mt_logo

లోక్‌సభ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ గుయ్యిమనాలి: హరీష్ రావు

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి నోట్లు వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఉద్దెర మాటలు చెప్పడం తప్ప.. జనాలను ఉద్దరించింది లేదు అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీను నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను నట్టేట ముంచారు.. కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాల వారు గోస పడుతున్నారు. కేసీఆర్ పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి అందరికీ అందింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు.. కరెంట్ కోతలు, మోటర్ కాలుడు స్టార్ట్ అయినది అని విమర్శించారు.

పదేళ్ళ బీజేపీ పాలనలో ప్రజల కోసం చేసింది ఏమీలేదు.. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారం మోపింది. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. హామీల అమలు కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంను నిలదీస్తాం.. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని మోసం చేసింది అని దుయ్యబట్టారు.

రాజీనామా విషయంలో రేవంత్ రెడ్డి తోకముడిచి పారిపోయిండు.. రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారు. వరి కొనుగోలులో తరుగు పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లల్లో తరుగు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.. హామీల అమలు కోసం అసెంబ్లీలో గట్టిగా కొట్లడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి అని హరీష్ పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక తిట్ల పురాణం మొదలు పెట్టాడు.. తెలంగాణ ప్రజలకు శ్రీ రామ రక్ష కేసిఆర్. కాంగ్రెస్ వాళ్ళు కొత్త జిల్లాలను తక్కువ చేయడానికి కమిషన్ వేస్తారట. కొత్త జిల్లాలను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని కోరారు.

కాంగ్రెస్ పార్టీ పాలనలో ధరలు పెరిగాయి.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. బీడీ కార్మికులకు కుడా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించారు.. పుర్రె గుర్తు పెట్టీ కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికులను ముంచింది.. బీడీ కార్మికులను అదుకున్నది కేవలం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ముస్లింలను ధోకా చేశాడు.. క్యాబినెట్లో ఒక్క మైనార్టీకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అని గుర్తు చేశారు. మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించండి అని హరీష్ కోరారు.