రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్ల పథకం పది లక్షల మైలురాయిని అధిగమించింది. సీఎం కేసీఆర్ 2017 జూన్ 3న ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 10 లక్షల మంది బాలింతలకు సహాయం అందించడంతో పాటు, గర్భిణులకు ఆర్థికసాయం అందిస్తూ సామాజికంగా అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ప్రభుత్వ దవాఖానల్లో గణనీయంగా డెలివరీలు పెరిగాయి. మాతా శిశు మరణాలకు అడ్డుకట్టపడింది. ప్రైవేట్‌కు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకోవడంతో ఒక్కొక్కరికి సగటున 40 వేల దాకా ఆదా అయింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకున్న అన్ని కుటుంబాలకు కలిపి దాదాపు 4,500 కోట్లు ఆదా అవ్వడమే కాకుండా ప్రభుత్వం నుంచే వారికి కేసీఆర్ కిట్ రూపంలో 1,700 కోట్ల ఆర్థిక సహాయం అందింది.
ప్రసవాలు వంద శాతం సర్కారు దవాఖానల్లోనే జరిపించడం, మాతా శిశు మరణాలను తగ్గించడం అనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఇందుకు దేశవ్యాప్తంగా మాతాశిశు సంరక్షణకు అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. తమిళనాడులో ‘ముత్తు లక్ష్మీరెడ్డి మెటర్నిటీ బెనిఫిట్ స్కీం’ కింద రూ.12 వేలు సాయం చేస్తున్నట్టు గుర్తించారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు అధికారులు తమిళనాడు వెళ్లి అధ్యయనం చేశారు. సీఎం కేసీఆర్ ఈ నివేదికను పరిశీలించిన అనంతరం తెలంగాణలో రూ.15 వేల సాయం చేయాలని నిర్ణయించారు. సర్కారు దవాఖానలో ప్రసవించి, మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డకు 13 వేల చొప్పున అందిస్తున్నారు. దీనికి అదనంగా రూ.2 వేల విలువ చేసే 16 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందజేస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్ కిట్ కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. ప్రసవం తర్వాత తల్లీ, బిడ్డకు అవసరమయ్యే 16 రకాల వస్తువులను ప్రభుత్వం కేసీఆర్ కిట్ పేరుతో అందజేస్తున్నది. బిడ్డకు అవసరమైన సబ్బులు, నూనె, పౌడర్, దోమతెర, చిన్నబెడ్, రెండు బేబీ డ్రెస్‌లు, తల్లికి రెండు చీరలు, టవళ్లు వంటివి ఇందులో ఉంటాయి. ఇవి దాదాపు 3 నెలల పాటు శిశువు అవసరాలను తీరుస్తాయి. కేసీఆర్ కిట్ అందుకున్న గర్భిణులు అందరికీ కలిపి ఏటా సగటున 50 కోట్లకు పైగా విలువైన వస్తువులు అందుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున 263 కోట్లు విలువైన వస్తువులను తల్లులకు అందించడం విశేషం.
కేసీఆర్ కిట్‌తో పెనుమార్పులు :
కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా గర్భం దాల్చిన ప్రతి ఒక్కరి వివరాలను స్థానిక ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఆశ కార్యకర్తలు గర్భిణుల ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గర్భిణిని ఇంటి దగ్గరి నుంచి అమ్మ ఒడి లేదా 108 వాహనంలో దవాఖానకు ఉచితంగా తీసుకెళ్లడం, ఉచితంగా డెలివరీ చేయడం, కేసీఆర్ కిట్ అం దించడం, తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటిదగ్గర దిం పడం వంటి చర్యల ఫలితంగా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కూడా పెరిగింది. గర్భం దాల్చినప్పటి నుంచి వైద్యసిబ్బంది ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుండటం, ప్రభుత్వం పోషకాహారం అందిస్తుండటం, కేసీఆర్ కిట్ కింద ఇచ్చే నగదుతో ఆర్థిక తోడ్పాటు, తద్వా రా గర్భిణికి విశ్రాంతి లభించడం, దవాఖానలో డెలివరీ అవుతుండటం, ఆశ కార్యకర్తలు బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం (పీఎన్సీ విజిట్స్) వంటి చర్యల వల్ల మాతృమరణాలు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రం లో నవజాత శిశు మరణాలు, శిశు మరణాలు, ఐదేండ్లలోపు పిల్లల మరణాలు భారీగా తగ్గాయి.
టీకాల పంపిణీలో దేశంలోనే టాప్ :
పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడంలో కేసీఆర్ కిట్లు కూడా కీలకపాత్ర పోషించాయి. దవాఖానలో ప్రసవం తర్వాత నవజాత శిశువులకు అక్కడే తొలి టీకా వేస్తున్నారు. శిశువుకు మూడున్నర నెలల వయసులో టీకాలు వేసినప్పుడు 2 వేలు, 9 నెలల సమయంలో టీకాలు వేసినప్పుడు 3వేలు చొప్పున కేసీఆర్ కిట్ కింద అందిస్తుండటంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పిల్లలకు టీకాలు వేయిస్తున్నారు. 2014లో 68శాతం మంది పిల్లలకు మాత్రమే టీకాలు వేయగా.. 2021 నాటికి 100 శాతానికి పెరిగింది. తద్వారా దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచింది.