mt_logo

తెలంగాణ బీజేపీకి అర్వింద్ త‌ల‌వంపులు..ఎంపీ ఒంటెత్తుపోక‌డ‌ల‌పై తిర‌గ‌బ‌డ్డ నిజామాబాద్ బీజేపీ శ్రేణులు!

ఇప్ప‌టికే లుక‌లుక‌లు.. అసంతృప్తుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలంగాణ బీజేపీకి మ‌రో త‌ల‌నొప్పి ఎదురైంది. కొత్త అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి, ఎంపీ బండి సంజ‌య్‌, ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ కమిటీ అధ్య‌క్షుడు ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్గాల్లో ఆధిప‌త్య పోరుతో రోడ్డున‌ప‌డ్డ కాషాయ పార్టీకి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రూపంలో మ‌రో స‌మ‌స్య ఎదురైంది. సీనియ‌ర్ నేత విజ‌య‌శాంతి అస‌హ‌నంతో ఆందోళ‌న చెందుతున్న బీజేపీ నాయ‌కుల‌కు అర్వింద్ వ్యవ‌హారం మ‌రింత ఆందోళ‌న పెంచింది. ఎప్పుడూ నోటు దురుసుతో తానే చ‌క్రాధిప‌త్యం చ‌లాయించాల‌నుకొనే నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు సొంత పార్టీ నాయ‌కుల‌నుంచే నిర‌స‌న సెగ త‌గిలింది. నిజామాబాద్ రాజ‌కీయాల్లో తాను ఎంత చెబితే అంత అని విర్ర‌వీగుతున్న ఆయ‌న‌పై స్థానిక నాయ‌కులు తిర‌గ‌బ‌డ్డారు. ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌లపై విరుచుకుప‌డ్డారు. మ‌ధ్య‌లో పార్టీలోకి వ‌చ్చిన అర్వింద్ పెత్త‌నం చ‌లాయించ‌డ‌మేంట‌ని రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలోనే నిల‌దీశారు.

అర్వింద్‌పై తిరుగుబాటుకు కార‌ణ‌మిదే?
ఎంపీ అర్వింద్ నిజామాబాద్ బీజేపీలో తాను ఎంత చెప్తే అంత అనే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు క‌నీస గౌర‌వం ఇవ్వ‌కుండా ఇష్ట‌మొచ్చిన నిర్ణ‌యాలు తీసుకొంటున్నారు. ఇటీవ‌ల ఎవ‌రితో చ‌ర్చించ‌కుండా.. కనీసం ఎవ‌రికీ స‌మాచారం కూడా ఇవ్వ‌కుండా ఏక‌ప‌క్షంగా 13 జిల్లాల అధ్య‌క్షుల‌ను మార్చేశారు. దీనిపై ప్ర‌శ్నిస్తే అంతా నా ఇష్టం అనే లెవల్‌లో క‌టింగ్ ఇచ్చారు. దీంతో ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, ఆదినుంచీ పార్టీలో ఉన్న‌వారంతా ఎంపీ అర్వింద్‌పై తిర‌గ‌బ‌డ్డారు. ఏకంగా హైద‌రాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాల‌యంలోనే అర్వింద్‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నాకు దిగారు. *అర్వింద్ డౌన్ డౌన్* అంటూ నిన‌దించారు. అర్వింద్ తీరు మార్చుకోక‌పోతే త‌మ‌దారి తాము చూసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై పార్టీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి చెప్పుకొందామంటే బాధ్యుల‌నుంచి స‌రైన స్పంద‌న రాక‌పోవడంతో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తంచేశారు. బీజేపీ అగ్ర‌నాయ‌కులే పార్టీ ప్ర‌భ కోల్పోయేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఎంపీ అర్వింద్ దురహంకారం.. దురుసు ప్ర‌వ‌ర్త‌న‌తో నిజామాబాద్ జిల్లాలో పార్టీకి ఉన్న కనీస ప‌రువుకూడా పోయింద‌ని వాపోయారు. దీనిపై అధిష్టానం స్పందించ‌కుంటే ఇక జిల్లాలో పార్టీ క‌నుమ‌రుగు కావ‌డం కాయ‌మ‌ని పేర్కొన్నారు.