mt_logo

కవిత తెలివైన నాయకురాలు- సుమిత్రా మహాజన్

నిజామాబాద్ ఎంపీ కవిత తెలివైన నాయకురాలని, యూరప్ పర్యటన సందర్భంగా భారతీయ మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్పారని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశంసించారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కవిత ఎంతో పరితపిస్తున్నారని చెప్పారు. మంగళవారం వివేకవర్ధిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివేకవర్ధిని కన్యాశాల శతాబ్ది ఉత్సవాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు చదువు ఎంతో ముఖ్యమని, చదువు విషయంలో బాలికలకు స్వేచ్ఛ కల్పించాలని, వారికోసం ప్రతి విద్యాసంస్థల్లో వ్యాయామశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాకుండా ఇందుకు కావాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గొప్పకవి కాళోజీ అని, తెలంగాణ గురించి కాళోజీ రాసిన కవితలు అందరి మన్ననలు పొందాయని అన్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ, బోనాల పండుగలను చూసి గర్వపడుతున్నానని, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణగా నిలుస్తారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాలు ఈ విద్యాసంస్థ నుండే ప్రారంభం అయ్యాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. 90 ఏళ్లకు పైబడ్డ వివేకవర్ధిని పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, వివేకవర్ధిని సొసైటీ చైర్మన్ రామకృష్ణ సెట్ వాలేకర్, ఆధ్యక్షుడు ఆనంద్ అబ్కారీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *