క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 21న ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకలు జరపనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విశిష్ట అతిధిగా హాజరవనున్న ఈ వేడుకల ఏర్పాట్లను షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల శుక్రవారం పర్యవేక్షించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కరోనా కారణంగా గత ఏడాది నిర్వహించలేకపోయినా.. దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిపామని గుర్తు చేశారు. ఈ నెల 21న ఎల్.బి స్టేడియంలో జరిపే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా విచ్ఛేయడమే కాకుండా పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందజేసి,సత్కరిస్తారని మంత్రి తెలియజేసారు. ముగ్గురు బిషప్ లు, క్రిస్టియన్ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ చర్చిల ఫాదర్స్, ఫాస్టర్స్, బ్రదర్స్, సిస్టర్స్ అతిథులుగా హాజరయ్యే ఈ వేడుకలలో సుమారు 12వేల మంది పాల్గొంటారని, ఉత్సావాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కొప్పుల ఆదేశాలు జారీ చేశారు. భోజన ఏర్పాట్లు, తాగునీరు, అత్యవసర వైద్య సహాయం, పారిశుద్ధ్యంపై తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకలు అందరికి సుస్పష్టంగా కనిపించే విధంగా ఎల్ ఈ డి తెరలతోపాటు,స్టేడియం చుట్టుపక్కల స్వాగత తోరణాలు, క్రిస్మస్ ట్రీలతో పాటు చక్కని లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, వేడుకలు ముగిసేంత వరకు గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.

