mt_logo

నిరంతర శ్రామికుడు..

By: కట్టా శేఖర్ రెడ్డి..

గోదావరి, కృష్ణా నదీజలాలు తెలంగాణ నేలను పునీతం చేయాలి. ప్రాజెక్టులు పూర్తికావాలి. రిజర్వాయర్లు జలకళతో కళకళలాడాలి. ఆ నీటితో ప్రతి చెరువు నిండాలి. ప్రతి ఎకరం పండాలి. తెలంగాణ పచ్చబడాలె. ముందుతరాలు వైభవం గా జీవించాలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిరంతర చింత న సారాంశం ఇది. ఎంత అధికారం వచ్చినా, ఎంత ఘనవిజయం లభించినా, ఇంటా బయటా, రాష్ట్రంలో దేశంలో ఎన్ని ప్రశంసలు వచ్చినా ఆయన ఇప్పటికీ రైతే. పొలం మడి తడపడం కోసం తపించే రైతు వలె రాష్ట్రంలో జలసాధన కోసం ఆయన తపిస్తారు. సాగునీటి ప్రాజెక్టులపై, తాగునీటి ప్రాజెక్టులపై ఆయన అంతగా అన్నిసార్లు సమీక్షించడం ఆ తపనలో భాగమే. మనం సంక్షేమపరంగా ఎన్ని చేసినా ఏమిచ్చినా.. సాగు, తాగునీరు ఇస్తేనే రైతులు సహా సమస్త ప్రజానీకం ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో సుభిక్షంగా జీవించగలుగుతారని ఆయన నమ్ముతారు. కేసీఆర్ జల స్వప్నం సాకారమైతే ఈ నేల పై ప్రతి నీటిచుక్కలో, ప్రతి చెరువులో, ప్రతి కాలువలో కేసీఆర్ కనిపిస్తారు. తెలంగాణలో ఇంజినీర్లు, అధికారులు కూడా అదే స్ఫూర్తితో ప్రాజెక్టుల పూర్తికి అహోరాత్రులు కష్టపడుతున్నారు. అయితే నీటి వినియోగం విషయంలో మన సమాజంలో చాలామందికి చైతన్యం లేదనే చెప్పాలి. మన కడుపు నిండితే చాలు, మన పొలం పండితే చాలన్న ధోరణే కాల్వల వెంట, చెరువుల వెంట ఉండే రైతాంగంలో కనిస్తున్నది. కాల్వల నీటి నిర్వహణకు సంబంధించి ఒక నియంత్రణా యంత్రాంగం లేదు. అందుకే నిరంతరం కాలువల నీళ్లు చివరిదాకా రాకుండానే ఆవిరైపోతాయి. కాలువల చివర ఉండే భూముల రైతులు కొండకు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తారు. కాలువల వెంట కిలోమీటర్ల దూరం ప్రయాణించి నీళ్లు ముందుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో కాలువ ముందు రైతులకు చివరి రైతులకు ఘర్షణలు జరుగుతున్నాయి.

వందల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. ఉదయ సముద్రం పూర్తిచేసి రెండు దశాబ్దాలు పూర్తయింది. కానీ ఆ రిజర్వాయర్‌ను ఇప్పటికీ పూర్తిస్థాయిలో నింపే(1.5 టీఎంసీలు) ప్రయత్నం జరుగలేదు. ఎందుకంటే రిజర్వాయర్లు మునిగే భూములకు పరిహారం చెల్లించలేదని కొందరు రైతులు ఇప్పటికీ ఫిర్యాదు చేస్తారు. ఇదొక సమస్య అయితే ఆ కాలువ కింద డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికీ ఉపయోగంలోకి రాలేదు. చాలా డిస్ట్రిబ్యూటర్ల కింద మొదటి భూములకు తప్ప కిందిదాకా నీరు వెళ్లడం లేదు. ఉదయ సముద్రం దిగువన డీ 39, డీ 40ల కింద గ్రావిటీతో నీరు నింపగలిగిన చెరువులు 30కి పైగా ఉన్నాయి. అందులో సగం చెరువులకు కూడా నీరందడం లేదు. కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడం, నీటి ప్రవాహ సామర్థ్యం చాలా తక్కువగా ఉండటం అందుకు కారణం. నాగార్జునసాగర్ వరద కాలువ కింద కూడా అదే పరిస్థితి. దాదాపు అన్ని కాలువలు, రిజర్వాయర్ల కింద ఇదే పరిస్థితి ఉంది. శ్రీశైలం, నాగార్జుసాగర్‌లకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నేలలు తడవడం లేదు. మరోవైపు ఆంధ్ర ప్రభుత్వం మాత్రం 500 కిలోమీటర్ల దూరంలోని పెనుగొండ, మదనపల్లి, కుప్పంల దాకా నీరు తీసుకెళ్లగలుగుతున్నది. మనదగ్గ ర చెరువులు నింపడమన్నది ప్రథమ ప్రాధాన్యం కింద లేదు. పొలాలకు నీళ్లు ఇచ్చుకున్న తర్వాతనే ఎక్కువైతే కిందికి వస్తాయి. ఇంజినీర్లను అడిగితే ఈ డిస్ట్రిబ్యూటర్ల కింద చెరువులు నింపే ప్రొవిజన్ లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తికి అనుగుణంగా చెరువులను నింపడం ప్రథమ ప్రాధాన్యం చేస్తూ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన విధా నం రూపొందించాల్సి ఉంది. భూగర్భజలాలు నానాటికీ అంతరించిపోతున్న తరుణంలో, తిరిగి జలసంపదను పురుద్ధరించడానికి ఇదొక్కటే మార్గం. చెరువు అంటే ఒక గ్రామ జీవితం. చెట్టూ చేమా పక్షులు మనుషులు పచ్చగా జీవించడానికి ఉండే ఆదెరువు. చెరువుంటే, అందులో నీరుంటే ఆ ఊరు సుభిక్షంగా ఉంటుంది. ఆ ఊరు ధీమాగా ఉంటుంది. ఆత్మగౌరవంతో బతుకుతుంది. స్వయం సమృద్ధి సాధిస్తుంది.

నీరుంటే రైతు ఎవరిపై ఆధారపడకుండా బతుకుతాడు. నీరుంటే గొడ్డూ గోదా పెంచుకుంటాడు. చెరువు నిండితే కాలువ నీరు తమ పొలాలకు రానీ రాకపోనీ రైతు ధీమాగా వ్యవసాయం చేసుకుంటాడు. భూగర్భ జలాలు మళ్లీ పైకి వస్తాయి. వరుసగా నాలుగేండ్లు చెరువులు నిండితే ఊర్లలో బావు లు అలుగులు పోస్తాయి. చేదబావుల్లో చేతికి నీరందుతుంది. వాగులు వంకలు పునరుజ్జీవం పొందుతాయి. ఉపనదులకు కూడా నిరంతరం నీరందుతుంది. చెరువుకుండే బహుముఖ ప్రయోజనం ఇది. ఇదొక ఉద్యమంగా జరుగాలి. గొలుసు చెరువులను గుర్తించమని చెప్పి, వాటిని నింపడానికి ప్రణాళిక రూపొందించమని ముఖ్యమంత్రి పురమాయించడం అందులో భాగమే. గొలుసు చెరువులను గుర్తించి తొలి చెరువును నింపితే అది అలుగుపోసి చివరి చెరువు దాకా నిండేందుకు సులువవుతుంది. కాలువలు కూడా అవసరం లేదు. ప్రతి సీజన్‌లో తొలుత చెరువులు నిండేదాకా పొలాలకు నీరు పెట్టకుండా తూములు తెరువకుండా నియంత్రణ జరుగాలి. అందుకు ఒక యంత్రాంగం ఏర్పడాలి. రైతులు కూడా చెరువులకు నీరిచ్చినంత కాలం కాలువల జోలికి వెళ్లకుండా చైత న్యం ప్రదర్శించాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్మించిన ప్రాజెక్టులు, కాలువల కింద నీరు నింపడానికి అవకాశం ఉన్న చెరువులను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 48,843 చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలు ఉంటే అందులో 12567 గొలుసుకట్లు ఉన్నట్టు, వాటికింద 27,814 చెరువులు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కాలువలను ఈ గొలుసుకట్లకు అనుసంధానం చేసి, వాటికింద వచ్చే చెరువులన్నింటినీ నింపడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇది నిజంగా ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞం పూర్తయితే తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి.

ఎప్పుడైనా, ఏ నాయకుడైనా ఇటువంటి ఆలోచన చేశారా? ఆరు దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఉన్న చెరువులు అంతరించిపోవడం తప్ప వాటిని బతికించాలన్న సంకల్పం ఏ నాయకుడైనా చేశారా? చెరువుల కింద వ్యవసాయం ఒకప్పుడు వైభవంగా సాగింది. తరిసేద్యంలో ఎక్కువ భూమి చెరువుల కిందే ఉండేది. తెలంగాణలో 1956లో సమైక్య రాష్ట్రంలో కలిసే నాటికి చెరువులకింద 13.11 లక్షల ఎకరాలు సాగయ్యేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సుదీర్ఘ సమైక్య పాలనలో చెరువుల కింద సాగయ్యే భూమి 5.3 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. విషాదమేమంటే నదీజలాల వాటాల లెక్కలు చూపించేటప్పుడు మాత్రం తెలంగాణ రెండు నదుల జలాలను చెరువుల ద్వారా 265 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటున్నట్టు వాదించేవారు. రికార్డుల్లో నమోదు చేసేవారు. అంతనీరు చెరువుల్లో ఉంటే సుమారు 30 లక్ష ల ఎకరాలను సాగుచేయవచ్చు. చెరువులన్నింటినీ పునరుద్ధరించుకొని వాటికింద భూమిని సాగులోకి తీసుకువస్తే తెలంగాణ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. చెరువులకు జలకళను పునరుద్ధరించి మళ్లీ పూర్వవైభవాన్ని ఆవిష్కరించడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఎప్పుడూ నిత్యనూతనంగా ఆలోచించడం ఆయన ప్రత్యేకత. ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. నదుల నుంచి నీటిని భారీ ఎత్తున ఎత్తిపోసేందుకు ముహూర్తం సమీపిస్తున్నది. అయినా కేసీఆర్ విశ్రమించడం లేదు. మరో కొత్త లక్ష్యాన్ని సృష్టించుకుంటారు. దాని వెంటపడుతారు. మిగిలిన రాజకీయ నాయకులకు కేసీఆర్‌కు అదే తేడా. ఆయన అందరిలా రాజకీయ నాయకుడు కాదు. రాజనీతిజ్ఞునిగా, రైతుబిడ్డగా, పెద్దగా ఆలోచిస్తారు. పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు. కార్యాచరణ కూడా అంతే పెద్దగా చేపడుతారు. తలపెడితే వెనుకకు తగ్గడం ఆయనకు అలవాటు లేదు. చెరువుల పునరుద్ధరణ, కాలువల అనుసంధానం అందులో భాగమే. ఈ స్వప్నం సాకారం కావాలి. తెలంగాణ పల్లెపల్లెకు మళ్లీ జవజీవాలు రావాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *