mt_logo

మరో వారం రోజుల్లో హైటెక్ సిటీకి మెట్రో..

వారం రోజుల్లో హైటెక్ సిటీ వరకు మెట్రో సర్వీస్ ప్రారంభం కానుంది. నాగోల్ నుండి అమీర్ పేట్ కు కారిడార్-3 కు సంబంధించి ఇప్పటికే మెట్రో రైల్ నడుస్తున్న విషయం తెలిసిందే. అమీర్ పేట్ నుండి హైటెక్ సిటీ వరకు గల 10 కిలోమీటర్ల మార్గాన్ని వారంలో అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో ట్రయల్ రన్ ప్రారంభించి రక్షణపరమైన తనిఖీలు చేపట్టారు. ఎన్నో రోజులుగా ఐటీ ఉద్యోగులతో పాటు ఈ ప్రాంతాల ప్రజలు హైటెక్ సిటీ వరకు మెట్రో ప్రయాణం చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ మార్గంలో 8 స్టేషన్లు ఉంటాయి. అవి 1. మధురానగర్(తరుణి), 2. యూసుఫ్ గూడ, 3. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు-5, 4. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, 5. పెద్దమ్మగుడి, 6. మాదాపూర్, 7.దుర్గం చెరువు, 8. హైటెక్ సిటీ…

ఈ 8 స్టేషన్లకు సంబంధించి 10 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వస్తే నాగోల్ నుండి హైటెక్ సిటీ సమీపంలోని ట్రెడెంట్ హోటల్ వరకు రాకపోకలు సాగించేందుకు వీలుకలుగుతుంది. హైటెక్ సిటీ వద్ద రివర్సల్ సౌలభ్యం లేనందువల్ల అమీర్ పేట్ నుండి హైటెక్ సిటీ వరకు చేపట్టే ఆపరేషన్స్ ట్విన్ సింగిల్ లైన్ విధానంలో జరుగుతాయి. ఈ విధానం వల్ల మెట్రో రైళ్ళు ఒకే లైన్ నుండి వెళ్లి తిరిగి అదే లైన్ లో వెనుకకు రానున్నాయి. సిగ్నలింగ్ సిస్టమ్స్ లో సీబీటీసీ(కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్) విధానం ట్విన్ సింగిల్ లైన్ విధానంలో పనిచేస్తుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో ప్రారంభించబోయే ఈ 10 కిలోమీటర్ల మార్గం నగర రూపురేఖలను మార్చనున్నదని, ప్రారంభానికి సంబంధించిన తేదీని ప్రభుత్వం నిర్ణయిస్తుందని అన్నారు. ఇక కారిడార్-2 లోని జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు నిర్మిస్తున్న 10 కిలోమీటర్ల మార్గం ఈ ఏడాది జూలై నెలలో అందుబాటులోకి వస్తుందని, ఇప్పటికే నగరంలో 46 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చి నిత్యం 1.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *