రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రజలకు అండగా నిలవాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. గత వారం రోజులుగా భారీగా, ఆగకుండా కురుస్తున్న వర్షాల వలన కొన్ని జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ప్రజలకు తోడుగా నిలవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా వరంగల్ లాంటి జిల్లాలో నీట మునిగిన ప్రాంతాలు, గ్రామాలలో సహాయక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానికంగా పార్టీ శ్రేణులు ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులు అందించడం నుంచి మొదలుకొని తమకు తోచిన ఇతర మార్గాల్లోనూ సహాయం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని భారీ వర్షాల వలన తలెత్తుతున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తున్నదని ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులకు బాధ్యత కలిగిన పార్టీగా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.