కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని ప్రముఖ కోటిలింగాల క్షేత్రం మహాపుష్కరాలకు సిద్ధమైంది. చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రం కావడం, ఎల్లంపల్లి రిజర్వాయర్ వల్ల ఇక్కడి గోదావరి తీరాన ప్రస్తుతం పుష్కలంగా నీరుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముంది. దీంతో ఆమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది.
ఇదీ చరిత్ర..
కోటిలింగాల ప్రస్తుతం ఓ కుగ్రామం. కానీ క్రీ.పూ.4వ శతాబ్దం నాటికే ఆంధ్రుల అతి ప్రాచీన రాజధాని నగరం. ఇది మొదట కోటలోని లింగాలుగా ఉండి, తర్వాత కోట లింగాలుగా, అటుపై క్రమంగా కోటిలింగాలగా మారి ఉంటుందని చరిత్రకారులు, భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. కరీంనగర్ నుంచి లక్షెట్టిపేట వెళ్లే దారిలో వెల్గటూర్ నుంచి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే కోటిలింగాల వస్తుంది. పడమర నుంచి తూర్పునకు ప్రవహించే గోదావరి, ఈ ప్రాంతంలో కొద్దిగా మలుపు తిరిగింది. ఈ వంక దాటీదాటగానే దక్షిణం నుంచి పెద్దవాగు(మునులవాగు) వచ్చి కలుస్తున్నది. ఇలా ఏర్పడ్డ త్రిభుజాకార స్థలంలో సుమారు 2500 ఏళ్ల కిందటి చారిత్రక దిబ్బ 110 ఎకరాల విస్తీర్ణంతో నేలకు ఆరు మీటర్ల ఎత్తున ఉంది.
రాష్ట్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో 1979 నుంచి 1984 వరకు ఇక్కడ తవ్వకాలు జరపగా, ఆంధ్రశాతవాహనుల కాలంనాటి కోట గోడలు, బురుజులు, నివాసాలు, ధాన్యాగారాలు, వేలాది నాణేలు, వస్తువులు బయటపడ్డాయి. అతి ప్రాచీన బౌద్ధస్తూపం(క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది) కూడా వెలుగుచూసింది. శ్రీముకుడి(సీముకుడి) నాణేలతో పాటు అంతకుముందు రాజవంశాలకు చెందిన నాణేలు, నాణేల ముద్రలు కూడా దొరకడంతో శాతవాహనుల కంటే పూర్వమే కోటిలింగాల ఆంధ్రుల రాజధానిగా వర్ధిల్లిందని పురావస్తు శాస్త్రజ్ఞులు తేల్చారు. మలి శాతవాహన రాజులు నిర్మించిన జగత్ ప్రసిద్ధ అజంతా గుహాలయాలకు 300 ఏళ్ల ముందే తొలి శాతవాహనులు కోటిలింగాలకు దక్షిణంగా కిలోమీటరు దూరంలోని మునుల గుట్టపై గుహాలయాలు నిర్మించారు. కోటిలింగాల తవ్వకాల్లో లభించిన చారిత్రక అవశేషాలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలకు తరలించారు.
పుష్కరాలతో కొత్త శోభ..
ఈ నెల 14 నుంచి గోదావరి పుష్కరాల నేపథ్యంలో అధికారులు పనులు ప్రారంభించగా, చారిత్రక కోటిలింగాల కొత్తశోభ సంతరించుకుంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ వల్ల జిల్లాలోని ఈ ఒక్క తీరంలోనే నీరు పుష్కలంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు రానుండగా, రూ. కోటి 6 లక్షలతో రెండు చోట్ల పుష్కరఘాట్ల నిర్మాణం పూర్తి కావచ్చింది.
కోటేశ్వరాలయంపై రెండు గోపురాలు, ఆలయం ముందు భాగంలో మహామండప నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు కాగా పనులు సాగుతున్నాయి. ఆలయం చుట్టూ రూ.30 లక్షలతో రహదారులు నిర్మిస్తున్నారు. వెల్గటూర్ కమాన్ నుంచి ఆలయం వరకు మూడున్నర కిలోమీటర్ల పొడువుతో డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 3 కోట్ల 70 లక్షలు మంజూరు కాగా, పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ రహదారి పూర్తి కాకపోయినా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ లేదు.
విద్యుద్దీపాల అలంకరణ కోసం రూ. 14 లక్షల నిధులు మంజూరు కాగా, పనులు పూర్తి కావచ్చాయి. నాలుగు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి, 200 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి సమస్య లేకుండా పుణ్యస్నానం చేసి వెళ్లవచ్చు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..