి వచ్చారు అని విమర్శించారు.
రైతుబంధు, 15 వేలు, 2 లక్షల రుణమాఫీ, రూ. 500, తులం బంగారం, స్కూటీలు వచ్చాయా? రూ. 4 వేలు ఇచ్చుడు కాదు. ఉన్న రెండు వేలు కూడా ఎగ్గొట్టిన లంగ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది నీళ్లు లేవు, కరెంట్ లేదు.. తినే పళ్లెంల మన్ను పోసుకున్నామని అందరూ అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండె అని అనిపిస్తోందా? మళ్లీ కేసీఆర్ తెచ్చుకుందామా? అని అడిగారు.
మీరు 10-12 సీట్లు ఇస్తే ఏడాది లోపే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు.. మీరు కరీంనగర్ ఎంపీగా కేసీఆర్‌ను గెలిపిస్తే తెలంగాణ తెచ్చిండు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిండు.. 12 ఎంపీలతో ఎంత పనిచేస్తడో చెప్పాలా? అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెసోళ్ల మాటలు విని ఏదో అనుకున్నామని రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు చెప్తుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే బస్సు ప్రయాణం ఉండదని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. మీరు మమ్మల్ని గెలిపిస్తే ఇచ్చిన హామీలు నేరవేర్చే విధంగా గల్లా పట్టి నిలదీస్తాం అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి కండువా లేకుండా కనిపిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. బండి సంజయ్‌కి లాభం చేసేందుకు డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టిన్రు. కేసీఆర్ గొంతు పిసికి తెలంగాణకు అన్యాయం చేసే పని చేస్తున్నారు అని పేర్కొన్నారు.
ఎందుకు గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లందరికీ నేను ఎందుకు పార్లమెంట్లో గులాబీ జెండా ఉండాలో చెప్తా.. హైదరాబాద్‌ను కేంద్ర పాలితం చేస్తారని నాకు ఖచ్చితంగా సమాచారం ఉంది.. దీన్ని అడ్డుకునే ధైర్యం బీజేపీ, కాంగ్రెస్ సన్నాసులకు ఉండదు.. మన అవసరాలను కాదని నదులు అనుసంధానం చేస్తామని మోడీ చెప్తుండు.. మన దక్షిణ భారతదేశానికి ఎంపీ సీట్లలో అన్యాయం చేస్తామంటున్నారు.. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ కుట్ర చేస్తుంది.. దాన్ని అడ్డుకునేది గులాబీ జెండా మాత్రమే.. అందుకే గులాబీ జెండాను గెలిపించుకోవాలె అని పిలుపునిచ్చారు.
రాముడు అందరివాడు.. బీజేపీ ఓడిపోయిన సరే దేవుళ్లకు అయ్యేది ఏమీ లేదు. దేవుళ్లను మనకు పరిచయం చేసిందే బీజేపోళ్లు అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. బండి సంజయ్ కరీంనగర్‌కు ఏమీ చేసిండు? గాలి తిరుగుడు తప్ప. చదువుకున్న, విషయ పరిజ్ఞానం ఉన్న మనం వినోదన్నను గెలిపించుకోవాలె అని కేటీఆర్ కోరారు.
దేశంలో అన్ని ధరలను పెంచింది మోడీ.. ఆయన పిరమైన ప్రధాని. పెట్రోల్, డిజీల్, గ్యాస్ ఇలా అన్ని ధరలు పెంచిండు మోడీ.. ధరలు పెంచుడు తప్ప మోడీ దేశానికి చేసింది గుండు సున్నా. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు.. రెండో సారి మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు అని వ్యాఖ్యానించారు.
హామీలు నెరవేర్చని వాళ్లకు మళ్లీ ఓటు వేస్తే ఏమంటాడు ఏం చేయకపోయిన మాకే ఓటు వేశారంటారు.. బీఆర్ఎస్ గెలిపిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ హామీలు నెరవేర్చేటట్టు చేస్తాం అని స్పష్టం చేశారు.