అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మొట్టమొదట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను స్మరిస్తూ, ప్రొ. జయశంకర్ సార్ ఈనాడు లేకపోవడం తీరని లోటని, తనను ఆయన రావు సాబ్ అని ప్రేమతో పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణను కలపొద్దంటూ విద్యార్థులు ఉద్యమం చేశారని, వరంగల్ జిల్లా మర్కజీ కాలేజీలో తెలంగాణ భాషను కించపరుస్తూ అయ్యదేవర కాళేశ్వర ఇచ్చిన ఉపన్యాసాన్ని జయశంకర్ సార్ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. తెలంగాణ అస్థిత్వంపై ఆనాడే లాఠీఛార్జి చేశారని, విద్యార్థుల బలిదానంతో తెలంగాణ ఉద్యమం మొదలైనదని గుర్తుచేశారు.
అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని, ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 1969 కాల్పుల్లో 369 మంది అమరులైనారని, మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి బలిదానం మొదలు ఆ సంఖ్య 1500 కు చేరిందని, నిమ్స్ లో శ్రీకాంతాచారి ఆత్మహత్య తనకు కంటతడి తెప్పించిందని అన్నారు. గత అసెంబ్లీ ఏనాడూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను గౌరవించలేదని, స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినవారి త్యాగాన్ని తెలంగాణ సమాజం మర్చిపోదని స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాలకు చిహ్నంగా హైదరాబాద్ లో అమరవీరుల మెమోరియల్ ను ఏర్పాటు చేస్తామని, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాతనే రాష్ట్ర అవతరణ వేడుకలు ఉంటాయని పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు అసెంబ్లీ నివాళులర్పించింది. 2 నిమిషాలపాటు సభలోని సభ్యులంతా మౌనం పాటించి వారికి నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, విద్యార్థుల గల్లంతుపై తాను తక్షణమే స్పందించానని, ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని హిమాచల్ ప్రదేశ్ పంపించినట్లు చెప్పారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్నివేళలా సహాయసహకారాలు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డలు మాలావత్ పూర్ణ, ఆనంద్ లను అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. పూర్ణ, ఆనంద్ లకు చెరో 25 లక్షల రూపాయలు, వారికి శిక్షణ ఇచ్చిన శేఖర్ బాబుకు 25 లక్షల రూపాయల పారితోషికాన్ని ప్రకటించారు. అంతేకాకుండా పూర్ణ, ఆనంద్ లకు చెరో ఐదు ఎకరాల భూమి, అందులో బోరుబావి, కరెంటు, ఒక సంవత్సరం పెట్టుబడి, ఇప్పుడున్న వారి ఇళ్ళకు మరో మూడు అదనపు గదులు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేస్తూ తీర్మానం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకు కావలిసిన అర్హతలు అన్నీ తెలంగాణకు ఉన్నాయని, కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలను సమానంగా తీసుకోవాలని అన్నారు. పోలవరంపై కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. డిజైన్ మార్చకుండా పోలవరం కడితే నాలుగు రాష్ట్రాల గిరిజనులు నష్టపోతారని, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలన్న కేంద్రం నిర్ణయాన్ని సభ వ్యతిరేకిస్తున్నదని చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని, కేంద్రం బీసీ సంక్షేమశాఖ ఏర్పాటు చేయాలని, సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీలో కేసీఆర్ తీర్మానం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తూ కేసీఆర్ మాట్లాడారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉందని, మహిళలను అన్ని రంగాల్లో ఆహ్వానించాలని, వీలైనంత త్వరగా మహిళా రిజర్వేషన్ బిల్లును తేవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పేర్కొన్న 9 అంశాలకు సంబంధించిన తీర్మానాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు, సూచనలు స్వీకరిస్తామని అన్నారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది.