దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే కీలకమైన సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చైర్మన్ గా ఉంటారు. సంవత్సరం పాటు కేసీఆర్ ఈ పదవిలో ఉంటారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహపూరిత వాతావరణం, సత్సంబంధాలు ఉండేలా చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. జాతీయ సమగ్రతను మరింత పటిష్ఠపరచడం, అభివృద్ధి ప్రాజెక్టులను మరింత వేగవంతంగా, సమర్ధవంతంగా నిర్వహించే వాతావరణం ఏర్పాటు చేయడం, అభివృద్ధిపై రాష్ట్రాల ఆలోచనలు, అనుభవాలు ఎప్పటికప్పుడు కేంద్రంతో పంచుకోవడంలో ఈ మండలి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఈ కౌన్సిల్ లో సభ్యత్వం కలిగి ఉండగా, ఇటీవలే తెలంగాణను కూడా ఇందులో చేర్చారు. తెలంగాణ ఏర్పడిన కొద్దిరోజులకే కేసీఆర్ ను ఈ కౌన్సిల్ కు వైస్ చైర్మన్ గా నియమించడం విశేషం. నియామకం జరిగిన విషయాన్ని తెలియజేస్తూ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మూడు రోజులక్రితం కేసీఆర్ కు ఒక లేఖ వ్రాశారు. కౌన్సిల్ మరింత ప్రభావవంతంగా, నిర్మాణాత్మకంగా పనిచేసేలా కేసీఆర్ కృషి చేస్తారని కోరుకుంటున్నట్లు హోంమంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.