కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి అడ్డాగా నిలుస్తున్నాయి. 2012లో కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు కాగా.. అటవీ అధికారులు పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇక్కడి అడవులు పులులకు అనుకూలంగా ఉండటంతో తడోబా, తిప్పేశ్వర్ నుంచి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ఏడెనిమిదేండ్లలో వాటి సంఖ్య పెరిగింది. 2015లో కదంబ అడవుల్లో ఓ ఆడపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. రెండో ఈతలో మరో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. యుక్త వయసు (18 నెలలు)కు వచ్చే పులులు తల్లి నుంచి వేరుపడి స్వతంత్రగా జీవిస్తుంటాయి. ఈ పులులు ఆవాసం కోసం మంచిర్యాల కవ్వాల్‌తోపాటు తడోబా, ఇంద్రావతి అభయారణ్యాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోని తడోబా, ఇంద్రావతి, అభయారణ్యాలను కారిడార్‌గా ఏర్పాటు చేసుకొని స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో 14 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెంచికల్‌పేట్ అడవుల్లో నాలుగు పులులు (రెండు జంటలు) స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగా, మిగతావి ఆవాసం కోసం అడవుల్లో సంచరిస్తున్నట్టు భావిస్తున్నారు. అటవీ అధికారులు ట్రాకర్ల ద్వారా వాటి కదలికలను గమనిస్తూ, పులుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. దట్టమైన అడవులకు తోడు నీటి వనరులు, వన్యప్రాణులు అధికంగా ఉండటంతో ఇక్కడికి వచ్చేందుకు పులులు ఆసక్తి చూపుతున్నాయి.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులతోపాటు మంచిర్యాల జిల్లా అడవుల్లో పులులు సంచరిస్తున్నాయి. బెజ్జూర్, పెంచికల్‌పేట్, పెద్దవాగు, ప్రాణహిత, దహెగాం, కర్జీ, బెల్లంపల్లి, వేమనపల్లి, చెన్నూర్ అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పులులు శారీరకంగా కలుసుకునే సమయం కావడంతో మగపులులు ఆడ తోడు కోసం అడవుల్లో విస్తృతంగా సంచరిస్తుంటాయి. ప్రస్తుతం కాగజ్‌నగర్ కారిడార్‌లో పులుల సంచారం ఎక్కువగా ఉన్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లోని ప్రాణహిత, ఇంద్రావతి నదులను దాటుకొని పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో పులులు అధికంగా సంచరించే ప్రాంతాలపై దృష్టిసారించిన అధికారులు వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు.