కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలన్నీ తప్పని మరోసారి రుజువైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలు తదితర అంశాలపై సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నకు… ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ కోసం రుణాలను మంజూరు చేశాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం పొందిన రుణాలతోపాటు అన్ని టర్మ్ లోన్లు, ప్రాజెక్ట్ సాంకేతిక సాధ్యత, ఆర్థిక, వాణిజ్య సాధ్యత, బ్యాంకబిలిటీ ఆధారంగా ఆమోదం పొందాయని స్పష్టంచేసింది. దీంతో విపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తేటతెల్లమయింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా పొందిన అన్ని కార్పొరేషన్లు, పీఎస్‌యూల రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఆయా ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్కరద్… కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇతర అన్ని టర్మ్ లోన్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, సాంకేతిక సాధ్యాసాధ్యాలకు సంబంధించి తమ బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారమే పీఎస్‌బీలు అంచనా వేశాయని వెల్లడించారు. ప్రాజెక్ట్ ఆర్థిక/వాణిజ్య సాధ్యత, బ్యాంకు సామర్థ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల కోసం, మదింపులో టెక్నో-ఎకనామిక్ వాల్యుయేషన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నారని వివరించారు. తెలంగాణ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు పొందిన రుణాన్నీ ఆర్బీఐ నిబంధనల మేరకే ఉన్నాయని స్పష్టం చేశారు.

