mt_logo

నీటికోసం కలిసి సాగాలి

By: కట్టా శేఖర్‌రెడ్డి

నదుల్లో ఎండమావులు ఉండవు. నీళ్లుంటాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? కృష్ణా నీటిలో తెలంగాణకు హక్కులు లేవా? బచావత్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారమే తెలంగాణకు 298 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా అదనంగా కేటాయించిన ఇచ్చిన నీటిలో కూడా 100 టీఎంసీల దాకా మనకే రావాలి. అంటే 398 టీఎంసీల నీటికి మనం లెక్కలు చూసుకోవాలా లేదా?

ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై సీమాంధ్ర మీడియా, వారి అనుకూల మేధావులు చేస్తున్న వాదనలు వారి డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల పూర్తి చేయడంకోసం ప్రారంభించిన ప్రాజెక్టు కాదు. ఎప్పటికీ పూర్తి కాకుండా చూసేందుకు డిజైను చేసిన ప్రాజెక్టు. ఎప్పటికీ వివాదాల్లో నలిగిపోయే విధంగా రూపొందించిన ప్రాజెక్టు. నీళ్లు వచ్చినా రాకున్నా కాంట్రాక్టర్లకు డబ్బులు ముట్టజెప్పేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు. రాయలసీమ కోసం శ్రీశైలంను కబ్జా చేసేందుకు చేవెళ్లకు గోదావరి నీటిని ఎరగా చూపిన ప్రాజెక్టు.

చేవెళ్లకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది నుంచి కాకుండా 1055 కిలోమీటర్ల దూరంలోని తుమ్మిడిహట్టి నుంచి తీసుకురావాలనుకోవడం ఎంతపెద్ద కుట్ర? పోనీ అదయినా సక్కగ చేయలేదు. నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలో అక్కడ పనులు ప్రారంభించకుండా, హెడ్‌వర్క్స్‌కు అనుమతులు, ఒప్పందాలు చేయకుండా కాలువలు తవ్వించే దుర్మార్గమైన విధానాన్ని అమలు చేసిన కీర్తి ప్రతిష్ఠలు ఒక్క రాజశేఖర్‌రెడ్డికే దక్కుతాయి. కొందరు మేధావులు వాదిస్తున్నట్టు ప్రాణహిత-చేవెళ్లపై ఎనిమిది వేల కోట్లో తొమ్మిది వేల కోట్లో ఇప్పటికే ఖర్చు చేశారనే అనుకుందాం.

ఎల్లంపల్లి రిజర్వాయరు ఎలాగూ హైదరాబాద్‌కు నీరు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఎల్లంపల్లి ఇవతల తవ్విన కాలువలూ ఉపయోగపడతాయి. కానీ నీళ్లు మళ్లించడానికి ఉద్దేశించిన తుమ్మిడిహట్టి వద్ద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఇవతల ఇన్నివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు, ఏడెనిమిదేళ్ల తర్వాత కూడా ఒక్క చుక్క నీటిని కూడా పొలాలకు అందించనందుకు ఇంకో దేశంలో అయితే ఆ నాయకులను ఉరితీసేవారు. ఇది ఎంత దుర్మార్గమైన ప్రాజెక్టు అంటే 22 చోట్ల నీళ్లను లిఫ్టుల ద్వారా ఎత్తిపోసి 1757 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకురావాలి.

ఇందుకయ్యే విద్యుత్ ఖర్చు 3466 మెగావాట్లు. ఈ లిఫ్టులను నడిపించడానికి ప్రతిఏటా విద్యుత్‌పై చేసే ఖర్చు ఎన్నివేల కోట్లు ఉంటుందో లెక్కలేదు. ప్రాజెక్టులు ప్రారంభించినట్టు చేయడం, అవి ముందుపడకుండా చూడడం, చివరికి అవి పనికిరాకుండా చేయడం ఆంధ్ర నాయకత్వం ఇంతకాలం అనుసరించిన పద్ధతి.

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆత్మతో ప్రాజెక్టులను సమీక్షిస్తున్నది. హేతుబద్ధమైన ఖర్చుతో, వీలైనంత తొందరగా, సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తెచ్చుకునే విధంగా మొత్తం ప్రాజెక్టులను సమీక్షించాలని(రీ ఇంజనీరింగ్) కృషిచేస్తున్నది. ఏ ప్రాజెక్టయినా 2018 నాటికి పూర్తి అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నీటిపారుదల ఇంజనీర్ల వెంటపడుతున్నారు. సాధ్యంకాని పనులు ముందు పెట్టుకోకండి. మొదలు పెట్టేపనులు ఎంత కష్టమయినా పూర్తి చేయండి అని ఆయన పదేపదే చెబుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టుల లక్ష్యం అంతా కృష్ణా నదిని తెలంగాణకు కాకుండా చేయడంకోసమే జరిగింది. రాజశేఖర్‌రెడ్డి చేవెళ్లకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తే కేసీఆర్ దానిని అడ్డుకుంటున్నారని ఓ వర్గం చాలా అమాయకంగా ప్రచారం చేస్తున్నది.

కృష్ణా నదిలో నీళ్లు లేవు.. గోదావరిలో ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకుందాం అన్నవాదన ఆంధ్ర ఆధిపత్య శక్తులు ఈ ఐదున్నర దశాబ్దాలుగా మనకు నేర్పిన అజ్ఞానం. దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ అన్నది మరో క్రిమినల్ ఆలోచన. తెలంగాణ భూముల గుండా తెలంగాణకు ఉపయోగపడకుండా సాగిపోయే ప్రాజెక్టు ఇది. దుమ్ముగూడెం ప్రాజెక్టును ఖమ్మం జిల్లాకోసం నిర్మించాల్సిందిపోయి, అక్కడి నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించాలని చూశారు.

ఒకవైపు పోలవరం ద్వారా గోదావరి-కృష్ణా లింకుకు కాలువలు కూడా తవ్విన పెద్ద మనుషులు రెండోవైపు ఈ లింకుకోసం కూడా పనులు ప్రారంభించారు. నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు వ్యతిరేకించినా వినకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. టెయిల్‌పాండును వదిలించుకోవడం, దుమ్ముగూడెం బరాజ్ కట్టుకుని ఖమ్మం జిల్లాకు నీరందించడం తెలంగాణ చేయవలసిన పని. అలాగే తుమ్మిడిహట్టి వద్ద కూడా చిన్న బరాజ్ నిర్మించి ఆదిలాబాద్‌లో ఇప్పటికే తవ్విన కాలువల ద్వారా అక్కడ తలపెట్టిన ఆయకట్టుకు నీరివ్వాలని కూడా కేసీఆర్ అధికారులను కోరారు.

నదుల్లో ఎండమావులు ఉండవు. నీళ్లుంటాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? కృష్ణా నీటిలో తెలంగాణకు హక్కులు లేవా? బచావత్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారమే తెలంగాణకు 298 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా అదనంగా కేటాయించిన ఇచ్చిన నీటిలో కూడా 100 టీఎంసీల దాకా మనకే రావాలి. అంటే 398 టీఎంసీల నీటికి మనం లెక్కలు చూసుకోవాలా లేదా? ఇందులో 90 టీఎంసీలను చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల కింద చూపించారు. అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలోని చెరువులు, కుంటలు, చిన్న చిన్న రిజర్వాయర్లలో నిలుపుకునే నీటిని లెక్కగట్టి ఈ 90 టీఎంసీలు మన ఖాతాలో చూపించారు.

