mt_logo

కేటీఆర్ బృందం ఫ్రాన్స్ పర్యటనలో తొలిరోజు సదస్సులు

ఐటీ, పరిశ్రమ శాఖామంత్రి ‘కేటీఆర్’ బుధవారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29న ఫ్రాన్స్‌ ఎగువసభలో జరిగే ‘యాంబిషన్‌ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్‌-డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కోవిడ్‌ ఎరా’ అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అనంతరం పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడులు, అవకాశాలపై వారికి వివరిస్తారు. ఫ్రాన్స్‌ ప్రధాని ‘ఇమ్మాన్యూయెల్‌ మాక్రాన్‌’ సారథ్యంలో ‘యాంబిషన్‌ ఇండియా-2021’ పేరుతో వాణిజ్య సదస్సు జరగనుంది. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌కు ఈ నెల 13న ఆహ్వానం పంపింది. ఈ సదస్సు భారత్‌- ఫ్రాన్స్‌ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొన్నది. ఇలాంటి కీలక వేదికపై తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందని, సదస్సులో వైద్యారోగ్యం, పర్యావరణ మార్పులు, డిజిటల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌, ఆగ్రో బిజినెస్‌ వంటి ప్రధాన అంశాలపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. గతంలో నిర్వహించిన యాంబిషన్‌ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, ఇరు దేశాల కంపెనీల నుంచి 400కు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్‌ ఆహ్వానం.. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. మంత్రి వెంట ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పారిస్‌కు వెళ్లారు.

తొలిరోజు నుంచే ప్రముఖులతో భేటీలు:

మంత్రి కేటీఆర్‌ తన తొలి రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌ ‘హెన్రీ వర్డియర్‌’తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఫ్రాన్స్‌ మధ్య ఇన్నోవేషన్‌, డిజిటలైజేషన్‌, ఓపెన్‌ డాటా వంటి అంశాల్లో పరస్పర సహకారం అందించుకొనే అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో ఇన్నోవేషన్‌, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తీసుకొంటున్న చర్యలను, ఓపెన్‌ డాటా పాలసీ గురించి, డిజిటల్‌ ఇన్‌ఫ్రా చర్యలపై మంత్రి కేటీఆర్‌, హెన్రీకి వివరించారు. ఈ సమావేశంలో ఫ్రాన్స్‌లో భారత డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ కేఎం ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *