రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి మరో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గతంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతిగ్రామంలో ఉచితంగా నేత్రపరీక్షలు నిర్వహించి, లక్షల మంది పేద వృద్ధులకు, అవసరమైన వారికి కండ్లజోళ్లనూ అందించింది. ఈ నేపథ్యంలో మరోసారి కంటివెలుగు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కంటివెలుగు కార్యక్రమం అమలుతీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు, ప్రజారోగ్యం తదితర అంశాలపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గతంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా కంటిచూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు ఈ పథకం ద్వారా కంటిచూపు అందింది. రాష్ట్రప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహించి, కండ్లజోళ్లను అందించింది. పేదలకన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు పథకం ద్వారా నేత్రపరీక్షలు నిర్వహించి కావాల్సిన వారందరికీ ఉచితంగా కండ్లద్దాలను అందిస్తాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.