ఉదాహరణకు డిండి రిజర్వాయరు ఖాతలో 3.5 టీఎంసీలను, మూసీ రిజర్వాయరులో 9.40 టీఎంసీలను, కోటిపల్లివాగు 2.0 టీఎంసీలు, ఓకచెట్టివాగు 1.9 టీఎంసీల కింద చూపుతారు. కానీ ఈ రిజర్వాయర్లు నిండక చాలా కాలమవుతున్నది. ఒక్క మూసీ రిజర్వాయరుకు మాత్రం రెండేళ్లకోసారి నీళ్లొస్తున్నాయి. మహబూబనగర్, నల్లగొండ, రంగారెడ్డి, జిల్లాల్లో కరువు ప్రభావం వల్ల కృష్ణా ఉపనదులు, వాగులు ఎండి బీటవారుతున్నాయి. ఈ కారణంగా ఆ ప్రాంతాల్లో చెట్టూ చేమా గొడ్డూ గోదా అన్నీ అంతరించిపోతున్నాయి. ఈ 90 టీఎంసీల నీటిని కృష్ణా నుంచి తీసుకునే హక్కు మనకు ఉంది. ఇవే కాదు మిగిలిన 308 టీఎంసీలకు కూడా లెక్క తేలాలి కదా? నాగార్జునసాగర్ ఎడమకాలువ, మాధవరెడ్డి ప్రాజెక్టు, జూరాల, రాజోలిబండ…ఇవేకదా మనకున్న కాలువలు.

వీటి నుంచి ఎంత ఉపయోగిస్తున్నామో లెక్కలు వేస్తే మొత్తం 100 టీఎంసీలకు మించడం లేదు. అంటే కృష్ణా నదిలో మనకున్న నికరజలాలనే మనం ఇంతవరకు ఉపయోగించుకోవడం లేదు. ఎప్పుడో ఆలోచన చేసిన భీమా ప్రాజెక్టు, ఎగువ కృష్ణా ప్రాజెక్టుల ద్వారా మనకు రావలసిన నీటి హక్కులను మనం రాబట్టుకోలేదు. జూరాల నుంచి ఈ నీటిని తీసుకుని ఎండి వట్టిపోయిన ఉపనదులను, వాగులను పునర్జీవింప(రీజెనరేషన్) చేయాలి. డిండి, పెద్దవాగు, మూసీ, ఓకచెట్టువాగులను పునర్జీవింపజేయగలిగితే మహబూబ్‌నగర్ జిల్లా, నల్లగొండ జిల్లా దేవరకొండ, మునుగోడు తాలుకాలు తిరిగి కళకళలాడుతాయి. అంతేకాదు వీటిపై ఉన్నఅన్ని రిజర్వాయర్లను కృష్ణా నీటితో నింపాలి. వరుసగా రెండుమూడేళ్లు ఈ రిజర్వాయర్లను నింపగలిగితే ఈ ప్రాంతమంతా తిరిగి సస్యశ్యామలమవుతుంది.

జీవితం తొణికిసలాడుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టాలని మన ఇంజినీర్లు చాలా కాలంగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందుకు అంగీకరించి కార్యరంగంలోకి దిగారు. రంగారెడ్డికి నీళ్లు తేవడానికి ప్రాణహిత-చేవెళ్ల పథకంలో మాదిరిగా 22 లిఫ్టులు 1757 మీటర్లు ఎత్తిపోయడం అవసరం లేదు. మూడు లేక నాలుగు లిఫ్టులతో 450 మీటర్ల ఎత్తువరకు నీటిని పంపింగ్ చేస్తే రంగారెడ్డి జిల్లాలోకి నీరు వస్తుంది. డిండి, మూసీ నదులతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అనేక వాగులను, రిజర్వాయర్లను పునర్జీవింప చేయవచ్చు.

ఇప్పుడు చెప్పండి- ఏది ఎండమావి? ఏది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు? విచిత్రం ఏమంటే కృష్ణా పరివాహక ప్రాంతంలోకి రాని కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కృష్ణా నీళ్లిచ్చేందుకు అన్ని నియమాలను ఉల్లంఘించి, కొండలు, గుట్టలు, అడవులు తొలిచి ఎంత దూరమంటే అంత దూరం నీళ్లు తీసుకెళ్లడానికి ప్రాజెక్టులు కడుతుంది ఆంధ్ర నాయకత్వం. రాజశేఖర్‌రెడ్డి మొండిగా తెగబడి కృష్ణా నీటిని మళ్లించి కుందు, గాలేరు, పెన్నా, సగిలేరులను తిరిగి బతికించాడు.

తెలంగాణలోనే ఎందుకో ఈ మీనమేషాలు లెక్కించడం, కొర్రీలు వేయడం, వంకరగా ఆలోచించడం? ఇప్పటికైనా మనం మన ఆత్మతో ఆలోచించాలి. మనను ఆవహించిన ఆధిపత్యశక్తుల ప్రభావాల నుంచి బయటపడాలి. వారు నేర్పిన ఆలోచనాధారల నుంచి విముక్తి కావాలి. కృష్ణా నది మనది. ఈ నాలుగేళ్లలో నీటి హక్కులను సాధించుకోకపోతే ఇక ఎప్పటికీ మనకు కృష్ణా దక్కదు. తొలి తెలంగాణ ప్రభుత్వం నీటి సమస్యపై మనసుపెట్టి పని చేస్తున్నది. తెలంగాణలో పనిచేస్తున్న మీడియా మేధావులు, రాజకీయ నాయకులు, అధికారులు, ఇంజినీర్లు అందరూ ఈ విషయంలో ఒక్క బాట పట్టాలి. మిగతా విషయాల్లో భిన్నాభిప్రాయాలు, సంఘర్షణలు ఉండనీయండి. కానీ తాగునీరు, సాగునీరు విషయంలో తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిబిడ్డ ఒక్కమాటగా నిలబడాలి.

తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి కారణం కేవలం సాగునీరు లేకపోవడమే. రైతుల ఆత్మహత్యలు తెలంగాణ, రాయలసీమల్లోనే ఎందుకు జరుగుతున్నాయి? ఆంధ్ర డెల్టా ప్రాంతంలో ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే అక్కడ వ్యవసాయం లాభాసాటి. ఇక్కడ మోయలేని భారం. ఆంధ్ర డెల్టా ప్రాంతంలో రైతు ఎకరా పొలానికి ఏడాదికి 350(ఖరీఫ్‌కు 200 రూ., రబీకి 150 రూ.) రూపాయల ఖర్చుతో నీరు పారించుకుని రెండు పంటలు తీస్తాడు. కరెంటు ఖర్చు లేదు. బోరు ఖర్చు లేదు. రిపేర్ల ఖర్చు లేదు. అర్ధరాత్రి అపరాత్రి కరెంటుకోసం కాపలా లేదు. అప్పులు లేవు. తెలంగాణలో అక్కడక్కడా ప్రాజెక్టుల కింద భూములు ఉన్న కొద్ది శాతం మంది రైతులు తప్ప, అత్యధికశాతం రైతులు ఎకరా పొలం పండించాలంటే నీటికోసం సగటున 20-25 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి పెట్టుబడులు తోడై పంట చేతికి వచ్చే సరికి రైతు నష్టాలతో ఇంటికి చేరుతున్నాడు. ఎప్పుడు ఏ ఖర్చులు మీదపడతాయో తెలియదు. దైవాధీనం వ్యవసాయమైపోయింది.

డెల్టాలో రైతు తన కష్టానికి అదనపు సొమ్మును సంపాదించగలుగుతున్నాడు. ఆ అదనపు సొమ్మును నాణ్యమైన జీవితానికి ఖర్చు చేయగలుగుతున్నాడు. వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టగలుగుతున్నాడు. తెలంగాణ రైతు మనుగడకోసం పోరాడుతున్నాడు. తెలంగాణలో ముందు నుంచీ తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల ఇక్కడి రైతాంగం కనీసం పదివేల టీఎంసీల నీటిని నష్టపోయింది. ఒక్క టీఎంసీ నీటితో పండే వరి ధాన్యం విలువ కనిష్టంగా 25 కోట్ల రూపాయలు. ఆ విధంగా చూస్తే ఇక్కడ రైతాంగం లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పటికీ నష్టపోతున్నారు.

వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితికి నెట్టివేయబడ్డారు. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం కృష్ణా నదిలో మనకు హక్కుగా సంక్రమించిన ప్రతి చుక్క నీటిని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు, గోదావరి నీటిని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు మళ్లించడమే. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టుల రీఇంజినీరింగ్, నదులు, వాగుల రీజెనరేషన్ ఒక యజ్ఞంలా జరగాలి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *