mt_logo

కేసీఆర్ కిట్ పథకం… ప్రపంచంలోనే ఉత్తమం : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం, భద్రత, సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని… మహిళల సంక్షేమం విషయంలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుందని కొనియాడారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు. మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన మహిళా సంక్షేమ – అభివృద్ధి పథకాల వల్లే, నేడు తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని చెప్పడానికి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్స్ పథకం మహిళల విషయంలో గొప్ప అడుగుని, ప్రపంచంలోనే ఉత్తమమని అన్నారు. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ఇప్పటికే 13,30,000 మంది లబ్ధి పొందారని, ఇది తెలంగాణ విజయమని తెలియజేశారు. కేసీఆర్‌ కిట్‌లో… తల్లీబిడ్డకు అవసరమైన 16 వస్తువులు ఉంటాయని తెలిపిన మంత్రి కేటీఆర్… ఆడబిడ్డ పుడితే ఆర్థిక సహాయంగా రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు కూడా అందజేస్తు న్నామన్నారు. డెలివరీ తర్వాత అమ్మ ఒడి వాహనాల ద్వారా తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్నామని, అందుకు 300కు పైగా వాహనాలను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. కేసీఆర్ కిట్స్ వలన దవాఖానల్లో డెలివరీలు 22 శాతం పెరిగాయని 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం డెలివరీలు ఉండగా, కేసీఆర్ కిట్స్ వలన 2021 నాటికి 52 శాతానికి పెరిగాయని, అంటే 22 శాతం అధికం అన్నారు. అలాగే ప్రసూతి మరణాల రేటు 92 నుంచి 63కు తగ్గిందని, శిశు మరణాల రేటు 39 నుంచి 23కు తగ్గిందని వెల్లడించారు. ఇంతటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *