ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు మంగళవారం హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హారజయ్యారు. ఈ కార్యక్రమంలో ఆరువేలమందికి పైగా ముస్లిం సోదరులు భారీ ఎత్తున హాజరై ప్రార్ధనలు చేశారు. ప్రార్ధన అనంతరం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సలీం, మహబూబ్ విద్యాసంస్థల అధినేత మహబూబ్ ఆలంఖాన్ సీఎం కేసీఆర్ కు ఖర్జూరా తినిపించారు. అనంతరం కేసీఆర్ కూడా ముస్లిం మతపెద్దలకు ఖర్జూరా తినిపించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రభుత్వం త్వరలోనే ఒక కమిటీని వేసి అధ్యయనం చేస్తుందని, మూడు నెలల్లో ఈ కమిటీ రిపోర్టు వచ్చేలా చూస్తామని తెలిపారు. ముస్లింల కోసం వెయ్యి కోట్లు కేటాయించామని, ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వులు చిందినప్పుడే బంగారు తెలంగాణ సాకారమైనట్లని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు.