ఆదివారం రంగారెడ్డి జిల్లా పరిగి, తాండూరు ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో పాల్గొన్న అనంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో పర్యటించారు. నగరంలోని బోడుప్పల్, చిలకలగూడ, కుషాయిగూడ, ఎల్బీనగర్, ఫిల్మ్ నగర్ సభల్లో ప్రసంగించారు. సమయాభావంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ ఎన్నికల ప్రచారసభకు కేసీఆర్ హాజరవ్వలేదు. సభల్లో ప్రసంగించిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పలుహామీలను ప్రకటించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, హైదరాబాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తుందని, దాని ద్వారా ప్రత్యక్షంగా 30లక్షల ఉద్యోగాలు వస్తాయని, ప్రస్తుతమున్న హైదరాబాద్ రెండింతలు పెరుగుతుందని, తద్వారా నగర జనాభా మూడుకోట్లకు చేరుకుంటుందని తెలిపారు.
నగర ప్రజలకు కావలసిన విద్యుత్, తాగునీరు, మౌలికవసతులను కల్పించాల్సిన అవసరం ఉందని, గ్రేటర్ హైదరాబాద్ లో రెండువేల మురికివాడలు ఉన్నాయని, వాటిలో ఉంటున్న బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. జంటనగరాల్లోని గీతకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతామని, ఆటోలకు రవాణా పన్ను రద్దుచేస్తామని, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నగర శివారు గ్రామమైన ఫిర్జాదిగూడ ప్రజలకు ఐదువేల ఇళ్ళను ఉచితంగా నిర్మించి ఇస్తామని చెప్పారు.
హైదరాబాద్ ను యూటీ చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఈనెల 30న తెలంగాణలో పోలింగ్ ముగియడంతోనే సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ను యూటీ చేస్తామని నరేంద్రమోడీ ప్రకటించేలా చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెడితే బాధపడక తప్పదని, తెలంగాణ ప్రజలు ఎవరిచేతిలో తెలంగాణ సేఫ్ గా ఉంటుందో ఆలోచించి ఓటువేయాలని సూచించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావును గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిని చేస్తానని, గ్రేటర్ పరిధిలోని అన్నినియోజకవర్గాల ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.