mt_logo

పారిశ్రామికవేత్తల భేటీలో సీఎంపై ప్రశంసల వర్షం

మంగళవారం హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయ హోటల్ లో జరిగిన పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు అక్కడ పాల్గొన్న ప్రతినిధులను మంత్రముగ్ధులను చేశాయి. విధివిధానాల రూపకల్పన గురించి, తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావడమే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమని సీఎం చెప్పడంపట్ల కార్యక్రమానికి హాజరైన పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో అమలవుతున్న పారిశ్రామిక విధానాలపై జరిగిన చర్చలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఫిక్కీ, డిక్కీ, అసోచాం, ఫ్యాప్సీ, సీఐఐ కు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను, అన్ని రంగాల్లో సామాజిక, ఆర్ధిక అసమానతలను రూపుమాపడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. అనంతరం సీఐఐ ప్రతినిధి సురేశ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రసంగించిన తర్వాత తామేం మాట్లాడాలో, ప్రభుత్వాన్ని ఏం కోరాలో తెలియక తికమక పడ్డామని, సరిగ్గా తామేం కోరాలనుకున్నామో వాటినే అమలుచేస్తామని సీఎం చెప్పారని ప్రశంసించారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే విషయంపై వారం రోజులు అధ్యయనం చేసి వచ్చానని, కానీ సీఎం మాట్లాడిన తర్వాత అడగడానికి ఇంకా ఏం మిగలలేదని డిక్కీ ప్రతినిధి రవికుమార్ పేర్కొన్నారు.

విధివిధానాలపై ఎంతో అధ్యయనం చేస్తే తప్ప సీఎం కేసీఆర్ లాగా ప్రసంగించలేరని ఎఫ్ఎస్ఎంఈ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి అన్నారు. ఫిక్కీ అధికార ప్రతినిధి సంగీతారెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేసేందుకు పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశం అంచనాకు మించి విజయవంతమైందని పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కే ప్రదీప్ చంద్ర వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *